గెలుపు కోసం పోరాటం మెజార్టీ కోసం ఆరాటం

గెలుపు కోసం పోరాటం మెజార్టీ కోసం ఆరాటం
  • 2014లో కేవలం 2,219 ఓట్ల మెజారిటీతోనే గెలుపు
  • 2018 ఎన్నికల్లోనూ వచ్చింది 6 వేల లోపే

సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి జగదీశ్​రెడ్డి కొద్దిరోజులుగా ఓట్ల మెజారిటీ జపం చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో  కేవలం 2,219 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన ఆయన.. 2018 ఎన్నికల్లో ఎంత చెమటోడ్చినా 5,967 ఓట్ల మెజారిటీ మాత్రమే వచ్చింది. దీంతో ఈసారి ఎలాగైనా భారీ మెజారిటీ సాధించాలనే పట్టుదలతో జగదీశ్ రెడ్డి ఉన్నారు. ఈ క్రమంలో ఎక్కడ మీటింగు పెట్టినా ‘కోట్లు తెచ్చి అభివృద్ధి చేస్తున్న.. ఈ సారి 50 వేల మెజారిటీ రావాలె.. లీడర్లు, కార్యకర్తలు కష్టపడాలే’ అంటూ సూచనలిస్తున్నారు. 

ఈ క్రమంలోనే సీఎం, మంత్రులను రప్పించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయిస్తున్నారు. కానీ పార్టీలో అసమ్మతి కారణంగా మెజారిటీ సంగతేమోగానీ గెలిస్తే అదే పదివేలు అంటూ లీడర్లు, క్యాడర్​గుసగుసలాడుతున్నారు.

 
తెలంగాణ ఊపులోనూ అత్తెసరు మెజారిటే..

 తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో  మంత్రి జగదీశ్​ రెడ్డి కేవలం 2,219 ఓట్ల మెజారిటీతోనే గెలుపొందారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, ప్రస్తుత బీజే‌పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. ఆటో గుర్తుపై పోటీచేసిన సంకినేని ఏకంగా 41,335 ఓట్లు సాధించగా, బీఆర్ఎస్​ నుంచి పోటీ చేసిన జగదీశ్ రెడ్డి 43,554 ఓట్లకే పరిమితమయ్యారు. దామోదర్​రెడ్డికి 39,175 ఓట్లు వచ్చాయి. 

ALSO READ : ఇవాళ(అక్టోబర్6) ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు

2018 ఎన్నికల్లోనూ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను కాంగ్రెస్​ నుంచి దామోదర్​రెడ్డి, బీజేపీ నుంచి సంకినేని చీల్చడం వల్లే జగదీశ్ రెడ్డి బయటపడ్డారని టాక్. మంత్రి హోదాలో ఉండి కూడా 5,967 ఓట్ల మెజారిటీకే పరిమితమయ్యారు. ఈసారి కూడా అటు కాంగ్రెస్​ నుంచి, ఇటు బీజేపీ నుంచి బలమైన అభ్యర్థులు బరిలో ఉంటే తాను గెలవడం ఖాయమని భావిస్తున్న మంత్రి జగదీశ్​ రెడ్డి.. మెజారిటీ పెంచుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. 

ఈ క్రమంలోనే మంత్రులు కేటీఆర్, హరీశ్​రావులను తరచూ సూర్యాపేటకు రప్పిస్తున్నారు. ఇటీవల సీ‌ఎం కే‌సీ‌ఆర్ తో మెడికల్ కాలేజీ, కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను ఓపెనింగ్​చేయించారు. ఆ తర్వాత 10 రోజుల్లోనే  పాత కలెక్టరేట్ ను ఐటీ హబ్ గా మార్చి..  మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం​ చేయించారు. ఇటీవలే దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డిని కూడా రప్పించి.. బ్రాహ్మణ సదనం ప్రారంభించారు. అలాగే, ‘సూర్యాపేటకు మూసీ నుంచి విముక్తి కలిగించిన.. రూ.7 వేల కోట్లు తెచ్చి అభివృద్ధి పనులు చేపట్టిన.. 50 వేల మెజారిటీ అయినా రాకపోతే ఎట్లా?’ అని ప్రతి మీటింగులో ప్రసంగిస్తున్నారు.

తలనొప్పిగా మారిన అసమ్మతి.. 

భారీ మెజారిటీపై దృష్టి పెట్టిన మంత్రి జగదీశ్​రెడ్డికి అధికార పార్టీలోని అసమ్మతి తలనొప్పిగా మారింది. ఇటీవల మంత్రికి వ్యతిరేకంగా టికెట్ ఆశిస్తున్నట్లు ప్రకటించిన డీసీఎంఎస్​ చైర్మన్ వట్టె జానయ్యపై కేసులు నమోదవడం, ఆయన బీఎస్పీ నుంచి పోటీ చేయబోతుండటం జగదీశ్ రెడ్డికి మైనస్ అవుతుందని తెలుస్తున్నది. ఆయన బలమైన బీసీ లీడర్ ​కావడంతో అధికార పార్టీకి కీలక ఓటు బ్యాంకుగా ఉన్న బీసీలు దూరమయ్యారనే టాక్​ నడుస్తోంది. జానయ్య విషయంలో మంత్రి జగదీశ్​ రెడ్డి తీరుపై సొంత పార్టీ నేతలే లోలోపల రగిలిపోతున్నట్లు చెప్తున్నారు. 

లోకల్​గా  కాంట్రాక్ట్​వర్కులన్నీ స్థానిక ప్రజాప్రతినిధులతో కాకుండా తన అనుచరుల ద్వారా చేయించడాన్ని సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు జీర్ణించుకోలేకపోతున్నారు. హైకమాండ్​ చేయించిన సర్వే ఫలితాలు మంత్రికి వ్యతిరేకంగా రావడంతో హైకమాండ్​ హెచ్చరించినట్లు తెలిసింది. దీంతో నెలరోజులుగా అసమ్మతి నేతలను బుజ్జగిస్తున్న మంత్రి.. ఈసారి ఎలాగైనా మెజారిటీ పెరిగేలా కృషి చేయాలని చెప్తుండటం.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా మంత్రి తీరు ఉందని, మెజారిటీ సంగతేమోగానీ, అత్తెసరు ఓట్లతో గెలిస్తే అదే పదివేలని గుసగుసలాడుకుంటున్నారు.