ఉమ్మడి కరీంనగర్‌‌‌‌ జిల్లాలో కుండపోత వాన

ఉమ్మడి కరీంనగర్‌‌‌‌ జిల్లాలో కుండపోత వాన
  • ఒక్క రాత్రి వానకే మత్తళ్లు పడిన చెరువులు, కుంటలు

కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్‌‌‌‌ జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురిసింది. రెండు రోజులుగా కురుస్తున్న వానలతో చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయి. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వరదలతో కరీంనగర్ సిటీలోని ముకరంపురంలో ఇళ్లలోకి నడుం లోతు వరకు నీళ్లు చేరాయి. జమ్మికుంట హౌసింగ్ బోర్డుకాలనీలో ఇళ్లలోకి చేరడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. 

  • గన్నేరువరం మండలంలో గుండ్లపల్లి, జంగాపల్లి, పారువెల్ల చెరువులు నిండి లోలెవెల్ కల్వర్టులపై వరద ఉధృతి పెరగడంతో మండల కేంద్రానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అక్కడికి చేరుకొని మత్తడి పరిస్థితిని పరిశీలించారు. 
  • రాజన్నసిరిసిల్ల: రాజన్నసిరిసిల్లలో పాల్వంచ, కూడెల్లి వాగుల వరద నీరు ఎగువ మానేరులోకి భారీగా వస్తోంది. దీంతో ఎగువ మానేరు సామర్థ్యం 31 అడుగులు కాగా ఇప్పటికే 28 అడుగులకు నీరు చేరింది.
  •  బోయినిపల్లి మండలం కోరెంలోని బంట్లకుంట చెరువు మత్తడి దుంకుతోంది. విలాసాగర్ నుంచి కొదురుపాక వెళ్లే రోడ్డుపైనుంచి, వేములవాడ రూరల్ మండలంలోని హన్మాజీపేట నక్కవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మల్లారం సబ్ స్టేషన్‌‌పై పిడుగుపడటంతో  విద్యుత్‌‌ సప్లై నిలిచిపోయింది.  ముస్తాబాద్, తంగళ్లపల్లి, కోనరావుపేట మండలాల్లో భారీ వర్షాలకు పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
  • సిరిసిల్ల పట్టణంలో కొత్త చెరువు నీరు రోడ్డుపై రావడంతో పాతబస్టాండ్ వరకు రోడ్డుపై నీరు నిలిచింది. వేములవాడలో మూలవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పట్టణంలోని బుడదజంగాల కాలనీ నీట మునగడంతో అక్కడి వారిని పునరావాస కేంద్రానికి తరలించారు. 
  • పెద్దపల్లి: పెద్దపల్లిలో జిల్లాలో రాత్రి నుంచి పడుతున్న వానలతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.  జిల్లాలోని హుస్సేన్​మియా, మానేరు వాగుల ప్రవాహం పెరిగిపోయింది. ఓదెల, కాల్వశ్రీరాంపూర్ మండలాల్లోని నక్కల వాగుకు వరద ఉధృతి కొనసాగుతంది. కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఉన్న బ్యారేజీలను ఫ్రీ ఫ్లో కండీషన్​లో కొనసాగిస్తున్నారు. 
  • సుల్తానాబాద్‌‌ మండలం కాట్నపల్లి వద్ద రాజీవ్ రహదారిపైకి వరద చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రేగడిమద్దికుంట, కొదురుపాక గ్రామాల్లో పలువురి ఇండ్లు నీట మునిగాయి. ధర్మపురి మండలం నేరేళ్లలో 90.3 మి.మీ వర్షం 
  • జగిత్యాల: జగిత్యాల జిల్లాలో ఆదివారం కుండపోత వర్షం కురిసింది. ధర్మపురిలో అత్యధికంగా 90.3 మి.మి నమోదయింది. జిల్లాకేంద్రంలోని మెయిన్ రోడ్డుతో పాటు బైపాస్‌‌పై కాలువల్లో వరద నీరు ప్రవహిస్తోంది. కలెక్టర్  సత్యప్రసాద్, ఎస్పీ అశోక్  పలు ప్రాంతాల్లో సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.