విశ్లేషణ: ఉత్తరప్రదేశ్. అటా.. ఇటా?

విశ్లేషణ: ఐదు విడతల ఎన్నికల పోలింగ్‌‌ అయిపోయి ఎన్నికల ప్రక్రియ ముగింపునకు వస్తుంటే ఉత్తరప్రదేశ్‌‌లో క్రమంగా రాజకీయ స్పష్టత ఏర్పడుతోందా? ఉత్తరాది నుంచి ముఖ్యంగా ఉత్తర్‌‌పద్రేశ్​ నుంచి వస్తున్న విశ్లేషణలు ఒక్కసారిగా మారడం ఈ ప్రశ్నకు తావిస్తోంది. రెండు విడతల పోలింగ్ మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో ప్రధాన రాజకీయ కూటములు సర్వశక్తుల్నీ కూడదీసి విజయావకాశాల్ని మెరుగుపరచుకునే ప్రయత్నాల్లో పడ్డాయి. ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగుతున్న క్రమంలో ప్రధాన ప్రత్యర్థులైన బీజేపీ కూటమి, సమాజ్‌‌వాదీ కూటమి మధ్య పోటీ రసవత్తరమై.. నూవ్వా–నేనా అన్నంత ఉత్కంఠ నెలకొనడం మనకు కనిపిస్తోంది. కానీ, ఇందుకు పూర్తి భిన్నంగా ఇరు కూటముల మధ్య వ్యత్యాసం పెరుగుతున్నట్టు, బీజేపీ స్పష్టంగా ఆధిక్యత సాధిస్తున్నట్టు అంచనాలు, విశ్లేషణలు ఉన్నపళంగా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. ‘అయిపోయింది బీజేపీ’ పని అని ఎన్నికల ప్రక్రియ ప్రారంభంలో పలికిన గొంతులు ఇప్పుడు మూగబోవడమో? లేదా గొంతు మార్చడమో జరుగుతోంది. స్వల్ప ఆధిక్యతతో బీజేపీయే తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే విశ్లేషణలు ఇటీవల పెరిగాయి. అందుకు నిర్దిష్టంగా వారు కొన్ని కారణాలు చూపుతున్నారు. సమాజ్‌‌వాదీ పార్టీ అనుకున్నంతగా రాణించకపోవడం ఒక కారణమైతే అనూహ్యంగా బహుజన్‌‌ సమాజ్‌‌ పార్టీ(బీఎస్పీ), కాంగ్రెస్‌‌ పూర్తిగా చతికిలపడిపోకుండా అక్కడక్కడ ఉనికిని ప్రదర్శించడమే అన్న ప్రచారం మొదలైంది. ఆ మేరకు ఎస్పీ ఎదుగుదలను నిరోధిస్తోందన్న వాదన తెరపైకి వస్తోంది. వీటన్నింటికీ మించి.. ఈ ఎన్నికలను, రెండేండ్ల తర్వాత వచ్చే జనరల్​ ఎలక్షన్లకు దిక్సూచిగా పరిగణిస్తున్న బీజేపీ.. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడుతోంది. పైగా ఎన్నికల ప్రారంభంలో వెల్లడైన మీడియా అభిప్రాయాలు, విశ్లేషకుల వ్యాఖ్యల్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఎన్నికల్ని బీజేపీ రాజకీయ జీవన్మరణ సమస్యగా తీసుకున్నట్టు వారి ముమ్మర యత్నాలను బట్టి స్పష్టమవుతోంది. వీలయిన అన్ని వైపుల నుంచీ శక్తుల్ని మోహరించి.. విడత నుంచి విడతకు పరిస్థితిని మెరుగుపరుచుకుంటున్నట్టు సమాచారం. రెండు విడతల పోలింగ్‌‌ జరిగే వారణాసి, పూర్వాంచల్‌‌ ప్రాంతాలు బీజేపీకి అనుకూలత కలిగిన ప్రదేశాలు కావడం నిపుణుల విశ్లేషణలకు ఊతమిస్తోంది.

అయితే అటు.. లేకుంటే ఇటు..
నిపుణులు, మేధావుల విశ్లేషణల్లో సంక్లిష్టత–అస్పష్టత ఎలా ఉన్నా.. ప్రజాక్షేత్రంలో పరిస్థితి అలా ఉండదు. జనాలకు తిరుగులేని స్పష్టత ఎప్పుడూ ఉంటుంది. అక్కడ సందేహాలకు, శషభిషలకు తావుండదు. స్వల్ప ఆధిక్యతతో బీజేపీ మళ్లీ గెలవడం, ఎన్నో కొన్ని సీట్ల మెజారిటీతో ఎస్పీ అధికారంలోకి రావడం.. ఇలా ఉండదని గత చరిత్ర చెబుతోంది. తీరని రాజకీయ అనిశ్చితి ఉంటే తప్ప కొందరు ఆశించే ‘హంగ్‌‌’కు ఆస్కారమే లేనంత రాజకీయ పునరేకీకరణ ఇప్పటికే జరిగిపోయింది. యూపీలో ఢీ అంటే ఢీ నే! మాయావతి సమర్థవంతమైన పాలన అందించారని ప్రచారం జరిగినపుడు ఆ ప్రభుత్వాన్ని ములాయం–అఖిలేశ్​ నేతృత్వంలోని ఎస్పీ నిష్కర్షగా దించేసింది. యువ నాయకుడు, నవతరం ఆశల ప్రతినిధి, సమర్థంగా యూపీని పాలిస్తున్నాడని అఖిలేశ్​ పేరు తెచ్చుకున్నప్పుడు కూడా నిర్ద్వంద్వంగా ఎస్పీ ప్రభుత్వాన్ని దించి ప్రజలు బీజేపీని అధికారంలోకి తెచ్చారు. మీడియా ప్రచారం, విశ్లేషణలతో ఇతర ప్రాంతాల ప్రజలు ఊగిపోతారేమో కానీ యూపీ పౌరులపై ఇవేవీ పెద్దగా పనిచేయవనే భావన కూడా బలంగా ఉంది. బీజేపీకి ఇప్పుడున్న బలంలో పది, ఇరవై కాదు ఏకంగా 30 శాతం సీట్లు తగ్గుతాయనుకున్నా.. రెండు వందల పైచిలుకు స్థానాలతో తిరిగి పాలనలో కొనసాగడం ఖాయమనేది ఓ విశ్లేషణ. ‘అలా ఏం ఉండదు, యోగి ఆదిత్యనాథ్‌‌ పాలనపై విశ్వాసం ఉంటే మళ్లీ 250 నుంచి 300కు తగ్గని స్థానాలతో గెలిపిస్తారని, ఆయన పాలన వద్దు, ఇక చాలు’ అనుకుంటే యూపీ జనాలు బీజేపీని ఏ రెండంకెలకో నిర్మొహమాటంగా తగ్గిస్తారనేది ఓ అభిప్రాయం. జాట్ల ఆధిక్యత గల ఆగ్రా, మధుర, నోయిడా, ఘాజియాబాద్‌‌ వంటి ప్రాంతాలున్నా, తొలి విడత ఓటర్లలో వ్యతిరేకతను చాలా వరకు బీజేపీ తగ్గించుకోగలిగిందని నివేదికలు వచ్చాయి. మొత్తమ్మీద తొలి మూడు విడతల పోలింగ్‌‌ ముగిసే నాటికి ఎస్పీ గట్టి పోటీ ఇచ్చిందని, తర్వాతి రెండు విడతల్లో ఊహించిన దానికన్నా అధికంగా బీజేపీ పుంజుకుని, ఎస్పీ ఆధిక్యతని తగ్గించిందనే విశ్లేషణలు ఉన్నాయి. నిర్ణాయక ఎన్నికల్లో యూపీ ఓటర్లు ఎప్పుడూ.. అయితే అటు లేదా ఇటు విస్పష్టమైన తీర్పు ఇస్తారు తప్ప ఊగిసలాట ఉండదని లక్నోకు చెందిన ప్రొఫెసర్‌‌ ఆర్‌‌ఎస్‌‌ అగర్వాల్‌‌ అభిప్రాయపడ్డారు.

బీఎస్పీ–కాంగ్రెస్‌‌ పుంజుకున్నాయా?
ముందుగా అంచనా వేసిన దానికన్నా యూపీలో బీఎస్పీ, కాంగ్రెస్‌‌ పుంజుకోవడం ఎస్పీకి నష్టం కలిగించిందని ఒక వాదన ఇటీవల ప్రచారంలోకి వచ్చింది. అందువల్లే బీజేపీ పరిస్థితి మెరుగైందన్నది ఆ విశ్లేషణల సారాశం. అయితే క్షేత్ర స్థాయిలో ఈ పరిస్థితి ప్రతిబింబిస్తున్న సంకేతాలు లేవు. బీఎస్పీ ఏ మాత్రం పుంజుకున్న దాఖలాలు కనబడటం లేదు. పార్టీ అధినేత్రి ఏ కారణం చేతో ఆది నుంచీ అస్త్ర సన్యాసం చేయడంతో పార్టీ శ్రేణులు ఒకింత అయోమయంలో, ఓటు బ్యాంకు కకావికలమై ఉన్న మాట వాస్తవం. పార్టీ నాయకత్వం నుంచి తగిన ప్రోత్సాహం కొరవడటంతో ద్వితీయ శ్రేణి నాయకత్వం, క్రియాశీల కార్యకర్తలు లేక ఓటు బ్యాంకులు ఎస్పీ వైపు మొగ్గుతారనే అంచనాలు మొదట్నుంచీ సాగాయి. ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల పర్వం సాగే నాటికి, ప్రధాన పార్టీల్లో టికెట్లు దక్కని పలుకుబడి కలిగిన నాయకులు, తిరుగుబాటుదారులు బీఎస్పీని ఆశ్రయించి టికెట్లు దక్కించుకుని బరిలో దిగారు. వారిని ఆసరా చేసుకొని పార్టీ శ్రేణులు అక్కడక్కడ కొంత పోటీ ఇస్తున్నాయనే వార్తలు మీడియాలో వస్తున్నాయి. ఇదంతా ఉత్తుత్తి ప్రచారమేనని, బీఎస్పీ ర్యాలీలు గానీ, సభలు గానీ ఈసారి మాయావతి స్థాయిలో లేవనేది పచ్చి నిజం. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 41.4 శాతం ఓట్లతో బీజేపీ కూటమి 325 స్థానాలు పొందితే, 23.6 శాతం ఓట్లు తెచ్చుకున్న ఎస్పీ 48 సీట్లకు పరిమితమైంది. ఎస్పీకంటే సుమారు ఒక శాతమే తక్కువ, అంటే 22.2 శాతం ఓట్లు పొందిన బీఎస్పీ 19 స్థానాలు మాత్రమే దక్కించుకుంది. ఈసారి ఎస్పీకి ఏ ప్రాంతంలోనూ బీఎస్పీ దరిదాపుల్లో కూడా లేదు. అక్కడక్కడ పుంజుకోవడం ద్వారా ఎస్పీ అవకాశాలకు బీఎస్పీ గండి కొట్టిందనే వాదనలో పస లేదని ఒక అభిప్రాయం. కానీ, బీఎస్పీ అక్కడక్కడ మెరుగుపడ్డట్టు బీజేపీ అగ్రనేత అమిత్‌‌షా చేసిన కామెంట్​ వ్యూహాత్మకమే! ఇక కాంగ్రెస్‌‌ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. కిందటి ఎన్నికల్లో గెలిచి, రాయబరేలీకి ప్రాతినిధ్యం వహించిన అదితీసింగ్‌‌ వంటి నాయకుల్ని కూడా కోల్పోయిన కాంగ్రెస్‌‌ మెరుగుపడకపోగా.. ఈసారి మరింత దిగజారిందనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. కిందటిసారి ఏడు స్థానాల్ని (403లో) మాత్రమే గెలుచుకున్న కాంగ్రెస్‌‌ ఈసారి అన్ని దక్కించుకున్నా గొప్పే అనే వాదన ఒకవైపు ఉంటే, సీట్లు గెలవకపోవచ్చు కానీ, కాంగ్రెస్‌‌కు ఈసారి ఓట్లు పెరుగుతాయనే ఒక భిన్న వాదన కూడా ఉంది. ఈ వాదన వినిపించే వారు, ఆ మేరకు ఎస్పీ నష్టపోయి బీజేపీకి లాభం జరుగుతుందని అన్వయిస్తున్నారు. ఇవన్నీ తెలిసేది ఫలితాలతోనే.

ఏ విశ్లేషణ వెనుక ఏముందో?
ఏ ఇతర పార్టీకీ లేనటువంటి సంస్థాగత నిర్మాణం, అధికారం, హంగు ఆర్భాటం, అర్థ–అంగ బలం కలిగిన వ్యవస్థలు ఉన్న బీజేపీ తన ఆధిక్యతను నిలుపుకోవడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. వారి అభ్యర్థుల ఎంపికలో కొంత తప్పిదం జరిగిందని రాజకీయ నిపుణులు అంటున్నారు. స్థానికంగా ఉన్న ప్రజా వ్యతిరేకతను పరిగణనలోకి తీసుకోకుండా చాలా చోట్ల సిట్టింగ్‌‌ ఎమ్మెల్యేలనే అభ్యర్థులుగా ప్రకటించడం ఆ పార్టీకి ప్రతికూల అంశమనే అభిప్రాయం కూడా ఉంది. మోడీ–యోగి పట్ల ఉండే సాధారణ సానుకూలతల్ని కూడా అది కొన్ని చోట్ల కమ్మేస్తోందని, ఆ మేరకు పార్టీకి నష్టమని కొందరి భావన. ఇటువంటి కొన్ని ప్రతికూల అంశాలున్నా.. రెచ్చిపోతున్నారనే ప్రచారంతో ముస్లింలకు వ్యతిరేకంగా జాగృతం చేయడం ద్వారా హిందూ ఓట్లను సంఘటితం చేసి లబ్ధి పొందుతున్నామనేది పార్టీ శ్రేణుల విశ్వాసం. అదే సమయంలో అత్యధిక ముస్లింలు ఈసారి ఏ ఇతర పార్టీవైపూ మొగ్గకుండా ఎస్పీకి బాసటగా ఉన్నారనేది ఒక విశ్లేషణ. బీజేపీ నిజంగా పుంజుకుందా? లేక రాబోయే విడతల్లో ఓటర్లను ప్రభావితం చేయడానికి ఉత్తుత్తి ప్రచారమా? బెంగాల్‌‌లో జరిగినట్టు.. బీజేపీ గెలుస్తోంది, గెలిచేసింది అంటూ జరిపిన విస్తృత ప్రచారానికి తుది ఫలితం భిన్నంగా ఉంటుందా? ఇవన్నీ తేలేది మార్చి 10నే!
- దిలీప్‌‌రెడ్డి, డైరెక్టర్‌‌, పీపుల్స్‌‌ పల్స్‌‌