దిస్పూర్: బీఫ్ (గొడ్డు మాంసం) తినే వారికి అసోం రాష్ట్ర ప్రభుత్వం షాకిచ్చింది. బీఫ్ అమ్మకాలపై రాష్ట్ర వ్యాప్తంగా నిషేదం విధించింది. అసోం సీఎం హిమాంత బిస్వాశర్మ ఈ మేరకు బుధవారం (డిసెంబర్ 4) ప్రకటించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు, బహిరంగ ప్రదేశాల్లో గొడ్డు మాంసం (బీఫ్) వడ్డించడం తినడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు తెలిపారు. బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. “అసోంలో ఏ రెస్టారెంట్ లేదా హోటల్‌లో గొడ్డు మాంసం వడ్డించకూడదని నిర్ణయించుకున్నాము.
పబ్లిక్ ఫంక్షన్ లేదా పబ్లిక్ ప్లేస్‌లో కూడా ఈ నియమం వర్తిస్తుంది. ఈ రోజు నుండి రాష్ట్రంలోని హోటళ్ళు, రెస్టారెంట్లు, బహిరంగ ప్రదేశాల్లో గొడ్డు మాంసం వినియోగాన్ని పూర్తిగా నిలిపివేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో గతంలో దేవాలయాలకు 5 కిలోమీటర్ల పరిధిలో గోమాంసం వడ్డించకూడదని, తినకూడదని నిబంధన ఉండేదని.. ఈ రూల్ను ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించామని స్పష్టం చేశారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇక రాష్ట్రంలో ఎక్కడ బీఫ్ మాంసాన్ని తినలేరని అన్నారు.
బీఫ్ వినియోగంపై రాష్ట్రంలో ప్రస్తుతం బలమైన చట్టమే ఉందని.. కానీ హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్లిక్ ప్లేసులలో బీఫ్ వినియోగంపై నిషేధం ఆ చట్టంలో లేదని.. దీంతో ప్రస్తుత చట్టాన్ని సవరించి కొత్త నిబంధనలు చేర్చాలని రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సీఎం హిమాంత బిస్వా శర్మ స్పష్టం చేశారు. కాగా, బీఫ్ నిషేదంపై గత కొద్ది రోజులుగా అసోం పాలిటిక్స్ లో రగడ నడుస్తోంది. ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతాల్లో బీజేపీ బీఫ్ పెంచి గెలిచిందని కాంగ్రెస్ ఆరోపణలు చేసింది.
ALSO READ : ఇదెక్కడి శాడిజం: స్కూల్లో మందు తాగాలని లేడీ టీచర్కు ఆర్డర్.. వినలేదని గోడకుర్చీ వేయించిన ప్రిన్సిపాల్
కాంగ్రెస్ ఆరోపణలపై నిప్పులు చెరిగిన సీఎం హిమాంత.. రాష్ట్రంలో బీఫ్ పై పూర్తిగా నిషేధం విధించాలని కాంగ్రెస్ కోరితే తాము ఆ మేరకు నిర్ణయం తీసుకుంటామని ఛాలెంజ్ చేశారు. ఇలా.. ఓ వైపు బీఫ్ పై రాజకీయ రగడ కొనసాగుతోన్న తరుణంలోనే హిమాంత బిస్వాశర్మ సర్కార్ రాష్ట్రంలో బీఫ్ వినియోగంపై బ్యాన్ విధించడం గమనార్హం. ప్రభుత్వ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తుంటే.. ప్రజలు ఏం తినాలో కూడా ప్రభుత్వమే చెబితే ఎలా అంటూ మరి కొందరు విమర్శిస్తున్నారు.