“ ధైర్యంగా ఉండండి ” ప్రధాని నరేంద్ర మోడీ అన్నమాట ఇది. చంద్రయాన్ –2 ప్రయోగం చివరి క్షణంలో టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చిందంటూ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ( ఇస్రో) చైర్మన్ శివన్ గద్గద స్వరంతో చెప్పినప్పుడు సైంటిస్టులందరికీ ధైర్యం చెప్పడానికి ఇలా అన్నారు మోడీ. ప్రధాని ఒక్కరే కాదు 130 కోట్ల మంది ఇండియన్స్ కూడా “ మరేం పర్లేదు. మీరు 95 శాతం సక్సెస్ అయినట్లే. గో ఎహెడ్ ”అని అంటున్నారు. చాలా మంది అనుకున్నట్టు చంద్రయాన్ –2 ప్రయోగం ఫెయిల్ కాలేదు. నిజంగానే 95 శాతం సక్సెస్ అయింది. చివరిక్షణంలో ఓ టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చింది.అంతే. అయితే ఈ ప్రాబ్లమ్ వస్తుందన్న విషయం ఇస్రో సైంటిస్టులకు తెలియనిది కాదు. ప్రాబ్లమ్ రావచ్చునని ముందుగానే అంచనా వేశారు. అందుకే ప్రయోగంలో ని చివరి 15 నిమిషాలను ‘ టెర్రర్ ’ గా డిక్లేర్ చేశారు ఇస్రో చైర్మన్ శివన్.
చంద్రుడి పై విక్రమ్, ‘ సాఫ్ట్ ల్యాండింగ్ ’ చేసే అపురూప క్షణాలను చూడటానికి దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూసింది. అందరిలోనూ నరాలు తెగే టెన్షన్. విక్రమ్, చంద్రుడిపైకి సక్సెస్ ఫుల్ గా ల్యాండ్ అవడం అంటే చిన్న విషయం కాదు. అసలు ప్రయోగం మొత్తంలో ఇదే చాలా కీలక ఘట్టం. అందుకే శివన్ దీనిని ‘ 15 మినిట్స్ ఆఫ్ టెర్రర్ ’ అని అన్నారు. చివరకు విక్రమ్ ఆ ‘15 నిమిషాల టెర్రర్ ’ టైంలోకి ప్రవేశించింది. ఇస్రో సైంటిస్టులు అందరిలోనూ ఒకటే టెన్షన్. విక్రమ్ పరిస్థితి ఏంటి ? ‘ సాఫ్ట్ ల్యాండింగ్ ’ జరుగుతుందా ? లేదా ? అందరినీ వెంటాడుతున్న ప్రశ్న ఇదే. చివరిక్షణంలో ల్యాండర్ నుంచి సిగ్నల్స్ ఆగిపోయాయి. కొన్ని క్షణాల్లోనే టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చిందన్న విషయం ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది. శివన్ కు నోట మాట రాలేదు. జరిగింది చెప్పడానికి అక్కడే ఉన్న ప్రధాని మోడీ దగ్గరకు వెళ్లారు. కళ్లలో నీళ్లు తిరుగుతుండగా …..ల్యాండర్ నుంచి సిగ్నల్స్ ఆగిపోయిన విషయాన్ని చెప్పలేక చెప్పలేక చెప్పాడు.
కురుక్షేత్రంలో అర్జునుడికి హితబోధ చేసినట్టుగా.. మోడీ ఓదార్పు
దేశమంతా మీ వెంటే ఉందన్న మోడీ
శివన్ పరిస్థితి, మోడీకి అర్థమైంది. ఆయన్ను గుండెలకు హత్తుకున్నారు. ఏడుస్తున్న బిడ్డను సముదాయించినట్లు సముదాయించారు. ఆప్యాయంగా వీపు నిమిరారు. “ బీ కరేజియస్ ” అంటూ ధైర్యం చెప్పారు. కురుక్షేత్ర యుద్ధం సమయంలో అర్జునుడికి హితబోధ చేసిన కృష్ణుడిలా ఇస్రో సైంటిస్టులకు ధైర్యం చెప్పారు నరేంద్ర మోడీ. సైన్స్ లో అసలు ఫెయిల్యూర్ అనే మాటే ఉండదన్నారు. సైంటిస్టుల్లో ఉన్న టెన్షన్ ను పోగొట్టడానికి వారిని కలిసి మాట్లాడారు. “ చంద్రయాన్ –2 ప్రయోగం కోసం మీరు పడ్డ కష్టం దేశమంతా చూసింది. మీరు ఫెయిల్ అయ్యారని అనుకోవద్దు. చివరిక్షణంలో ఒక టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చింది. అంతే. సైన్స్ పట్ల మీ అంకితభావం దేశానికే ఆదర్శం ” అన్నారు మోడీ. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో మనదేశ కీర్తి పతాకను వినువీధిన ఎగరేయడానికి ఇస్రో సైంటిస్టులు చేసిన కృషిని ప్రధాని అభినందించారు
సైన్స్ లో ఫెయిల్యూర్ అనే మాటకు తావు లేదు
రెండు రెళ్లు నాలుగు అనే లెక్క ఇక్కడ పనికిరాదు. సైన్స్ అంటేనే ప్రయోగాలు. అనుకున్న రిజల్ట్ వచ్చేంతవరకు సైంటిస్టులు ప్రయత్నిస్తూనే ఉంటారు. అదొక నిరంతర ప్రక్రియ. కరెంటు బల్బు కనుగొనడానికి థామస్ ఆల్వా ఎడిసన్ ఎన్నో సార్లు ప్రయత్నించారు. అనుకున్న ఫలితం రాలేదు. అయినా ఎడిసన్ పట్టు విడవలేదు. ఎన్నో ఆప్షన్స్ పెట్టుకున్నారు. ఒక ఆప్షన్ లో రిజల్ట్ రాకపోతే మరో ఆప్షన్ లో ప్రయత్నించడం మొదలెట్టారు. ప్రయత్నాల మీద ప్రయత్నాలు చేశారు. చివరకు అనుకున్నది సాధించారు. కరెంటు బల్బును కనుగొన్నారు. ఎడిసన్ ఒక్కరే కాదు సైంటిస్టుల అందరి పరిస్థితి ఇంతే.
పడతుంటాం…లేస్తుంటాం…..నడక నేర్చుకుంటాం
బుడిబుడి అడుగులు వేసే పిల్లాడు పడుతుంటాడు….లేస్తుంటాడు. కిందపడ్డంతమాత్రాన అడుగులు వేయడం మానడు. కిందపడ్డ ప్రతిసారీ ఓ కొత్త పాఠం నేర్చుకుంటాడు. పడకుండా ఉండాలంటే ఏం చేయాలో నేర్చుకుంటాడు. మళ్లీ అడుగులు వేస్తాడు. చివరకు నడక నేర్చుకుంటాడు. ఈ మొత్తం ప్రక్రియలో పిల్లాడు ఎన్నో సార్లు కిందపడిపోవచ్చు.దీన్ని ఫెయిల్యూర్ అనడం ఏమాత్రం కరెక్ట్ కాదు. చంద్రయాన్ –2 ప్రయోగం కూడా అలాంటిదే. చంద్రయాన్ ఒక్కటే కాదు అన్ని ప్రయోగాలను కూడా ఇలాగే చూడాలి.
వెల్డన్.. ‘ఇస్రో’
చందమామను అందుకునే ప్రయత్నం ఒక్క అడుగు దూరంలో ఆగిపోవటంపై యావద్దేశం ఎమోషనల్‌గా స్పందించింది. శనివారం తెల్లవారుజామున ‘చంద్రయాన్–2’కి చివరి క్షణంలో టెక్నికల్ సమస్య తలెత్తటం పట్ల వివిధ వర్గాల ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రయోగాన్ని వంద శాతం సక్సెస్ చేయటానికి కష్టపడ్డ సైంటిస్టుల కృషిని మెచ్చుకున్నారు. ట్విటర్, ఫేస్బుక్ తదితర సోషల్ మీడియాలో ప్రముఖులు… ‘ఇస్రో ఈరోజు కాకపోయినా రేపైనా తన లక్ష్యాన్ని సాధించి తీరుతుంద’న్నారు. ఈ మేరకు ప్రెసిడెంట్ రామ్నాథ్కోవింద్ మొదలుకొని పొలిటికల్, అపొజిషన్ లీడర్లు; బాలీవుడ్ హీరోలు, ఇస్రో మాజీ చీఫ్, ‘నాసా’ మాజీ ఆస్ట్రోనాట్ తమ అభిప్రాయాలు తెలిపారు.
చంద్రయాన్ – 2 ప్రయోగమే సవాళ్లమయం
అసలు చంద్రయాన్ – 2 ప్రయోగమే సవాళ్లమయం. ఇలాంటి ప్రయోగాన్ని మిగతా దేశాలు చేపడితే వేలాది కోట్లు ఖర్చు పెడతాయి. ఇస్రో సైంటిస్టులు కేవలం 978 కోట్ల రూపాయలతో ఈ ప్రయోగాన్ని చేపట్టారు. అంతేకాదు పూర్తిగా దేశీయ టెక్నాలజీ. ఈ ప్రయోగానికి మరో స్పెషాలిటీ ఉంది. చంద్రుడి ఉపరితలంపై ఉన్న ‘ సౌత్ పోల్ ’ ఓ మిస్టరీ. ఈ మిస్టరీ గుట్టు విప్పడానికి ఇప్పటివరకు ఏ దేశమూ ప్రయత్నించలేదు. ఫస్ట్ టైం ఆ సాహసం చేయడానికి ప్రయత్నించింది ఇస్రో సైంటిస్టులే. సౌత్ పోల్ మిస్టరీ వీడితే చంద్రుడి కి సంబంధించిన అనేక ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. అందుకే సవాళ్లు ఎదురవుతాయన్న విషయం తెలిసి కూడా ఎంతో ముందుచూపుతో సౌత్ పోల్ దగ్గర విక్రమ్ ల్యాండర్ ను దింపడానికి వీలుగా ప్రయోగాన్ని సిద్ధం చేసుకున్నారు సైంటిస్టులు.
చివరిక్షణంలో వచ్చిన టెక్నికల్ ప్రాబ్లమ్ ను కాదు చూడాల్సింది ఈ ప్రయోగాన్ని సక్సెస్ చేయడానికి మన సైంటిస్టులు రాత్రింబవళ్లు పడ్డ కష్టాన్ని. ఈ కష్టాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టే దేశం అంతా ఇస్రోకు అండగా నిలబడింది. “ మిమ్మల్ని చూసి గర్విస్తున్నాం ” అంటూ సైంటిస్టుల భుజం తట్టింది.
ఇండియా ఈజ్ విత్ యూ
ఇస్రో సైంటిస్టుల భుజం తట్టారు నెటిజన్లు. ‘ ఇండియా ఈజ్ విత్ యూ ఇస్రో ’ అంటూ వాళ్లను వెన్నుతట్టి ప్రోత్సహించారు. చివరిక్షణంలో వచ్చిన టెక్నికల్ ప్రాబ్లమ్ ను పట్టించుకోవాల్సిన పని లేదన్నారు. చంద్రుడి పై ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి గతంలో ‘ నాసా ’ అనేకసార్లు ప్రయత్నించి విఫలమైన విషయాన్ని ప్రస్తావించారు. చంద్రయాన్ –2 పేరుతో ఇస్రో చేపట్టిన ప్రయోగాన్ని చూసి దేశమంతా గర్విస్తుందన్నారు. జాబిల్లి పై ప్రయోగాల్లో రానున్న రోజుల్లో అమెరికా, రష్యా, చైనా దేశాలను ఇండియా మించిపోతుందని మరికొంతమంది నెటిజన్లు జోస్యం చెప్పారు.
జాబిలిని జయిస్తాం
స్పేస్ ఫీల్డ్కి సంబంధించి ఇస్రో చైర్మన్ శివన్, ఆయన టీమ్ యువతకు రోల్ మోడల్. ‘చంద్రయాన్–2’ ప్రయాణించిన దూరంతో పోల్చితే చేరుకోవాల్సిన దూరం చాలా తక్కువ. అసలు పట్టించుకోవా ల్సినంత పెద్ద విషయం కూడా కాదు. ‑ రామ్‌నాథ్ కోవింద్, ప్రెసిడెంట్
అందరికీ వందనం
చంద్రయాన్–2ని విజయవంతం చేయటానికి డెడికేషన్‌తో శ్రమించిన సైంటిస్టులు, ఇంజనీర్లు సహా ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా వందనం. మూన్ ల్యాండర్‌తో ఇస్రోకి కమ్యూనికేషన్ కట్ అయి ఉండొచ్చేమో. కానీ 130 కోట్ల మంది ఇండియన్స్ ఇప్పటికీ ఆ సంస్థపై ఆశలు కోల్పోలేదు. కాబట్టి ఎవరూ నిరాశ చెందొద్దు. ‑ వెంకయ్యనాయుడు, వైస్ ప్రెసిడెంట్
ఎంతో రుణపడి ఉన్నాం
ప్రపంచ అంతరిక్ష రంగంలో ఇండియాని ముందంజలో నిలిపిన ఇస్రోకి దేశ ప్రజలు ఇప్పటికే ఎంతో రుణపడి ఉన్నారు. చంద్రయాన్–2 అనుభవంతో ఆ సంస్థ రానున్న రోజుల్లో గొప్ప ఫీట్లు సాధించబోతోంది. ‑సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్టీ చీఫ్
ఇస్రో వెంటే దేశం
చంద్రయాన్–2 యజ్ఞంలో కమిట్మెంట్తో పాలుపంచుకున్న ఇస్రో వెంటే యావత్ దేశం నిలుస్తోంది. ప్రతి ఇం డియన్ ఆ సంస్థను చూసి గర్వంగా ఫీలవుతున్నాడు. ‑ అమిత్ షా, హోం మంత్రి
గర్వంగా ముందుకు సాగండి
ఇస్రోకి కంగ్రాట్స్. చంద్రయాన్–2 విషయంలో సైంటిస్టులు చూపిన పట్టుదల, అంకితభావం అసామాన్యం. అందుకే.. చేసే పనిలో ఫలితం ఎలా ఉన్నా మనమంతా ఎప్పుడూ వాళ్ల వెంటే ఉందాం.‑ మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ సీఎం
సైంటిస్టులు చరిత్ర సృష్టించారు:
చంద్రయాన్–2లో పాల్గొన్న సైంటిస్టులు తాజా ఫలితంతో ధైర్యం కోల్పోకూడదు. వాళ్లను చూసి మేమంతా గర్వపడుతున్నాం. ‑అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ సీఎం
గతాన్ని ఒకసారి చూడండి
ఇస్రో ఇకపై మరింత సంతృప్తికరమైన విజయాలను నమోదుచేస్తుందన్న విశ్వాసం ఉంది. మన సైంటిస్టులు గతంలో ఎన్నో గొప్ప విజయాలు సాధించారు.
‑ సీతారాం ఏచూరి, సీపీఎం జనరల్ సెక్రెటరీ
ఒక్కోసారి ఇంతే
దురదృష్టవశాత్తూ ఒక్కోసారి మనం అనుకున్న లక్ష్యాన్ని, గమ్యాన్ని చేరుకోలేం. కానీ ఈ ఫలితాలు తాత్కాలికమే. శాశ్వతం కాదు. అందుకని విశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు. ఇస్రో పోరాటం ప్రతిఒక్కరిలో ఇన్‌స్పిరేషన్‌ను నింపుతోంది. .
‑ అమితాబ్‌బచ్చన్, బాలీవుడ్ హీరో
ఈ అనుభవం మంచిదే
చంద్రయాన్–2 సాఫ్ట్ ల్యాండింగ్‌కు సంబంధించి ఇండియాకు ఎదురైన ఈ అనుభవం ఇస్రో భవిష్యత్‌లో చేపట్టే స్పేస్ మిషన్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది. చివరి నిమిషంలో తలెత్తిన సాంకేతిక సమస్య వల్ల సైంటిస్టులు నిరుత్సాహానికి గురికాకూడదు.
‑ జెర్రీ లైనెన్గర్, నాసా మాజీ ఆస్ట్రోనాట్
95% లక్ష్యాలను సాధించింది
చంద్రయాన్–2 ప్రయోగం 95 శాతం లక్ష్యాలను సాధించింది. ఆర్బిటర్ ఇప్పటికీ ఆరోగ్యకరంగా ఉంది. లూనార్ ఆర్బిట్‌లో నార్మల్‌గా పనిచేస్తోంది. అయితే సాఫ్ట్ ల్యాండింగ్ అవటం కూడా చంద్రయాన్–2 లక్ష్యాల్లో ఒకటి. ఏదేమైనప్పటికీ మనం మరీ అంత వర్రీ కావాల్సిన పనిలేదు.
‑ జి.మాధవన్ నాయర్, ఇస్రో మాజీ చీఫ్