- హస్తానికి ఏడుగురు ఎమ్మెల్యేలు అదనపు బలం
- రెండు పార్టీల నుంచిబలమైన అభ్యర్థులు
- నేతలు కారు దిగడంతో డీలా పడిన బీఆర్ఎస్
- కాంగ్రెస్ కోసం ఏకతాటిపైకి ఎమ్మెల్యేలు
వరంగల్, వెలుగు: వరంగల్ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీల మధ్యే టఫ్ ఫైట్ కొనసాగనుంది. గత రెండు, మూడు ఎన్నికల్లో వరంగల్ స్థానాన్ని దాదాపు అన్ని పార్టీలు లైట్ తీసుకోగా.. ఈసారి బలమైన అభ్యర్థులను ఎంపిక చేశాయి. కాంగ్రెస్ తరఫున సీనియర్ నేత కడియం శ్రీహరి బిడ్డ డాక్టర్ కావ్య, బీజేపీ నుంచి వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్, బీఆర్ఎస్ నుంచి హనుమకొండ జడ్పీ చైర్మన్ మారెపల్లి సుధీర్ కుమార్ పోటీ చేస్తున్నారు. వీరంతా మొన్నటి వరకు బీఆర్ఎస్లోనే ఉండగా..కాంగ్రెస్అధికారంలోకి రావడం, ఎంపీ ఎలక్షన్లు రావడంతో వివిధ పార్టీల్లో చేరి పోటీదారులుగా మారారు.
ఏడుగురికి ఏడుగురు కాంగ్రెస్ఎమ్మెల్యేలే..
వరంగల్ఎస్సీ లోక్సభ నియోజకవర్గ పరిధిలో వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల, భూపాలపల్లి, స్టేషన్ ఘనపూర్, పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గాలుండగా ..మొన్న జరిగిన ఎన్నికల్లో అన్ని స్థానాలను కాంగ్రెస్పార్టీ కైవసం చేసుకుంది. దీంతో ఈ ఎన్నికల్లో ఏడుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య గెలుపే లక్షంగా పని చేస్తున్నారు.
వరంగల్ తూర్పు నుంచి మంత్రి కొండా సురేఖ, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, వర్ధన్నపేట శాసనసభ్యుడు కేఆర్.నాగరాజు, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‍రెడ్డి, భూపాలపల్లి నుంచి గండ్ర సత్యనారాయణ, పాలకుర్తి ప్రజాప్రతినిధి యశస్వినిరెడ్డితో పాటు స్టేషన్ ఘన్పూర్లో కావ్య తండ్రి కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా ఉన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ లకు ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా పోయాడు.
అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా 6 లక్షల 63 వేల ఓట్లు వచ్చాయి. 4 లక్షల 16 వేల ఓట్లతో రెండో స్థానంలో నిలిచిన బీఆర్ఎస్ పార్టీ నుంచి దళిత నేతలైన కడియం శ్రీహరి, ఆరూరి రమేశ్, సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ ఇతర పార్టీల్లోకి వెళ్లడంతో కారు పార్టీ డీలా పడింది. బీఆర్‍ఎస్ పార్టీ టికెట్వచ్చాక కాంగ్రెస్‍లో చేరి సంచలనం సృష్టించిన కావ్య ఆ పార్టీ నుంచి వరంగల్టికెట్ సాధించారు.
అయితే, మొదట్లో సొంత పార్టీ నేతలు పెద్దగా సహకరించలేదు. దీంతో సీఎం రేవంత్‍రెడ్డి వారందరితో సమావేశం నిర్వహించి బాధ్యతలు అప్పజెప్పి కావ్య గెలుపుకు కృషి చేయాలని దిశా నిర్ధేశం చేశారు. దీంతో అందరూ ఏకతాటిపైకి వచ్చి కావ్య గెలుపు కోసం కష్టపడుతున్నారు.
గెలుపుపై బీజేపీ అభ్యర్థి ఆరూరి ధీమా
గత అసెంబ్లీ ఎన్నికల వరకు బీఆర్ఎస్లో ఉన్న ఆరూరి రమేశ్ తర్వాత బీజేపీలో చేరి టికెట్తెచ్చుకున్నారు. అప్పుడెప్పుడో జంగారెడ్డి తప్పితే ఇంతవరకు ఇక్కడ బీజేపీ నుంచి ఎవరూ ఎంపీగా గెలవలేదు. గత ఎన్నికల్లోనూ బీఆర్‍ఎస్ అభ్యర్థికి 6 లక్షల ఓట్లు రాగా.. బీజేపీకి 83 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. ప్రస్తుతం బీఆర్‍ఎస్ తన ప్రభావాన్ని కోల్పోవడంతో మొన్నటివరకు తాను పనిచేసిన గులాబీ పార్టీ కేడర్ తనకు సహకరిస్తుందని ఆరూరి ఆశిస్తున్నారు.
బీజేపీ సైతం గత ఎన్నికలతో పోలిస్తే చాలా వరకు పుంజుకుంది. గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ 10 స్థానాలను గెలుచుకుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ తూర్పు, పశ్చిమ, పరకాల వంటి నియోజకవర్గాల్లో కమలం పార్టీ అభ్యర్థులు మంచి ఓట్లు సాధించారు. ఇదంతా అరూరికి ప్లస్ కానుంది. ఎలక్షన్ల సమయంలో పోల్ మేనేజ్‍మెంట్ చేయడంలో రమేశ్‍కు అనుభవం ఉంది. కడియం శ్రీహరి, కావ్య వ్యతిరేకులంతా తన విజయం కోసం పనిచేస్తారని ఆయన భావిస్తున్నారు.
అయితే..వరంగల్ లోక్సభ స్థానం పరిధిలో వీరి పార్టీకి ఒక్క ఎమ్మెల్యే లేకపోవడం..కొన్ని నియోజకవర్గాల్లో సరైన నాయకత్వం, క్యాడర్లేకపోవడం మైనస్ గా మారనుంది.
చతికిలపడిన బీఆర్ఎస్
వరంగల్ ఎంపీ స్థానాన్ని వరుసగా మూడుసార్లు గెలుచుకున్న బీఆర్‍ఎస్ వరంగల్ లో ఈసారి ఊహించని రీతిలో డీలా పడింది. మిగతా పార్టీలతో పోలిస్తే ఐదారుగురు బలమైన దళిత నేతలతో తమకు వరంగల్ ఎస్సీ రిజర్వేషన్ స్థానంలో ఎదురేలేదని భావించిన పార్టీకి..కడియం శ్రీహరి, అరూరి రమేశ్, సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ దూరమై ఎన్నికల్లో ప్రత్యర్థులుగా రావడంతో ఖంగుతింది.
పోటీ తప్పని క్రమంలో హనుమకొండ జడ్పీ చైర్మన్ మారెపల్లి సుధీర్ కుమార్‍కు టికెట్ఇవ్వాల్సి వచ్చింది. గతంలో వరంగల్ లోక్సభ పరిధిలో ఏడుగురు ఎమ్మెల్యేలు గులాబీ పార్టీకి చెందినవారే ఉండగా, ఇప్పుడు సీన్ రివర్సయ్యింది. ఏడుచోట్లా హస్తం పార్టీ ఎమ్మెల్యేలే ఉండటంతో బీఆర్ఎస్ఎదురీదుతోంది.