దట్టమైన అడవులతో నిండిన ఎత్తైన కొండలు, వాటి మధ్య నుంచి పారే జలపాతాల సోయగాలు చూడాలంటే కేరళలో మంకులం అనే ఊరికి వెళ్లాల్సిందే. అక్కడ గలగల పారే సెలయేటి చప్పుళ్లు వింటూ, ప్రకృతి ఒడిలో జీవిస్తున్న ప్రజలతో ముచ్చట్లు పెడుతూ ఆ ప్రదేశంలోని ప్రశాంతతను ఆస్వాదించొచ్చు. అక్కడి ప్రజల జీవనం అంతా ప్రకృతి ముడిపడి ఉంటుంది. ఇలా ఎన్నో విశేషాలను తనలో దాచుకున్న మంకులం గురించి తెలుసుకోవాలంటే కేరళలోని ఇడుక్కి జిల్లాకు వెళ్లాల్సిందే.
కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఉంది మంకులం అనే ఈ ఊరు. ఈ ఊళ్లో ఎటు చూసినా, చెట్లూచేమలూ, వాగులువంకలూ, జలపాతాలు.. పల్లికున్ను, మునిపారాకున్ను, పార్వతిమాల, కిలిక్కల్లు మాల, విరింజపర వంటివి మంకులంలో ఉన్న కొన్ని ముఖ్యమైన పర్వతాలు. మంకులం మొత్తంలో దాదాపు 25 శాతం అడవులు ఉన్నాయి.
వాకింగ్ ప్రోగ్రామ్
మంకులంలో గ్రామస్తులతో కలిసి నడుస్తూ ఊరిని చూసేందుకు వెళ్తే ఊరి గురించి బోలెడు విషయాలు ఎన్నో తెలుస్తాయి. ముఖ్యంగా అక్కడి ప్రజలు, వాళ్ల విశ్వాసాలు, పురాణాల గురించి వివరంగా చెప్పేందుకు అక్కడ గైడ్ ఉంటాడు. ఈ వాకింగ్ ప్రోగ్రామ్ దాదాపు మూడు గంటలు ఉంటుంది. శతాబ్దాల నాటి చరిత్రతో పాటు, సుబ్రమణ్యస్వామి, విరింజపరలోని మరో దేవాలయం గురించి తెలుసుకోవచ్చు. విరింజపరకు వెళ్తున్నప్పుడు ఎత్తుపల్లాల దారిలో నడుస్తుంటే వాగులువంకలు పలకరిస్తాయి. పక్షుల కిలకిలారావాలు వినిపిస్తాయి. చుట్టూ దట్టమైన అడవితో ఉన్న కొండపై విరింజపర అనే విశాలమైన ఖాళీ స్థలం ఉంటుంది. తరచుగా ఏనుగులు వస్తుంటాయి. ఈ ప్రాంతానికి సీతాకోకచిలుకలు, పక్షులను ఫోటోలు తీసుకోవాలంటే ఇది బెస్ట్ ప్లేస్.జలపాతాలు, వ్యవసాయ భూములు, వన్యప్రాణులకు మంకులం ఫేమస్. మంకులంలో కనిపించే స్థానిక, వలస పక్షుల గురించి తెలుసుకునేందుకు ‘బర్దింగ్’ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. పక్షుల గురించి ప్రతి విషయాన్ని వివరంగా చెప్తారు బర్డ్ ఎక్స్పర్ట్. రకరకాల జాతుల పక్షులను చూస్తూ నడుస్తుంటే ఆ అనుభూతిని ఎవరికి వారు ఆస్వాదించాల్సిందే. ఈ ప్రాంతానికి వచ్చిన పాపులర్ పక్షుల్లో బ్లైత్స్ రీడ్ వార్బెల్లర్, వైట్ చీక్డ్ బార్బెట్, బ్రౌన్ చీక్డ్ ఫుల్వెట్టా ఉన్నాయి.
చాక్లెట్ వర్క్‌షాప్
మంకులంలో చాక్లెట్ తయారీ వర్క్‌షాప్ ఉంటుంది. టూరిస్ట్‌లు కూడా అందులో పార్టిసిపేట్ చేయొచ్చు. అక్కడి కొకొవా ప్లాంటేషన్ వరకు నడుస్తూ కొకొవా సాగు గురించిన విశేషాలు అడిగి తెలుసుకోవచ్చు. కొకొవా ప్రాసెసింగ్ చూడొచ్చు.
వెదురుతో...
మంకులం వాసులు జీవన విధానంలో ప్రతిదానికీ వెదురు ఈనెలు వాడతారు. వెదురు ఈనెలతో నేయడం గురించి వర్క్‌షాప్‌లో పార్టిసిపేట్ చేస్తే... ప్రకృతి, మనుషుల మధ్య అనుబంధం అర్థమవుతుంది. రెండు గంటలపాటు జరిగే ఈ వర్క్‌షాప్‌లో టూరిస్ట్‌లు కూడా పాల్గొనొచ్చు. దట్టమైన అడవులకు దగ్గరగా జీవిస్తున్న వాళ్ల కథలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి.
తేనెటీగలు పట్టి, వాటిని భద్రపరచడం, తేనె తీయడం వంటివి కూడా ఇక్కడ కనిపిస్తాయి. వీటితోపాటు పుట్టగొడుగుల పెంపకం, ప్యాకింగ్, జాజికాయ సాగు గురించి కూడా తెలుసుకోవచ్చు. మంకులం సేంద్రీయ వ్యవసాయానికి ప్రసిద్ధి. అడవుల అంచుల్లో నివసిస్తున్న ముదువన్ లేదా మున్నార్ తెగలను, వాళ్ల కల్చర్‌ని ఇక్కడ చూడొచ్చు. సాయంత్రం వేళల్లో సంప్రదాయ నృత్యాలు ఉంటాయి. జానపద కథలు కూడా చెప్తారు. ఈ వేడుక కన్నుల పండుగగా ఉంటుంది.
ఒకపక్క ప్రపంచం టెక్నాలజీ, డెవలప్మెంట్ అంటూ రోజుకో రకంగా మారిపోతుంటే... ఆ ఛాయలు తమ మీద పడకుండా సాంప్రదాయ పద్ధతులు, నైపుణ్యాలను, యువతను ఎలా కాపాడుకుంటున్నారో ఇక్కడి వాళ్లను చూస్తే తెలుస్తుంది. అలాగే వీళ్ల వంట కూడా స్పెషల్‌గా ఉంటుంది. అదెలాగంటే... వాగులో అప్పుడే పట్టిన చేపలను తెచ్చి, ఆ ప్రాంతంలో దొరికే సుగంధ ద్రవ్యాలతో కలిపి, వెదురు కర్ర లోపల కూరి వండుతారు. ఇవన్నీ చూడాలంటే మే నుంచి ఆగస్ట్ నెలలోపు ఈ ఊరికి వెళ్లాలి.
చూడాల్సినవి
- కైనగిరి జలపాతం : దక్షిణాది సినిమాల షూటింగ్ లొకేషన్‌గా ఇది పాపులర్. వందలాది మంది విజిటర్స్ ఈ ప్లేస్‌కి వెళ్తారు. ఇక్కడికి వెళ్లాలంటే... ఉదయం 8 నుండి సాయంత్రం 5 వరకు మాత్రమే పర్మిషన్ ఉంటుంది.
- కన్నడిపరా : విశాలమైన రాళ్లతో అందమైన అడవుల గుండా సాగే ట్రెక్కింగ్ చేయొచ్చు ఇక్కడ. ఏరియా అంతా చల్లగా ఉంటుంది.
- కిలికల్లు : కిలికల్లు అనే పర్వతం నిటారుగా ఉంటుంది. ఇది ట్రెక్కర్లకు సవాల్ విసురుతుంది.
- పెరుంబన్కుతు : ఇది మంకులంలోనే కాదు, కేరళలోనే అతిపెద్ద జలపాతం. ఈ జలపాతాన్ని ఎక్కడి నుంచైనా చూడొచ్చు. చుట్టూ కొండలు, చెట్లు, అడవి మధ్యలో పారే ఈ జలపాతం చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. ఇది చూడాలంటే వర్షాకాలంలో వెళ్లాలి. మంకులం నుంచి నాలుగు కిలో మీటర్ల దూరంలో ఉంటుంది.
- నక్షత్రకుత్ : నక్షత్రకుత్ అనేది అద్భుతమైన జలపాతం. ఇది విరిపారా నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. ట్రెక్కింగ్‌కి వెళ్తే నది ఒడ్డున నడుస్తూ వెదురు వన, ఔషధ తోటలను చూడొచ్చు. ఇక్కడ నది మీద వేలాడే వంతెన ఉంటుంది. ఈ ప్రాంతం ట్రెక్కింగ్ చేయడానికి, పక్షుల్ని చూసేందుకు అనువుగా ఉంటుంది.
- కొజియాలకుతు : ఇది మరొక జలపాతం. అనకులం నుండి రెండు కిలో మీటర్ల దూరంలో ఉంది. ఇది కూడా ట్రెక్కింగ్‌కి, పక్షుల్ని చూసేందుకు బాగుంటుంది.
- వలియపరకుట్టి : అనకులం నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతంలో ఎటు చూసినా ఆకుపచ్చని ప్రకృతి పలకరిస్తుంది. ఆ అందాలను చూడాలంటే రెండు కళ్లూ సరిపోవు.
ఎలా వెళ్లాలి?
హైదరాబాద్ నుంచి మంకులంకు విమానంలో కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకోవాలి. అక్కడి నుంచి బస్ లేదా ట్యాక్సీలో మంకులం వెళ్లాలి. ట్రెయిన్లో అయితే కొట్టాయం రైల్వే స్టేషన్ నుంచి లోకల్ బస్ లేదా ట్యాక్సీల్లో మంకులం చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి మంకులంకి ప్రత్యేకంగా టూరిస్ట్ బస్సులు ఉంటాయి. ఇదేదీకాదనుకుంటే కారులో రోడ్డు జర్నీ చేయొచ్చు.