జర్నలిస్టులపై తప్పుడు కేసులు పెట్టడం సరికాదు : తోట్ల మల్లేశ్ యాదవ్

దండేపల్లి/లక్సెట్టిపేట, వెలుగు: వాస్తవాలను వెలికితీస్తున్న జర్నలిస్టులపై ఫారెస్ట్ అధికారులు తప్పుడు కేసులు బనాయిస్తూ వేధించడం సరికాదని వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు తోట్ల మల్లేశ్ యాదవ్ అన్నారు. జన్నారం మండలంలోని జర్నలిస్టులపై  ఫారెస్ట్ అధికారులు తప్పుడు కేసులు పెట్టి వేధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. మహ్మదాబాద్ సమీపంలోని కడెం ఉప కాలువలో పడి ఉన్న జింక కళేబరం వార్తను ప్రసారం చేసిన జర్నలిస్టుపై కక్షపూరితంగా వ్యవహరించి తన క్రింది స్థాయి సిబ్బందితో తప్పుడు వార్త అంటూ అసత్య ప్రచారం చేసి ఫిర్యాదు చేయించడం దారుణమన్నారు.

ఆ జింక కళేబరం ఏమైంది, జింక మృతి గల కారణాలపై అటవీ ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపించి, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అటవీ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై తప్పుడు కేసులు బనాయిస్తూ వేధించడం సరికాదని తెలంగాణ యూనియన్ ఆఫ్  వర్కింగ్ జర్నలిస్ట్స్ మంచిర్యాల జిల్లా కో కన్వీనర్ చెట్ల రమేశ్ అన్నారు. జన్నారం మండలంలో ఫారెస్ట్ అధికా రులు తప్పుడు కేసులతో వేధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.