యూపీ ఓ రాజకీయ ప్రయోగశాల

విశ్లేషణ: ఉత్తరప్రదేశ్‌‌‌‌ రాజకీయ ముఖచిత్రం మారుతోంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ అక్కడ క్రమంలో రాజకీయ పునరేకీకరణలు స్థిరపడుతున్నాయి. అధికార పక్షం బీజేపీ పూర్తిగా ఎన్నికల వ్యూహాన్ని మార్చింది. అలాగే సంప్రదాయ ప్రచారబాట వీడి, సరికొత్త పంథాను ఎంచుకుంది. మరోవైపు ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా సమాజ్‌‌‌‌వాదీ పార్టీ తన పరిస్థితి మెరుగుపరుచుకోవడంలో తలమునకలై ఉంది. అధికార పార్టీ వైఫల్యాలను తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రాధాన్యత ఇస్తోంది. కాంగ్రెస్‌‌‌‌, బీఎస్పీ వంటి పార్టీలు పోటీలో ఉన్నా వాటి ఉనికి నామమాత్రమే. అయితే గత ఎన్నికల్లో బీజేపీ కూటమికి లాభించిన సోషల్‌‌‌‌ ఇంజనీరింగ్‌‌‌‌ ప్రక్రియ.. ఈసారి ఎస్పీ కూటమికి ప్రయోజనం చేకూర్చే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. యూపీ ప్రజల ఆలోచనా సరళి మారిందని, అభివృద్ధిని స్వయంగా చూసిన ప్రజలు తమతోనే ఉన్నారని చెబుతూ తాజా సర్వేలను తెరపైకి తెస్తోంది. స్థూలంగా దేశ రాజకీయాలకు చుక్కానిగా ఉంటాయనుకునే ఉత్తరప్రదేశ్‌‌‌‌ ఎన్నికల సమరాంగణం వైపు దేశప్రజలు దృష్టి పెట్టడం సహజం. తొలి విడత పోలింగ్​తో మొదలైన రాజకీయ యుద్ధం.. వచ్చే జనరల్​ ఎలక్షన్ల వరకు కొనసాగుతుంది.

ఉత్తరప్రదేశ్​లో పాలకపక్షమైన బీజేపీ హిందూత్వవాదాన్ని కొంచెం వెనక్కినెట్టి, ఇప్పుడు అభివృద్ధి మంత్రం జపిస్తోంది. మతకలహాలు, దాడులు లేని రాజకీయ వాతావరణం, కుల ఘర్షణలు, కుమ్ములాటలు లేని ప్రగతి పథంలో రాష్ట్రాన్ని నడుపుతున్నామని ప్రజల మనసు గెలిచే ప్రయత్నం చేస్తోంది. ఇది బీజేపీకి కొత్త అనుభవం! ప్రయోగం కూడా! మరోవైపు ఎస్పీ కూడా బీసీ రిజర్వేషన్లు, ముస్లింలపై దాడుల అంశాలకన్నా సాగు సమస్యలు, ఉపాధి, ఉద్యోగఅవకాశాల వంటి అంశాలను ముందుకు తెస్తోంది. ప్రజా సమస్యలు, కఠిన వాస్తవాలు.. సమకాలీన రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి. దీంతో పౌరసమాజం పరోక్షంగానైనా తమ అవసరాలు, ప్రాధాన్యతలను నొక్కి చెప్పడంలో విజయం సాధించినట్లయ్యింది. అందుకే ఇప్పుడు కులం, హిందూత్వం వంటి అంశాలకన్నా ప్రజా సమస్యలే పార్టీలకు ఎన్నికల ప్రచార ఎజెండాగా మారిన స్థితి ఇప్పుడు నెలకొంది. అదే వరుసలో సామాజిక న్యాయం, జాతీయత వంటివి అడుగునపడి, రాష్ట్రానికి ఎవరు ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తారో.. చెప్పుకుని ప్రజల్ని నమ్మించడంలో ప్రధాన పార్టీలు పోటీపడుతున్నాయి. తాజాగా ప్రకటించిన ‘సంకల్ప్​పత్ర్’, ‘వచన్‌‌‌‌పత్ర్’ఇందుకు నిదర్శనాలు. అలాగే సాధ్యాసాధ్యాలతో నిమిత్తం లేని హామీలను దట్టించారు. రానురాను పోటీ పెరుగుతూ వచ్చి గెలుపు నీదా? నాదా? అన్న ఉత్కంఠ నెలకొంటోంది.

బాట మార్చిన అధికార పార్టీ
బీజేపీ ఇప్పుడు సరికొత్త పంథాలో నడవడం ఒకరకంగా మెచ్చుకోదగినదే! అందులో కొన్ని అనుకూలించేవైతే.. మరికొన్ని ప్రతికూల ప్రభావం చూపొచ్చు. అధికారంలో ఉంది గనుక.. దాడికైనా, ప్రతి దాడికైనా అభివృద్ధి అస్త్రాన్ని వాడక తప్పట్లేదు. అందుకే కలుపుకుపోవడం, సమ్మిళిత, అభివృద్ధి కాముక ఎజెండాను ముందుకు తెస్తోంది. దీనికి, సీఎం యోగి ఆధిత్యనాథ్‌‌‌‌ బలం, బలహీనత రెండూ అవుతున్నారు. ఆయన వద్ద అవినీతి లేదు. శాంతిభద్రతల విషయంలో రాజీలేని ధోరణితో నేరస్తుల్ని అదుపు చేసి, నేరాల రేటు తగ్గించారని పేరుంది. పెద్దపెద్ద ముఠాలను, రౌడీ మూకల్ని పీచమణచిన కీర్తి దక్కింది. అదే సమయంలో కొంత పక్షపాతంగా వ్యవహరించారని, ఠాకూర్‌‌‌‌(టి సిరీస్‌‌‌‌)ల కిచ్చిన విచ్చలవిడితనం వల్ల పరిస్థితి వికటించిందనే చెడ్డ పేరుంది. అనుభవరాహిత్యం వల్ల ఇంత పెద్ద రాష్ట్రాన్ని సరిగ్గా పాలించలేదన్న విమర్శ కూడా ఉంది. వ్యవసాయ రంగంలో వృద్ధి లేక, పారిశ్రామిక ప్రగతి లేక, సగటు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడలేదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. గత ఎన్నికల మేనిఫెస్టో అమలు కాకపోవడాన్ని ఎస్పీ ప్రధానంగా ఎత్తి చూపుతోంది. 

మౌలిక వసతులకు ప్రయారిటీ
హిందూత్వ విషయంలో బీజేపీపై సహజంగా ఉండే విమర్శలకు తోడు పౌరసత్వ చట్టసవరణ, త్రిపుల్‌‌‌‌ తలాఖ్‌‌‌‌, లవ్‌‌‌‌ జిహాద్‌‌‌‌, గోరక్షణ వంటి అంశాల్లో దూకుడు మొదట్లో కొంత ప్రతికూల ప్రభావం చూపింది. అయితే, వాటిని ఎన్నికల ప్రచారం నాటికి వెనుక వరుసలోకి నెట్టివేసినట్లయ్యింది. ఉత్తరప్రదేశ్‌‌‌‌ మొత్తాన్ని ఏకం చేసే రోడ్లు వంటి మౌలిక సదుపాయాలతోపాటు మరుగుదొడ్ల నిర్మాణం, గ్యాస్‌‌‌‌ కనెక్షన్లు, ఉచిత రేషన్‌‌‌‌, ఇండ్ల కేటాయింపు వంటివి ఇప్పుడు ప్రచారాంశాలుగా మారాయి. రాష్ట్రంలో, కేంద్రంలో ఒకే ప్రభుత్వం (డబుల్‌‌‌‌ ఇంజన్‌‌‌‌) ఉండటం వల్ల వేగవంతమైన ప్రగతి సాధ్యమవుతోందన్న ప్రచారం పార్టీకి ఎంతో ఆశావహంగా ఉంది. ‘రోడ్లు, హైవేల వల్ల వ్యాపారాలు, కంపెనీలకు తప్ప మాకేంటి ఒరిగేది?’అనే భావన ఇంకా కొన్ని పేద వర్గాల్లో ఉన్నా, అత్యధికులు సానుకూలంగా స్పందిస్తారని పార్టీ నాయకులు నమ్మకంగా ఉన్నారు. ‘నిర్భయ జనసమూహాలు’, ‘మతదాడులు లేని రాష్ట్రం’ వంటి సానుకూల నినాదాలతోపాటు కొత్త పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఉపాధి అవకాశాలు పెంచుతామనే ప్రచారం ప్రజామద్దతును కూడగడుతుందని బీజేపీ శ్రేణులు నమ్ముతున్నాయి.

ఆచితూచి అఖిలేశ్​ అడుగులు..
గత ఎన్నికల్లో ఓటమిని హుందాగా స్వీకరించి ‘ప్రజలు ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌ హైవేను కాకుండా బులెట్‌‌‌‌ ట్రైన్​ కోరుకున్నారు’ అని వ్యాఖ్యానించిన ఎస్పీ చీఫ్​ అఖిలేశ్​ యాదవ్‌‌‌‌ ఈసారి ఏ అవకాశాన్నీ వదులుకోవడానికి సిద్ధంగా లేరు. కుటుంబ, వారసత్వ రాజకీయాల విమర్శల నేపథ్యంలో అవసరమైతే తన వారిని దూరం పెట్టడానికి ప్రాధాన్యత ఇచ్చారు. పార్టీ 
అభ్యర్థుల ఖరారులో ఇతర సమీకరణాల కన్నా ‘గెలుపు’ అవకాశాలకే ప్రయారిటీ ఇచ్చారు. ఎన్నికలు సమీపించే వరకూ బీఎస్పీలో నెలకొన్న నిశ్శబ్దం ఆయనకు లాభించింది. బీఎస్పీ, బీజేపీ నుంచి వివిధ సామాజిక వర్గాల నాయకులు అఖిలేశ్ వైపు వలస కట్టారు. యాదవుల ఆధిపత్యాన్ని వ్యతిరేకించే నాయకులూ చేరడంతో ‘సోషల్​ ఇంజనీరింగ్’ ఎస్పీ శిబిరంలో బలోపేతమవుతోంది. కిందటి ఎన్నికల్లో ‘సోషల్​ ఇంజనీరింగ్’తో గొప్ప విజయం సాధించిన బీజేపీ.. పాతపద్ధతిలోనే బ్రాహ్మణ, ఠాకూర్‌‌‌‌, బనియా వర్గాలకు ప్రయారిటీ ఇస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సోషల్​ ఇంజనీరింగ్​ రెండు ప్రధాన పార్టీలకు ఎంత వరకు
 ఉపయోగపడుతుందో చూడాలి.

బలాబలాల్లో మార్పులు
ఎంత కాదన్నా యూపీలో కులాలు రాజకీయ ప్రక్రియను ప్రభావితం చేయకుండా ఉండవు. 18–20 శాతం ఉండే ముస్లింలు, 12–14 శాతం ఉండే యాదవులది కీలక పాత్ర. ఇతర ప్రాంతాల ముస్లింలకన్నా యూపీ ముస్లింల రాజకీయ ప్రవర్తన భిన్నంగా ఉంటుంది. బీజేపీని ఓడించగలిగే ప్రత్యామ్నాయ శక్తి వైపు ఏకీకృతంగా మొగ్గుతారు. గతంలో కాంగ్రెస్‌‌‌‌, మాయావతి, అసదుద్దీన్‌‌‌‌ ఒవైసీ, అఖిలేశ్​ మధ్య ముస్లిం ఓట్లు చీలితే తమకు లాభిస్తుందని బీజేపీ భావించేది. కానీ, ఈసారి ముస్లింలు గంపగుత్తగా ఎస్పీకి మద్దతుగా నిలిచే అవకాశాలే ఎక్కువని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. పశ్చిమ యూపీలో రాష్ట్రీయ లోక్‌‌‌‌దళ్‌‌‌‌, జాట్లు నిర్ణాయక పాత్ర పోషిస్తారు. జయంత్‌‌‌‌ చౌదరితో జట్టుకట్డడంతో బీజేపీ విఫలమైన చోట ఎస్పీ సక్సెస్ కావడం తాజా సమీకరణాల్లో కీలక పరిణామం. మరోవైపు 10–12 శాతం ఉన్న బ్రాహ్మణులు, ఠాకూర్లు, బనియాలు బీజేపీతో మరింత ఏకీకృతం అవుతున్నారు. అర్బన్​ ఓటు ఇంకా బీజేపీతోనే ఉంది. యాదవేతర ఓబీసీలను పాలకపక్షం తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోందని సదరు సామాజిక వర్గాల అభియోగమైనా.. ఎస్పీకి అధికారం దక్కితే వచ్చే ‘యాదవ ఆధిపత్యాన్ని’ వారు భరించలేరు. అందుకే బీజేపీతోనే సర్దుబాటుకు సమాయత్తమవుతున్నారు. మౌర్యులు, లోద్‌‌‌‌క్షత్రియులు, సైనీలు, ఇతర చిన్నచిన్న సామాజిక వర్గాలు ఎటువైపు మొగ్గుతారన్నదీ కీలకమే! ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్న అఖిలేశ్.. రిజర్వేషన్లు, మత ఘర్షణలు, కలహాలు, శాంతిభద్రతలు, సామాజిక న్యాయం వంటి అంశాలపై తక్కువ మాట్లాడుతున్నారు. ఎన్నికల హామీలపై వైఫల్యం, పరిపాలనా లోపం, నిరుద్యోగం, వ్యవసాయ రంగం కుదేలవడం వంటి అంశాలనే ప్రచారాస్త్రాలుగా మలుచుకుంటున్నారు.

పెరుగుతున్న ప్రజల బేరమాడే శక్తి
ప్రజాసమస్యలు, అభివృద్ధి అంశాలు ప్రధాన ఎజెండాగా మారి జాతీయత, హిందూత్వ, కులాలు, సామాజిక న్యాయం వంటి అంశాలు వెనుక వరుసలోకి వెళ్లడం ఒక రకంగా ప్రజా విజయమే. ఎన్నికల టైంలోనైనా పార్టీలతో ప్రజలు బేరమాడే శక్తి పెరగడం దక్షిణాది నుంచి ఉత్తరాదికి ఎగుమతైన కొత్త రాజకీయ సంస్కృతి. అది తుది ఫలితాల్లో ఎలా ఉంటుందో చూడాలి. ఎన్నికల ముంగిట్లో సంచలనాలు సృష్టించే సర్వేలను సగటు జనం నమ్మడం లేదు. వాటి అంచనాలు, విశ్లేషణలకు భిన్నంగా ప్రచారసభలకు జనం హాజరీ, గైర్హాజరీ లెక్కలు ఉండటమే దీనికి నిదర్శనం. కుల రాజకీయాలు ఇదివరకంత ప్రభావశీలంగా లేవు. కానీ, రాజకీయ క్షేత్రంలో కన్నా మీడియా విశ్లేషణల్లో, కథనాల్లో ఇంకా అవి ఎక్కువగానే ఉన్నాయి.

- ఆర్‌‌‌‌.దిలీప్‌‌‌‌రెడ్డి, పొలిటికల్‌‌‌‌ ఎనలిస్ట్‌‌‌‌, ‘పీపుల్స్‌‌‌‌ పల్స్‌‌‌‌’ డైరెక్టర్‌‌‌‌