- మహిళ బతికుండగానే డెత్ సర్టిఫికెట్ సృష్టించి 2.10 ఎకరాలు విరాసత్
- గత ప్రభుత్వ హయాంలో మంచిర్యాల జిల్లా జైపూర్ తహసీల్దార్ ఆఫీసులో అక్రమ పట్టాలు
- అప్పటి ప్రజాప్రతినిధులు, లీడర్లు, రెవెన్యూ అధికారులపై ఆరోపణలు
జైపూర్, వెలుగు: మంచిర్యాల జిల్లా జైపూర్ తహసీల్దార్ ఆఫీసులో అక్రమ భూ పట్టాల బాగోతం బయటపడుతోంది. గత ప్రభుత్వ హయాంలో అప్పటి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, లీడర్లు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డట్టు రుజువవుతోంది. జైపూర్ మండలం మద్దులపల్లి గ్రామంలో ఓ మహిళ బతికుండగానే ఆమె పేరిట ఉన్న లావుని పట్టా విరాసత్ వ్యవహారం ఇటీవల వెలుగులోకి వచ్చింది. గతంలో ఇక్కడ పని చేసిన తహసీల్దార్ సలహాతో నర్సింగాపూర్‌కు చెందిన మాజీ ఉప సర్పంచ్ కలిసి ఈ పని చేసి ఉంటారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
2 ఎకరాలు అమ్మితే.. మరో 10 గంటలు స్వాహా..
మద్దులపల్లికి చెందిన బొద్దున రాజు అనే మహిళ స్థానికంగా ఉండడం లేదు. గ్రామ శివారులో ఆమె పేరిట సర్వే నంబర్ 33/3లో 2.10 ఎకరాల లావుని పట్టా భూమి ఉంది. 2 ఎకరాలు అమ్మడానికి ప్రయత్నిస్తుండగా కొందరు మధ్యవర్తులు జోక్యం చేసుకొని భూమిని కామ నర్సింగం అనే వ్యక్తికి అమ్మారు. ధరణి పోర్టల్‌లో లావుని పట్టా భూమిని వారసులకు తప్ప ఇతరుల పేరిట మార్చడానికి అవకాశం లేదు. దీంతో బొద్దున రాజు బతికుండగానే ఆమె చనిపోయినట్టు డెత్ సర్టిఫికెట్ సృష్టించారు. రాజు వారసుడు కామ నర్సింగం అని ధరణి మాడ్యూల్స్ లో సక్సెషన్ (వారసత్వం) కింద అప్లికేషన్ పెట్టారు. రాజు పేరిట ఉన్న 2.10 ఎకరాల లావుని పట్టా భూమిని కామ నర్సింగం పేరిట అప్పటి తహసీల్దార్ పట్టా ఇచ్చారు.
బతికుండగానే చంపేసి..
బొద్దున రాజు 2 ఎకరాలు అమ్మగా, మిగతా 10 గుంటల భూమి వివరాలను ఆన్లైన్లో చూసుకోగా ఈసీలో ఆమె చనిపోయినట్టు ఉండడంతో అవాక్కైంది. పూర్తి విస్తీర్ణం కామ నర్సింగం పేరిట మారడంతో వెంటనే జైపూర్ రెవెన్యూ అధికారులను సంప్రదించింది. కొన్ని నెలల కిందటే బొద్దున రాజు చనిపోయినట్టు డెత్ సర్టిఫికెట్ పెట్టి వారసుడు కామ నర్సింగం పేరిట వారసత్వంగా మారిందని చెప్పారు. తాను చనిపోయినట్టు తప్పుడు డెత్ సర్టిఫికెట్ పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని, తన 10 గుంటలు తనకు ఇప్పించాలని కోరుతూ గ్రీవెన్స్‌లో అప్లికేషన్ పెట్టుకుంది. ఇప్పటికి నెలలు గడుస్తున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వాపోయింది.
రిపోర్టు చేశాం..
ఈ విషయమై జైపూర్ తహసీల్దార్ వనజారెడ్డిని వివరణ కోరగా.. బొద్దున రాజు చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్ సృష్టించి ఆమె పేరిట ఉన్న భూమిని కామ నర్సింగం పేరిట విరాసత్ చేయించుకున్నాడని తెలిపారు. ఆమె గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేయగా ఉన్న తాధికారులకు రిపోర్ట్ ఇచ్చామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి తప్పుడు డాక్యుమెంట్లు పెట్టి జైపూర్ తహసీల్దార్ ఆఫీసులో భారీగా భూ అక్రమాలకు పాల్పడ్డట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఉన్నతాధికారులు లోతుగా ఎంక్వయిరీ జరిపిస్తే మరిన్ని అక్రమాలు బయటపడే అవకాశముంది.