
- రెండోసారి గెలవాలని రఘునందన్ వ్యూహాలు
- సత్తా చాటాలని కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రయత్నాలు
- అసెంబ్లీలో అడుగుపెట్టాలని చెరుకు శ్రీనివాస్‌రెడ్డి తహతహ
సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ సెగ్మెంట్లో మరోసారి హోరాహోరీ ఫైట్ నడిచేలా ఉంది. ఇటీవల బీఆర్ఎస్అభ్యర్థిపై హత్యాయత్నం జరగడంతో ఇక్కడి పాలిటిక్స్మరింత వేడెక్కాయి. మూడేళ్ల కింద జరిగిన ఉప ఎన్నికలో దుబ్బాక సీటు కోల్పోయిన బీఆర్ఎస్.. తిరిగి చేజిక్కించుకోవాలని పావులు కదుపుతోంది. నువ్వా.. నేనా అన్నట్లు జరిగిన ఆ ఎన్నికల్లో విజయం సాధించిన రఘునందన్‌రావు రెండోసారి గెలుపు కోసం సర్వశక్తులొడ్డుతున్నారు. అందుకు తగిన వ్యూహాలు రచిస్తున్నారు.
రెండుసార్లు మెదక్ ఎంపీగా గెలిచిన కొత్త ప్రభాకర్‌రెడ్డి మొదటిసారి బీఆర్ఎస్నుంచి అసెంబ్లీ బరిలో దిగుతున్నారు. ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగుపెట్టాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ముగ్గురూ పోటాపోటీగా ప్రచారం చేస్తుండగా, కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తిదాడి జరిగింది. ప్రస్తుతం ఆయన హాస్పిటల్‌కే పరిమితమవగా, పార్టీ శ్రేణులు ప్రభాకర్‌రెడ్డి తరఫున ప్రచారం చేస్తున్నారు.
వ్యూహాత్మకంగా రఘునందన్ అడుగులు
ఉప ఎన్నికలో స్వల్ప ఓట్ల తేడాతో నెగ్గిన రఘునందన్‌రావు ఈసారి మంచి మెజారిటీ సాధించాలని భావిస్తున్నారు. అందుకు తగిన కసరత్తు చేస్తున్నారు. ప్రచారంలో దూసుకెళ్తూ.. తాను గెలిచాక నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తున్నారు. వంద పడకల హాస్పిటల్ప్రారంభం, బస్టాండ్ నిర్మాణం, డబుల్బెడ్రూమ్ఇండ్ల పంపిణీ, కొత్తగా వేసిన రోడ్లు, భూంపల్లి అక్బర్పేట మండలం ఏర్పాటు, సిద్దిపేట-మెదక్ నేషనల్హైవే ప్రారంభం గురించి పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే గ్రౌండ్ వర్క్ పూర్తి చేసిన రఘునందన్..బీజేపీ శక్తి కేంద్ర ఇన్చార్జీలు, బూత్ ఇన్చార్జీలను యాక్టివ్చేశారు. ఇప్పటికే ప్రతి మండలం లోని10 గ్రామాల్లో ప్రచారం పూర్తి చేశారు. అన్ని వర్గాల మద్దతు కూడగడుతున్నారు. బీఆర్ఎస్ నుంచి పలువురు నేతల్ని బీజేపీలోకి రప్పించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు తనకే పడతాయని రఘునందన్ధీమా వ్యక్తం చేస్తున్నారు.
‘కొత్త’కు సానుభూతి దక్కేనా?
కత్తి దాడి జరగక ముందు వరకు ప్రభాకర్‌రెడ్డి బీఆర్ఎస్ప్రభుత్వ పథకాలే ప్రచార అస్త్రాలుగా ప్రజల్లోకి వెళ్లారు. పెన్షన్లు, రైతు బంధు, దళిత బంధు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలను వివరిస్తూ వచ్చారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో బీఆర్ఎస్కు క్యాడర్ఉండగా, కింది స్థాయి కార్యకర్తలను గుర్తించకపోవడం కొంత మైనస్‌అని తెలుస్తోంది. కీలక సమయంలో ప్రభాకర్‌రెడ్డి ఆస్పత్రి పాలవడం కొంత నష్టంగా భావిస్తున్నారు. ఎంపీ, బీఆర్ఎస్అభ్యర్థిపై దాడి ఘటన జరిగినా, ప్రజలు పెద్దగా రెస్పాండ్కానట్లు కనిపిస్తున్నది. సానుభూతి దక్కించుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నించినా వర్క్అవుట్అయినట్లు లేదు. మండల ఇన్చార్జీలు ప్రచారాన్ని భుజాలకెత్తుకొని నడిపిస్తున్నా, మునుపటిలా పెద్దగా ప్రభావం చూపట్లేదని తెలుస్తోంది. దశాబ్ద కాలంగా దుబ్బాక నియోజకవర్గానికి ఎంపీగా ఉన్న ప్రభాకర్‌రెడ్డి స్థానికంగా పట్టు సాధించలేకపోయారని టాక్. డిశ్చార్జ్అయ్యాక జనంలోకి వెళ్తే పార్టీకి లాభం జరుగుతుందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
ప్రభుత్వ వ్యతిరేక ఓట్లపై ఆశలు
కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లతోపాటు, కాంగ్రెస్ ఆరు గ్యారంటీ స్కీములపై ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హస్తం పార్టీకి పెరిగిన ఆదరణ తనకూ కలిసొస్తుందని భావిస్తున్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా పనిచేసిన తండ్రి చెరుకు ముత్యంరెడ్డి నుంచి వారసత్వంగా వచ్చిన ఓటు బ్యాంక్అదనపు బలం కానుంది. శ్రీనివాస్‌రెడ్డి మొదటిసారి దుబ్బాక ఉప ఎన్నికలో కాంగ్రెస్‌తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఎలాగైనా గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని పావులు కదుపుతున్నారు.
మూడు నెలల కింద ‘హాత్ సే హాత్ జోడో’ పేరుతో నియోజకవర్గంలో పాదయాత్ర చేసి కొంత మద్దతు కూడగట్టారు. అయితే కాంగ్రెస్టికెట్ఆశించి భంగపడ్డ కొందరు శ్రీనివాస్‌రెడ్డికి దూరంగా ఉండటం కొంత నష్టం కలిగించే అంశంగా కనిపిస్తోంది.