నిజామాబాద్ : ఎల్లారెడ్డిలో అధికం.. అర్బన్​లో అల్పం

  • అర్బన్, బోధన్​లో ఓట్ల గల్లంతు
  • నిరాశతో వెనుదిరిగిన ఓటర్లు 
  • బోధన్​లో బోగస్​ ఓట్లు వేసేందుకు యత్నించిన ఇద్దరిపై కేసు
  • ఉమ్మడి జిల్లా అంతటా సాయంత్రం 7 గంటల దాకా పోలింగ్

నెట్​వర్క్​, వెలుగు: జిల్లాలో పోలింగ్ ​చెదురుమదరు ఘటనలు మినహాప్రశాంతంగా ముగిసింది. ఆరు సెగ్మెంట్లలో మొత్తం 13,94,986 ఓటర్లుండగా 73.72 శాతం ఓటింగ్​నమోదైంది. బాన్సువాడలో  81.26 శాతం, రూరల్​లో 76.42, బాల్కొండలో79.3, ఆర్మూర్​ 76.01, బోధన్​లో 71.08 శాతం పోలింగ్ ​జరగగా, అర్బన్​లో కేవలం 62.56 శాతం ఓటింగ్​నమోదైంది. జుక్కల్​లో 81.61శాతం, ఎల్లారెడ్డిలో  83.16 శాతం, కామారెడ్డిలో 74.86 శాతం పోలింగ్​​ నమోదైంది. రాత్రి 7 గంటల దాకా పోలింగ్ ​కొనసాగింది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్​ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, తర్వాత సాయంత్రం వేళ కేంద్రాల వద్ద ఓటర్ల రద్దీ పెరిగింది. కలెక్టరేట్​లలో ఏర్పాటు చేసిన కంట్రోల్​రూంలో కలెక్టర్లు​ రాజీవ్​ గాంధీ హన్మంతు, జితేశ్​ వీ పాటిల్​ ఓటింగ్​ తీరును సీసీ కెమెరాల్లో పర్యవేక్షించారు. నిజామాబాద్​ పోలీస్ ​కమిషనర్ ​కల్మేశ్వర్ ​సింగన్​వార్ ​జిల్లాలోని పలు ఏరియాల్లో పోలింగ్​ తీరు పరిశీలించారు. 

ఓట్లు గల్లంతు

ఓటేయడానికి ఉత్సాహంగా వచ్చిన ఓటర్లు తమ పేరు లిస్ట్​లో లేదని తెలుసుకొని నిరాశతో వెనుదిరిగారు. అర్బన్​లోని ఖలీల్​వాడి పోలింగ్​ కేంద్రంలో శైలజ అనే మహిళ లిస్ట్​లో తన పేరు లేకపోవడంపై పోలింగ్​ ఆఫీసర్లతో వాదించి వెళ్లిపోయారు. సుభాష్​ నగర్​ఎస్ఎఫ్ఎస్​ స్కూల్​లోని పోలింగ్​ సెంటర్, శంకర్​భవన్, ఐటీఐ కాలేజీ సెంటర్​లో ఓట్లు గల్లంతయ్యాయి. బోధన్​ శక్కర్​నగర్​లోని గవర్నమెంట్​గర్ల్స్​స్కూల్​సెంటర్​లో తాను రాకముందే తన ఓటును ఎవరో వేశారని ఒక ముస్లిం మహిళ పోలీస్​ కమిషనర్​కల్మేశ్వర్​కు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాలతో కన్ఫర్మ్​ చేసుకొని కేసు నమోదు చేయాలని ఆయన స్థానిక పోలీసులను ఆదేశించారు. షేక్ ​అస్లాంతో పాటు మరో యువకుడు ఒకటికి మించి ఓట్లు వేసే ప్రయత్నం చేయడంతో వారిద్దరిని సీపీ స్టేషన్​లో అప్పగించారు. 

ఒకవైపు పోలింగ్​ మరోవైపు డబ్బుల పంపిణీ

జిల్లాలోని పలు పోలింగ్​కేంద్రాల సమీపంలో ఒక పక్క పోలింగ్​ నడుస్తుండగా బయట ఓటర్లకు ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున డబ్బుల పంపిణీ కొనసాగింది. రూరల్, బోధన్​ సెగ్మెంట్​లో గురువారం మధ్యాహ్నం దాకా ఓటర్లకు ఒక పార్టీ వారు ఒట్టుపెట్టించుకొని రూ.500, రూ.వెయ్యి చొప్పున నగదు అందించారు. బాల్కొండ బీఆర్ఎస్​ అభ్యర్థి ప్రశాంత్​రెడ్డి ఓటర్లకు పంచడానికి కారులో డబ్బులు తీసుకెళ్తున్నారని ప్రచారం జరగగా కిసాన్​నగర్​లో కాంగ్రెస్​శ్రేణులు మొహరించారు. బోధన్​లోని రాకాసిపేటలో ఓ కులసంఘం వారు అలకబూనడంతో బీఆర్ఎస్​లీడర్లు డబ్బులు పంచి పోలింగ్ ​సెంటర్లకు తరలించారు. డబ్బులు పంచుతున్న ఇద్దరు లీడర్లను పట్టుకున్నామని సీపీ కల్మేశ్వర్ ​మీడియాకు తెలిపారు. 

స్ట్రాంగ్​రూమ్​కు ఈవీఎంలు 

బాల్కొండ, బోధన్, రూరల్, అర్బన్, జుక్కల్, ఎల్లారెడ్డి తదితర సెంటర్లలో సాయంత్రం 7 గంటల దాకా పోలింగ్​ నడిచింది. ఆ తర్వాత  జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్​రూమ్​లకు ఈవీఎంలను తరలించారు. డిసెంబర్​3న లెక్కింపు జరిగే దాకా సాయుధ పోలీసుల పహారాతో భద్రత కల్పించారు. 

పోలింగ్​సిబ్బంది కష్టాలు

నిజామాబాద్​ జిల్లాలో పోలింగ్ ​నిర్వహణకు జిల్లాలో మొత్తం 1,549 సెంటర్స్​ఏర్పాటు చేశారు. అయితే పోలింగ్​కు సరిగ్గా ఒకరోజు ముందు జిల్లాలో వర్షం కురిసింది. దీంతో పాఠశాల గ్రౌండ్​లో చేరిన నీటితో పరిసరాలు బురదమయంగా మారాయి. గాలివర్షానికి కూలిన చెట్లు అలాగే ఉన్నాయి. అర్బన్ లో ఖిల్లా, అర్సాపల్లి రోడ్​లోని పోలింగ్ ​కేంద్రాలు పాత లోతట్టు స్కూల్స్​లో ఏర్పాటు చేశారు. టాయిలెట్స్​కూడా సరిగా లేని సెంటర్లలో పనిచేయడానికి సిబ్బంది ముఖ్యంగా మహిళలు ఇబ్బంది పడ్డారు.  భోజనం, వసతి సరిగా లేక పోలింగ్​ డ్యూటీ చేసిన వారు బేజారయ్యారు. స్ట్రాంగ్​ రూమ్​ వద్ద కనీసం తాగునీటి వసతి కూడా కల్పించలేదు.

కామారెడ్డిలో 3 ఈవీఎంలతో వృద్ధుల ఇబ్బందులుకామారెడ్డి నియోజకవర్గంలో 39 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో  నిలిచారు. ఈ నేపథ్యంలో ఇక్కడ 3 ఈవీఎంలు వినియోగించాల్సి వచ్చింది.  మూడు ఈవీఎంలు ఉండడం, అభ్యర్థుల సంఖ్య  ఎక్కువగా ఉన్న దృష్ట్యా వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. గుర్తును వెతుక్కోడానికి చాలా టైమ్​తీసుకున్నారు. దీంతో పోలింగ్​ ప్రక్రియ నెమ్మదిగా సాగింది. చాలా చోట్ల ఓటర్లు గంటల తరబడి లైన్లలో నిలబడాల్సి వచ్చింది.