జలదిగ్బంధంలో సూర్యాపేట జిల్లా

  • ముంచెత్తిన వాన
  • మునిగిన నేషనల్ హైవేలు, స్తంభించిన రవాణా 
  • నిండిన చెరువులు, అలుగు పోస్తున్న వాగులు
  • నిండిన చెరువులు, అలుగు పోస్తున్న వాగులు..

సూర్యాపేట/ నల్గొండ/ యాదాద్రి, వెలుగు :సూర్యాపేట జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోదాడ, సూర్యాపేట, హుజూర్​నగర్​ లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. కోదాడ జలదిగ్బంధంలో చిక్కుకుంది. కోదాడ పట్టణంలో ఇద్దరు వరదలకు కొట్టుకుపోయి మృతి చెందారు. 

మరోవైపు భారీ వరదలతో విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై రాకపోకలను నిలిపివేశారు. పలు గ్రామాల్లో చెరువులు తెగడంతో కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో  సూర్యాపేట జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. ప్రజావాణి సైతం రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సూర్యాపేట మీదుగా విజయవాడ, ఖమ్మంకు వెళ్ళే వారు ప్రయాణం వాయిదా వేసుకోవాలని ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. 

నల్గొండ జిల్లాలో వర్షం..

నల్గొండ : మూసీకి భారీ వరద రావడంతో శాలిగౌరారం, నార్కట్​పల్లి, కేతేపల్లి, నకిరేకల్, సూర్యాపేట, మాడ్గులపల్లి, వేములపల్లి, మిర్యాలగూడ, నేరేడుచర్ల, దామరచర్ల లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. శాలిగౌరారం ప్రాజెక్టుకు నీరు చేరడంతో ఫీడర్​చానల్​ద్వారా మార్గమధ్యలోని 15 చెరువులు నీటితో నింపారు. కట్టంగూరు మండలంలో ఈదులూరు, యరసానిగూడెం చెరువులు అలుగులు పారుతున్నాయి. 

నార్కట్​పల్లిలో అమ్మనబోలు చెరువు నిండడంతో రోడ్డ పైకి నీరు చేరి రాకపోకలు నిలిచాయి. చండూరు మున్సిపాలిటీ పరిధిలోని చనగాని చెరువుకు నీరు రాకుండా వాగును మళ్లించడంతో దిగువన ఉన్న పడమటి తాళ్ల చెరువుకు నీళ్లు రాకుండా ఆగిపోయాయి. మునుగోడు మండలం సోలిపురం వాగు ప్రవహిస్తుండటంతో రాకపోకలు స్తంభించాయి. హాలియా మండలంలో పేరూరు చెరువు నిండింది. నల్గొండ, మిర్యాలగూడ, నకిరేకల్​ మున్సిపాలిటీల్లో నాలాలు పొంగిపొర్లి ప్రవహిస్తున్నాయి. నార్కట్​పల్లి నుంచి 65వ నంబర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్​ను నార్కట్​పల్లి, అద్దంకి హైవేకి దారి మళ్లించారు. దీంతో వేములపల్లి, మాడ్గులపల్లి, మిర్యాలగూడ రోడ్డు పై ట్రాఫిక్​రద్దీ పెరిగింది.  

యాదాద్రిలో మోస్తారు వాన..

యాదాద్రి: యాదాద్రి జిల్లాలో మోస్తారు వర్షం కురిసింది. జిల్లాలోని అడ్డగూడూరులో గడిచిన 24 గంటల్లో 19.6 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. పోచంపలిల్లో 17 సెంటీ మీటర్లు, ఆలేరులో 22, బొమ్మలరామారంలో 5.3 మిల్లీ మీటర్ల వాన కురిసింది. వర్షం కారణంగా అనేకమంది ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. దీంతో ఆర్టీసీ బస్సుల్లో నామమాత్రంగా ప్రయాణికులు ఉన్నారు. రోడ్లపై కూడా వాహనాల రద్దీ తగ్గింది. హైదరాబాద్​ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం కారణంగా మూసీలో వరద పెరిగింది. దీంతో జిల్లాలోని రుద్రవెల్లి వద్ద లోలెవల్ బ్రిడ్జిని తాకుతూ మూసీ ప్రవహించింది. 

సంగెం సమీపంలోని భీమలింగం లోలెవల్ బ్రిడ్జి వద్ద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలు నిలిపివేశారు. దీంతో వలిగొండ మండలం సంగెం, భువనగిరి మండలం బొల్లెపల్లితోపాటు పరిసర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. యాదగిరిగుట్ట, మోటకొండూరు, అడ్డగూడూరు మండలాల్లోని లోలెవల్ బ్రిడ్జిల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను నియంత్రించారు. వదలకుండా కురిసిన వర్షంతో పాటు కొన్నిచోట్ల ఈదురుగాలులు వీయడంతో కొన్ని ప్రాంతాలో వరి, పత్తి చేన్లు దెబ్బతిన్నాయి. 

మహబూబాబాద్ జిల్లాలో రైల్వే ట్రాక్​​పై నుంచి వరద నీరు ప్రవహించడంతో కంకర కొట్టుకొని పోవడం వల్ల ట్రైన్​ సర్వీసులను దారి మళ్లించారు. యాదాద్రి జిల్లాలోని పగిడిపల్లి స్టేషన్​ మీదుగా నడికుడి వైపునకు రైళ్లను నడిపించారు. దీంతో ట్రైన్లు ఆలస్యంగా నడిచాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తోడుగా సోమవారం భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.పైగా రెడ్​ అలర్ట్​ కూడా ప్రకటించింది. దీంతో సోమవారం స్కూల్స్​కు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్​ హనుమంతు జెండగే ప్రకటన విడుదల చేశారు. అదే విధంగా ప్రజావాణి రద్దు చేస్తన్నట్టు తెలిపారు.