ఢిల్లీలో కుండపోత వర్షం.. గంటలో 11 సెం.మీ. వర్షం

ఢిల్లీలో కుండపోత వర్షం.. గంటలో 11 సెం.మీ. వర్షం
  • పలు విమానాల దారి మళ్లింపు
  • రెడ్ అలర్ట్ జారీ చేసిన భారత వాతావరణ శాఖ
  • నేడు పాఠశాలలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం భారీ వర్షం కురిసింది. వాతావరణ శాఖ రెడ్‌‌‌‌ అలర్ట్‌‌‌‌ జారీచేసింది. సెంట్రల్ ఢిల్లీలో ఒక గంటలోనే 11సెం.మీ వర్షపాతం నమోదైంది. మథుర రోడ్, ఢిల్లీ నోయిడా ఎక్స్ ప్రెస్ వేతో పాటు పలు రహదారులు నీట మునిగాయి.  రాకపోకలు నిలిచిపోయి భారీ ఎత్తున ట్రాఫిక్ జాం అయింది. జనజీవనం స్తంభించిపోయింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఢిల్లీకి రావాల్సిన కొన్ని విమానాలను దారి మళ్లించారు. మరికొన్నింటిని రద్దు చేశారు.  

చెరువులను తలపించిన పలు ప్రాంతాలు

డిల్లీలోని చాలా చోట్ల రోడ్లపైకి మోకాల్లోతు నీళ్లు వచ్చాయి. ఐటీవో, ఆర్ కే పురం, జన్‌‌‌‌పథ్, పార్లమెంట్ స్ట్రీట్, కరోల్ బాగ్, నౌరోజీ నగర్, పంత్ మార్గ్, మయూర్ విహార్ వంటి ప్రాంతాలు చెరువులను తలపించాయి. నోయిడాలోని గౌర్ సిటీ, ఫిల్మ్ సిటీతో సహా చాలా ప్రాంతాలు నీట మునిగాయి. గురుగ్రామ్ లోని సుభాష్ నగర్, ఓల్డ్ రైల్వే రోడ్డు వంటి ప్రాంతాల్లోని ప్రధాన రహదారుల పైకి నడుం లోతు నీళ్లు వచ్చి చేరాయి

ఇయ్యాల స్కూళ్లు బంద్

 భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో ఢిల్లీ ప్రభుత్వం గురువారం స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. ఈ మేరకు ఢిల్లీ విద్యా శాఖ మంత్రి అతిషి ఎక్స్ లో ప్రకటన చేశారు.

సబ్జీ మండిలో కుప్పకూలిన భవనం

 కుండపోత వర్షంతో సబ్జీ మండి ప్రాంతంలో  ఓ భవనం కుప్పకూలింది. భవనం కింద చాలా మంది చిక్కుకుపోయారు. అధికారులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మరోవైపు రావూస్ అకాడమీలో ముగ్గురు సివిల్స్‌‌‌‌ అభ్యర్థులు మరణించిన రాజేంద్ర నగర్ ప్రాంతం వరద నీటితో మునిగిపోయింది. అయినప్పటికీ సివిల్స్‌‌‌‌ అభ్యర్థులు వర్షంలోను ఆందోళన కొనసాగిస్తున్నారు.