- హ్యాట్రిక్ కొట్టాలనుకుంటున్న వేముల ప్రశాంత్ రెడ్డి
- అల్లుడిని ఓడించాలని అన్నపూర్ణమ్మ ప్రయత్నం
- ఎమ్మెల్యే కావాలని సునీల్‌రెడ్డి..
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి టఫ్ ఫైట్ ఉండబోతున్నది. ప్రధాన పార్టీ అభ్యర్థులంతా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడం ఆసక్తి రేపుతోంది. బీఆర్ఎస్తరఫున వరుసగా రెండుసార్లు గెలిచి మంత్రి అయిన వేముల ప్రశాంత్‌రెడ్డి హ్యాట్రిక్కొట్టాలని తహతహలాడుతున్నారు. అతన్ని ఓడించడమే లక్ష్యంగా మాజీ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మ బీజేపీ నుంచి బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్‌నుంచి ఆరెంజ్ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్‌రెడ్డి పోటీ చేస్తున్నారు.
ముగ్గురూ ఎన్నికల ప్రచారంలో నువ్వా? నేనా? అన్నట్లు దూసుకెళ్తున్నారు. నియోజకవర్గంలో పురుష ఓటర్లు 99,728 ఉండగా, మహిళా ఓటర్లు 1,15,898 మంది ఉన్నారు. అధికంగా ఉన్న మహిళా ఓటర్లతోపాటు బీసీ, ఎస్సీ సామాజికవర్గాల ఓట్లను గంపగుత్తగా పొందడానికి ప్రలోభాలు నడుస్తున్నాయి. పసుపు రైతుల సమస్యలు, గల్ఫ్‌బాధితుల పునరావాసం తదితర అంశాలు ప్రభావం చూపనున్నాయి.
సగం పాజిటివ్.. సగం నెగెటివ్
2014, 2018 ఎన్నికల్లో వరుసగా గెలిచిన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి కేసీఆర్కేబినెట్లోరోడ్లు, భవనాల శాఖ దక్కింది. మంత్రి హోదాలో నియోజకవర్గంలోని ప్రధాన రోడ్ల స్థానంలో కొత్తవి నిర్మించారు. మండల కేంద్రాల్లో సెంట్రల్లైటింగ్సిస్టమ్ఏర్పాటు చేయించారు. ఎర్గట్ల, మెండోరా, ముప్కాల్ గ్రామాలను మండల కేంద్రాలుగా మార్చారు. సీఎం కేసీఆర్ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడని నియోజకవర్గంతోపాటు జిల్లా వ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఇంతవరకు బాగానే ఉన్నా ప్రశాంత్‌రెడ్డిపై అవినీతి ఆరోపణలు ఎక్కువయ్యాయి.
ఆయన నేతృత్వంలోని బట్టాపూర్మైనింగ్క్వారీ అక్రమాలు ప్రజల్లో విస్తృతంగా ప్రచారమయ్యాయి. హైకోర్టు జోక్యం చేసుకునే దాకా క్వారీ మూతపడలేదని, గడిచిన ఐదేండ్లలో ప్రభుత్వ కాంట్రాక్టులన్నీ బంధువులకు ఇప్పించుకున్నారనే విమర్శలున్నాయి. కాంట్రాక్టులు దక్కలేదని సొంత పార్టీ నేతలే అసంతృప్తితో ఉన్నారు. వారంతా మనస్ఫూర్తిగా ప్రశాంత్‌రెడ్డి గెలుపు కోసం పనిచేస్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ప్రశాంత్‌రెడ్డి ఓవైపు ప్రచారం చేస్తూనే.. మరోవైపు అసంతృప్త నేతలను బుజ్జగించే పనిలో బిజీగా ఉన్నారు.
సునీల్ రెడ్డికి యూత్ ఫాలోయింగ్
కాంగ్రెస్అభ్యర్థి సునీల్‌రెడ్డి ఈసారి ఎలాగైనా ఎమ్మెల్యేగా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. 2018 ఎన్నికల్లో బీఎస్పీ తరఫున పోటీచేసి రెండో స్థానానికి పరిమితమైనప్పటికీ గ్రామస్థాయిలో ప్రజలకు దగ్గరయ్యారు. ఐదేండ్లుగా పేదల పెళ్లిళ్లు, వైద్య ఖర్చులకు సాయం చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. తన ట్రావెల్స్‌లోనే చాలా మంది యువతకు ఉద్యోగాలిచ్చారు. నియోజకవర్గంలోనే ఇల్లు కట్టుకుని అందరికీ అందుబాటులో ఉంటాననే సంకేతాలు ఇచ్చారు. యూత్‌లో ఫాలోయింగ్ ఉంది. గత ఎన్నికల్లో ఆయన కోసం పనిచేసిన కేడర్‌తోపాటు, కాంగ్రెస్ పార్టీ ఓట్‌బ్యాంక్ అదనపు బలం కానుంది. అయితే పార్టీలోకి చేరగానే సునీల్‌రెడ్డికి టికెట్ఇవ్వడం కాంగ్రెస్‌లోని సీనియర్లకు నచ్చడం లేదు. కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకున్న వారిని కాదని కొత్తవారికి చాన్స్ ఇచ్చారని కొందరు అసంతృప్తితో ఉన్నారు.
బీజేపీలో పాత కేడర్ యాక్టివ్..
బాల్కొండ నియోజకవర్గంలో ఏలేటి అన్నపూర్ణమ్మ తన భర్త మహిపాల్ రెడ్డి మరణాంతరం రాజకీయాల్లోకి వచ్చారు. టీడీపీ నుంచి రెండుసార్లు గెలిచారు. డైనమిక్లీడర్గా ఆమెకు పేరుంది. అన్నపూర్ణమ్మ కొడుకు మల్లికార్జున్‌రెడ్డి 2014లో ప్రశాంత్‌రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. మల్లికార్జున్‌రెడ్డి హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ హాస్పిటల్లో డాక్టర్‌గా పనిచేస్తూనే, బీజేపీలో యాక్టివ్ గా కొనసాగుతున్నారు. అన్నపూర్ణమ్మకు ప్రశాంత్‌రెడ్డి స్వయానా అన్న కొడుకు. వీరి రెండు కుటుంబాల మధ్య దశాబ్దాలుగా రాజకీయ వైరం నడుస్తోంది.
ప్రశాంత్‌రెడ్డిని ఎలాగైనా ఓడించి మూడోసారి అసెంబ్లీలో అడుగుపెట్టాలని అన్నపూర్ణమ్మ చూస్తోంది. మరోసారి మల్లికార్జున్రెడ్డినే బరిలో దింపాలని భావించినా, ప్రశాంత్‌రెడ్డిని ఢీకొట్టాలంటే అన్నపూర్ణమ్మనే సరైన అభ్యర్థి అని బీజేపీ హైకమాండ్ భావించింది. మంత్రి అవినీతి, అక్రమాలనే ప్రచార అస్త్రాలుగా చేసుకుని అన్నపూర్ణమ్మ ముందుకుసాగుతున్నారు.