న్యూజిలాండ్ జట్టు త్వరలో పాకిస్తాన్లో పర్యటించనుంది. ఈ ఇరు జట్ల మధ్య ఏప్రిల్ 18 నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. కీలక ఆటగాళ్లందరూ ఐపీఎల్ (2024)లో చిక్కుకుపోవడంతో బి- గ్రేడ్, సి- గ్రేడ్ ఆటగాళ్లతోనే కివీస్ జట్టు.. పాక్ పర్యటనకు రానుంది. ఈ నేపథ్యంలో గెలుపు అవకాశాలపై ఆ జట్టు ఓపెనర్ ఫిన్ అలెన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్‌ను ఓడించడం కష్టమని వ్యాఖ్యానించాడు.
స్టార్లంతా ఐపీఎల్‌లోనే..
కివీస్ రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సహా ఆటగాళ్లు ట్రెంట్ బౌల్ట్, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్లు ఐపీఎల్ టోర్నీలో ఆడుతున్నారు. వీరు లేకపోవడం వల్ల న్యూజిలాండ్ జట్టు బలహీనంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితులలో పాకిస్థాన్‌ను వారి సోతగడ్డపై ఓడించడం కష్టమని ఫిన్ అలెన్ చెప్పుకొచ్చాడు.
"స్టార్ పవర్‌ను కోల్పోవడంతో, న్యూజిలాండ్ వర్ధమాన ఆటగాళ్లకు ఈ సిరీస్ చక్కని అవకాశం. బలమైన పాకిస్తాన్ జట్టును ఏ మేరకు అడ్డుకుంటారో తెలుస్తుంది. సూపర్ స్మాష్ టోర్నమెంట్‌లో తమ ప్రతిభను కనబరిచిన టిమ్ రాబిన్సన్ వంటి యువకులు సత్తా చాటొచ్చు. ఈ ఏడాది ప్రారంభంలో పాకిస్తాన్‌పై 4-1 తేడాతో సిరీస్ గెలిచాం.. కానీ, ప్రస్తుతం వారి గడ్డపై ఉన్నాం.. స్వదేశంలో వారిని ఓడించడం చాలా కష్టం.." అని అలెన్ పేర్కొన్నాడు.
పాక్ పర్యటనకు న్యూజిలాండ్ జట్టు:
మైఖేల్ బ్రేస్‌వెల్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మార్క్ చాప్‌మన్, జోష్ క్లార్క్‌సన్, జాకబ్ డఫీ, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్, బెన్ లిస్టర్, కోల్ మెక్‌కాంచీ, ఆడమ్ మిల్నే, జిమ్మీ నీషమ్, విల్ ఓరూర్క్, టిమ్ రాబిన్సన్, బెన్ సియర్స్, టిమ్ సోధి, ఇష్ సోధి.
న్యూజిలాండ్ vs పాకిస్థాన్ టీ20 సిరీస్ షెడ్యూల్
- మొదటి టీ20: ఏప్రిల్ 18 (రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి)
- రెండో టీ20: ఏప్రిల్ 20 (రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి)
- మూడో టీ20: ఏప్రిల్ 21 (రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి)
- నాలుగో టీ20: ఏప్రిల్ 25 (గడాఫీ స్టేడియం, లాహోర్)
- ఇదో టీ20: ఏప్రిల్ 27 (గడాఫీ స్టేడియం, లాహోర్)