పాలేరులో టఫ్ ​ఫైట్.. పొంగులేటి, కందాల మధ్య హోరాహోరీ

  • పొత్తు చర్చల విఫలంతో బరిలోకి సీపీఎం
  • తమ్మినేని వీరభద్రం పోటీతో నష్టం ఎవరికనే చర్చ
  • 11 సార్లు గెలిచిన చరిత్ర కాంగ్రెస్​ది
  • ఒక్కోసారి విజయం సాధించిన సీపీఎం, బీఆర్ఎస్​
  • నియోజకవర్గంలో యువత ఓట్లు 25 శాతం

ఖమ్మం, వెలుగు : ఖమ్మం జిల్లాలో పాలేరు పాలిటిక్స్ ఆసక్తికరంగా మారుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల హోరాహోరీ పోరులోకి సీపీఎం వచ్చి చేరింది. దీంతో సీపీఎం పోటీ కాంగ్రెస్ కు మైనస్ గా మారుతుందా? లేదంటే బీఆర్ఎస్ ఓట్లను చీల్చుతుందా? అనేది చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ, ఆ పార్టీ ప్రచార కమిటీ కోచైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అధికార పార్టీ బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి మరోసారి బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరు నేతలు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యుల బలగాన్ని కూడా ప్రచార బరిలోకి దింపారు. పొంగులేటి తరఫున ఆయన భార్య, కొడుకు, తమ్ముడు, తమ్ముడి భార్య నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. కందాల తరఫున ఆయన భార్య, ఇద్దరు కూతుర్లు ప్రచార బరిలోకి దూకారు. ఇప్పుడు కాంగ్రెస్ తో పొత్తు లేదని తేల్చిన సీపీఎం కూడా తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లికి చెందిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో సీపీఎం చీల్చే ఓట్ల ప్రభావం కాంగ్రెస్, బీఆర్ఎస్ లో ఎవరికి ఎక్కువ నష్టం చేస్తుంది, అంతిమంగా ఎవరికి లాభం జరగనుంది అనేది ఇంట్రస్టింగ్ గా మారింది.

హాట్​సీట్​గా పాలేరు..

కొన్నేండ్లుగా రాష్ట్ర రాజకీయాల్లో పాలేరు హాట్ సీట్ గా మారింది. తరచుగా ఏదో కారణంతో ఈ సెగ్మెంట్ గురించి చర్చ జరుగుతున్నది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల ఇక్కడి నుంచి పోటీ చేస్తానని ఏడాదిన్నరగా చెప్పారు. ఆ తర్వాత కొద్దిరోజులు కాంగ్రెస్, వైఎస్ఆర్ టీపీ పొత్తు ప్రచారం నేపథ్యంలో షర్మిల, పొంగులేటి ఈ సీటు కోసమే పోటీపడడం, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరిన తర్వాత పొంగులేటి, తుమ్మల ఇద్దరూ ఈ సీటే కావాలని పట్టుబట్టడం వంటి కారణాలతో పాలేరు సెగ్మెంట్ హాట్​టాపిక్​గా ఉంది. కొద్దిరోజుల పాటు బీఆర్ఎస్ తో చర్చలు, ఆ తర్వాత కాంగ్రెస్ తో చర్చలు ఫెయిల్ కావడంతో ఒంటరిగా పోటీలో నిలవాలని సీపీఎం నిర్ణయించింది. అదే సమయంలో కాంగ్రెస్ తో కలిసి వైఎస్సార్​టీపీ పోటీ చేస్తుందని కొద్దిరోజులు, షర్మిల పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని మరోసారి టాక్ వచ్చింది. చివరికి కాంగ్రెస్ కు ఫుల్ సపోర్ట్ ప్రకటించిన షర్మిల పార్టీ పోటీ నుంచి తప్పుకోవడంతో పాలేరులో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ముఖాముఖి పోరు ఉంటుందని తేలిపోయింది. ఇక సీపీఎం సింగిల్ గా పోటీ చేస్తామని ప్రకటించడం, పాలేరు అభ్యర్థిని అనౌన్స్ చేయడంతో పాలేరులో ట్రయాంగిల్ ఫైట్ తప్పేలా కనిపించడం లేదు.

అభివృద్ధిపై కందాల, ప్రభుత్వ వ్యతిరేకతపై పొంగులేటి ఆశలు..

కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి హస్తం పార్టీ క్యాడరే పెద్ద బలంగా మారింది. గత ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే పార్టీ మారినా, ద్వితీయ శ్రేణి నాయకత్వంతో పాటు కార్యకర్తలు కాంగ్రెస్ ను నమ్ముకొని ఉన్నారు. దీంతో పాటు పొంగులేటి పట్ల అభిమానంతో ఉన్నోళ్లను, యూత్ ను ఆకట్టుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను, స్థానిక ఎమ్మెల్యే ఫెయిల్యూర్స్ ను ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. కేవలం ఎన్నికల ముందు చేసిన శంకుస్థాపనలు తప్పించి, నియోజకవర్గానికి నిధులు తేవడంలో విఫలమయ్యారని పొంగులేటి చెబుతున్నారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి ప్రధానంగా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను, తాను వ్యక్తిగతంగా ప్రజలకు చేసిన సేవలను నమ్ముకున్నారు. గత ఐదేళ్లలో ప్రజలకు ప్రతి కష్టంలో తాను అండగా ఉన్నానని, చనిపోయిన కుటుంబాలకు రూ.10 వేల చొప్పున పంపిణీ చేయడం, పేద పిల్లల చదువులకు ఆర్థిక సాయం చేయడం, ఆస్పత్రుల్లో వైద్య ఖర్చులకు ఆదుకోవడం వంటి సహాయ కార్యక్రమాలను వివరిస్తున్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, ఇంట్లో మనిషిగా అండదండగా ఉంటున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. నియోజకవర్గానికి ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, ఫిషరీస్ పాలిటెక్నిక్ కాలేజీ మంజూరు చేయించడం తాను సాధించిన విజయంగా చెబుతున్నారు. ఇక సీపీఎం అభ్యర్థి తమ్మినేని వీరభద్రం గత ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్లాన్ చేస్తున్నారు.

యూత్ ఓటర్లే కీలకం..

పాలేరు నియోజకవర్గంలో మొత్తం నాలుగు మండలాలుండగా 2,32,606 మంది ఓటర్లున్నారు. ఇందులో 1,12,607 మంది పురుష, 1,19,994 మంది మహిళా ఓటర్లు, ఐదుగురు ట్రాన్స్​ జెండర్స్​ ఉన్నారు. మొత్తం ఓటర్లలో 56,992 మంది 19 నుంచి 29 ఏళ్లలోపు వయస్సున్న యువ ఓటర్లే. జిల్లాలోనే అత్యధికంగా 24.50 శాతం యూత్ ఓట్లు పాలేరు నియోజకవర్గంలో ఉన్నాయి. ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరగ్గా, ఇందులో రెండుసార్లు ఉప ఎన్నిక జరిగింది. 2004 వరకు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంగా ఉన్న పాలేరు 2009 ఎన్నికల్లో జనరల్ సీటుగా మారింది. ఇక్కడి నుంచి 11 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు గెలవగా, ఒకసారి సీపీఐ, ఒకసారి సీపీఎం, ఒక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న కందాల ఉపేందర్ రెడ్డి గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచి ఆ తర్వాత బీఆర్ఎస్​లో చేరారు. కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న పాలేరులో వారికి పటిష్టమైన ఓటు బ్యాంక్ ఉంది. అయితే అదంతా గతమని.. ఇప్పుడు పరిస్థితులు మారాయని అధికార బీఆర్ఎస్, ఇతర పార్టీల నేతలు చెబుతున్నారు. ఇక ప్రస్తుతం కాంగ్రెస్ తో సీపీఐ పొత్తులో ఉండగా, జనసేన మద్దతుతో బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తున్నారు. అయినా పోటీ మాత్రం ప్రధానంగా కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ అభ్యర్థుల మధ్య ఉంటుందని, ప్రభుత్వ వ్యతిరేక ఓటును సీపీఎం చీల్చే పర్సంటేజీ ఆధారంగా ఇతరుల విజయావకాశాలుంటాయనే అంచనాలు ఉన్నాయి.