హైదరాబాద్, వెలుగు: రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఈ సారి చతుర్ముఖ పోటీ కనిపిస్తున్నది. ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మూడుసార్లు వరుసగా విజయం సాధించినప్పటికీ ఈసారి టఫ్ ఫైట్ ఉంది. 2018లో 58 వేల మెజారిటీతో గెలుపొందినప్పటికీ గత15 ఏండ్లలో చేసిన అభివృద్ధి పెద్దగా లేకపోవడంతో వ్యతిరేకత పెరిగింది. అప్పట్లో పోటీ ఇచ్చే లీడర్లు లేకపోవడం కూడా బీఆర్ఎస్ కు కలిసొచ్చింది.
కానీ ఈ సారి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి బలమైన లీడర్లు ఉన్నారు. మరోవైపు ఎంఐఎం కూడా ఇక్కడ పోటీ చేయబోతుందని ఆ పార్టీ అధినేత అసదుద్దిన్ ఓవైసీ ప్రకటించారు. బీఆర్ఎస్ నుంచి గౌడ సామాజికవర్గానికి చెందిన ప్రకాశ్‌గౌడ్, కాంగ్రెస్ నుంచి ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన కస్తూరి నరేందర్, బీజేపీ నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన తోకల శ్రీనివాస్ రెడ్డి బరిలో ఉన్నారు.
ఎంఐఎం నుంచి పోటీ చేసేందుకు హిందువులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో 50 వేల ఓట్లు ఎంఐఎం సాధిస్తుంది. ఈ సెగ్మెంట్ లో లక్షన్నర మైనార్టీ ఓట్లు ఉండగా, దాదాపు 75 వేల ఓట్లు పోల్ అవుతాయి. ఇందులో 50 వేల ఓట్లు వన్ వే గా ఎంఐఎం కు ఫిక్స్డ్ గా ఉంటాయి. నియోజకవర్గంలో మొత్తం 5.53 లక్షల మంది ఓటర్లు ఉండగా, ఇందులో 55 నుంచి 60 శాతం ఓట్లు పోల్అయ్యే అవకాశం ఉంది. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు గనుక సమానంగా ఓట్లు వస్తే ఎంఐఎం కూడా గెలిచే ఛాన్సెస్ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఓటు బ్యాంకుపై కసరత్తు
సామాజిక వర్గాల వారీగా చూసినా కూడా ఇక్కడ గట్టి పోటీనే కనిపిస్తున్నది. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో అధికార పార్టీ నుంచి గెలుపొందిన ప్రకాష్ గౌడ్ మూడు టర్మ్ లు ఎమ్మెల్యేగా గెలిచారు. ముందుగా టీడీపీ నుంచి, రెండోసారి 2014లో టీడీపీ నుంచి గెలిచిన తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. మూడోసారి అధికార పార్టీ నుంచి గెలుపొందారు.
ప్రస్తుత మైలార్ దేవ్ పల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. 2018లోనూ అధికార పార్టీ నుంచి టికెట్ ఆశించారు. టికెట్ రాకపోవడంతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేసి ఓడారు. కాంగ్రెస్ నుంచి ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన కస్తూరీ నరేందర్ పోటీలో ఉన్నారు. నియోజవర్గంలో గౌడ సామాజివర్గానికి చెందిన ఓటర్లు 25 వేలు, రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు 40 వేలు, ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన వారు 45 వేల మంది ఉన్నారు.
ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్ ఓట్లు దాదాపు లక్ష వరకు ఉంటాయి. మైనార్టీల ఓట్లు లక్షన్నర ఉన్నాయి. సామాజిక వర్గాల వారీగా ఇప్పటికే ఓటుబ్యాంకుపై అన్ని పార్టీలు కసరత్తులు చేస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఈసారి పార్టీలను కాదని సామాజిక వర్గాల వారీగా మద్దతు తెలిపేందుకు లీడర్లు సిద్ధమయ్యారు.
సెటిలర్ల ఓట్లు పెరిగినయ్..
రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 5,52,535 మంది ఉన్నారు. ఇందులో మహిళలు 2,64,053, పురుషులు 2,88,270, థర్డ్ జెండర్ 39, ఎన్ఆర్ఐలు 80, సర్వీసు ఓటర్లు 93 మంది ఉన్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 2.14 లక్షల ఓట్లు పోలయ్యాయి. అప్పట్లో టీడీపీకి 77,843 ఓట్లు రాగా, కాంగ్రెస్ కు 51,962 ఓట్లు, ఎంఐఎంకు 49,053, బీఆర్ఎస్ కు 29,870 ఓట్లు వచ్చాయి. 2018లో 2,50,934 ఓట్లు పోల్ కాగా, బీఆర్ఎస్ కు 1,08,964 ఓట్లు వచ్చాయి.
అప్పట్లో మహాకూటమిలో ఈ నియోజకవర్గం టీడీపీకి దక్కగా 50,591 ఓట్లు వచ్చాయి. ఎంఐఎంకు 46,547 ఓట్లు, బీజేపీకి 19,627, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి 13,084 ఓట్లు వచ్చాయి. గతంతో పోలిస్తే ఈ సారి 50వేలకిపైగా ఓటర్లు పెరిగారు. సెటిలర్ల ఓట్లు ఎక్కువయ్యాయి. గతంతో పోలిస్తే ఈ సారి పొలింగ్ శాతం కూడా పెరిగే అవకాశాలున్నాయి.
పార్టీల వారీగా బలాబలాలు
రాజేంద్రనగర్ నియోజకవర్గం జీహెచ్ఎంసీతో పాటు మున్సిపాలిటీలు, గ్రామాపంచాయతీల్లో విస్తరించి ఉన్నది. గ్రేటర్ లో సులేమాన్ నగర్, శాస్ర్తిపురం, అత్తాపూర్, రాజేంద్రనగర్, మైలార్ దేవ్ పల్లి ఐదు డివిజన్లు ఉన్నాయి. ఇందులో సులేమాన్ నగర్, శాస్ర్తిపురం డివిజన్లు మినహా మిగతా మూడు డివిజన్లలో బీజేపీ కార్పొరేటర్లు గెలుపొందారు.
బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ తో పాటు శంషాబాద్, మణికొండ, నార్సింగి మున్సిపాలిటీలున్నాయి. ఇందులో మణికొండలో బీజేపీ–కాంగ్రెస్కలిసి చైర్మన్‌పదవిని సొంతం చేసుకోగా, బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ తో పాటు నార్సింగి, శంషాబాద్ మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ చైర్మన్లు ఉన్నారు. ఇందులో బండ్లగూడ జాగీర్, నార్సింగిలో సొంతపార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇక్కడ అవిశ్వాస తీర్మానాలు పెట్టేందుకు కూడా సిద్ధమైనప్పటికీ నాలుగేళ్లకి పెంచడంతో వెనక్కి తగ్గారు. ఇందులో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకి చెందిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఉన్నారు.
ఇది కాకుండా 27 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గ్రామాల వారీగా చూస్తే సర్పంచ్ లు ఎక్కువగా బీఆర్ఎస్ కిచెందిన వారే ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. చాలా మంది బీఆర్ఎస్ను వీడి ఇతర పార్టీల్లోకి చేరుతున్నారు. మొత్తానికి పార్టీల వారీగా చూస్తే అధికారపార్టీకి ఎక్కువ మద్దతు ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలతో చూస్తే ఇప్పుడు పూర్తిగా మార్పు కనిపిస్తున్నది.