ఒక్లహామా సిటీ: అమెరికాలో టోర్నడోలు, తుఫాన్ బీభత్సం సృష్టించాయి. ఈ ఆకస్మిక విపత్తుతో పదకొండు మంది చనిపోయినట్టు అధికారులు వెల్లడించారు. 23 మంది గాయాలపాలుకాగా, వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. ఒక్లహామా సరిహద్దుకు సమీపంలో ఉన్న వ్యాలీ వ్యూలో ఒకే ఇంటిలో ముగ్గురు కుటుంబ సభ్యులు మృతిచెందినట్టు అధికారులు గుర్తించారు. ఇద్దరు చిన్నారుల ఆచూకీ కనిపించడం లేదని తెలిపారు. కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో వేలాదిమంది జనం అవస్థలుపడ్డారు. శనివారం రాత్రి డాలస్‌కు ఉత్తరాన ఏర్పడ్డ టోర్నడోలతో భారీ వాహనాలు బోల్తాపడ్డాయి.
డ్రైవర్లు ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు పెట్టారు. ఇంటర్‌స్టేట్ రోడ్లు మూతపడ్డాయి. వ్యాలీ వ్యూ సమీపంలో టోర్నడోను అధికారులు నిర్ధారించారు. ఇది 40 కేపీహెచ్తో తూర్పు వైపు కదులుతున్నట్టు గుర్తించారు. నార్త్ డెంటన్ కౌంటీకి టోర్నడో హెచ్చరికను జారీచేశారు. “మళ్లీ సాధారణ స్థితికి రావడానికి సమయం పడుతుంది. తుఫాన్ల వల్ల చెట్లు కూలిపోయి, పవర్ లైన్స్ డ్యామేజ్ అయ్యాయి’’ లోకల్ టెలివిజన్ స్టేషన్ డబ్ల్యూఎఫ్ఏఏ వెల్లడించింది. టెక్సస్, న్యూ మెక్సికో, అరిజోనా, కొలరాడో, ఒక్లహామాలోని కొన్ని ప్రాంతాల్లో కార్చిచ్చులు ఏర్పడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.