- మల్లు నందిని, ప్రసాద్‌రెడ్డి మధ్య తీవ్ర పోటీ
- ఫ్లాష్ సర్వేకు హైకమాండ్ నిర్ణయం
- కేడర్, పబ్లిక్ ఒపీనియనే ఫైనల్ ?
ఖమ్మం, వెలుగు : ఖమ్మం లోక్‌సభ స్థానానికి అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్‌కు అగ్ని పరీక్షలా మారింది. మంత్రుల కుటుంబసభ్యుల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో ఎవరికి ఛాన్స్ ఇవ్వాలో హైకమాండ్ తేల్చుకోలేకపోతోంది. ఒక వైపు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తన భార్య నందిని కోసం, మరో వైపు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తన తమ్ముడు ప్రసాద్‌రెడ్డి కోసం హైకమాండ్‌పై ఒత్తిడి తెస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్యే ప్రధాన పోటీ ఉండడం, మంత్రులిద్దరూ మెట్టు దిగకపోవడంతో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఫ్లాష్ సర్వే చేయాలని పార్టీ నిర్ణయించింది. సర్వే ఫలితాల ఆధారంగా క్యాండిడేట్‌ను డిసైడ్ చేయనున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ కేడర్‌తో పాటు పబ్లిక్ ఒపీనియన్ ఆధారంగానే క్యాండిడేట్‌ను ఎంపిక చేయనున్నట్లు తెలిసింది. సర్వే తర్వాత ఏప్రిల్ 3న జరిగే కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఖమ్మం అభ్యర్థిని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
కాంగ్రెస్ టికెట్ కోసం 12 మంది పోటీ
ఖమ్మం కాంగ్రెస్ టికెట్ కోసం 12 మంది అప్లై చేసుకున్నారు. ఇందులో నందిని, ప్రసాద్‌రెడ్డితో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు యుగంధర్, వ్యాపారవేత్త వీవీసీ రాజేంద్రప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ వీహెచ్‌తో పాటు ఇతరులు ఉన్నారు. వీరే కాకుండా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమ కుమార్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఇంతకుముందు ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున కమ్మ సామాజికవర్గానికి చెందిన రేణుకా చౌదరి పలుమార్లు పోటీ చేశారు. ఈ సారి ఆమెకు ముందుగానే రాజ్యసభ సీటు కేటాయించడంతో రేసు నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు కూడా అదే సామాజికవర్గానికి చెందిన వారికే ఖమ్మం సీటు కేటాయించాలన్న డిమాండ్ వినిపించింది. ప్రస్తుతం అదే కోటా కింద తమకు అవకాశం ఇవ్వాలంటూ తుమ్మల యుగంధర్, వీవీసీ రాజేంద్రప్రసాద్, పోట్ల నాగేశ్వరరావు, మానుకొండ రాధాకిశోర్ పోటీ పడుతున్నారు. దీనిపై ఇతర సామాజికవర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇప్పటికే రేణుకకు రాజ్యసభ సీటు ఇచ్చినందున మరో సామాజికవర్గానికి ఛాన్స్ ఇవ్వాలనే డిమాండ్ వ్యక్తమైంది. రెడ్డి కమ్యూనిటీ నుంచి ప్రసాద్‌రెడ్డి, ఎస్సీ సామాజికవర్గం నుంచి నందిని టికెట్ ఆశిస్తున్నారు. తాజాగా వరంగల్ మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి కుమారుడు రఘురాంరెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చింది. ఆయన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వియ్యంకుడు కాగా, గతంలో పాలేరు అసెంబ్లీ టికెట్‌ను
ఆశించారు.
ఎవరి వాదన వారిదే..
గతేడాది బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సమయంలోనే తన సోదరుడికి ఎంపీ సీటు కేటాయించేలా రాహుల్‌గాంధీ నుంచి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హామీ తీసుకున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. అప్పటి మాట ప్రకారమే ప్రసాద్‌రెడ్డికి టికెట్ అడుగుతున్నారని అంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్రంలో 20కి పైగా స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించడంలో పొంగులేటి ప్రత్యక్ష భాగస్వామ్యం ఉందని చెబుతున్నారు. ఇక భట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం పదవితో పాటు ఆయన సోదరుడు మల్లు రవికి ఇప్పటికే మహబూబ్‌నగర్ ఎంపీ సీటు కేటాయించినందున, ఖమ్మం సీటు ప్రసాద్ రెడ్డికే దక్కుతుందని ధీమాగా చెబుతున్నారు. అదే సమయంలో మల్లు నందిని అనుచరులు సోషల్ మీడియాలో మరో వాదనను తెరపైకి తెస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే రెడ్డి సామాజికవర్గానికి ఎక్కువ సీట్లు కేటాయించినందున ఖమ్మం నుంచి ఎస్సీకి ఛాన్స్ ఇవ్వాలని అడుగుతున్నారు. మల్లు రవికి సీఎం రేవంత్‌రెడ్డి టికెట్ ఇప్పించారని, దానితో సంబంధం లేకుండా నందినికి టికెట్ ఇవ్వాలని డిమాండ్చేస్తున్నారు. ఈ రెండు వర్గాల వాదనలు ఇలా ఉండడంతో టికెట్‌పై నిర్ణయం తీసుకోవాల్సిన ముఖ్య నేతలు కూడా డైలమాలో పడ్డట్టు తెలుస్తోంది. అందుకే ఫ్లాష్ సర్వే మార్గాన్ని ఎంచుకున్నట్టు సమాచారం. నాలుగైదు రోజుల్లో కాంగ్రెస్ టికెట్‌పై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.