హైదరాబాద్లోని ఉప్పల్లో యాత్రల పేరిట భారీ మోసానికి పాల్పడిన నిందితుడి నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ పుణ్యక్షేత్రాల పేరుతో శ్రీ గాయత్రి టూర్స్ ట్రావెల్స్ ఆఫర్స్ ప్రకటించి.. పలు ఆఫర్స్ పేరుతో కోట్లల్లో వసూళ్లు చేసింది. ఉప్పల్ కళ్యాణ్పురిలో భరత్ కుమార్ శ్రీ గాయత్రి టూర్స్ ట్రావెల్స్ నిర్వహిస్తున్నాడు. తక్కువ ధరకే కైలాస యాత్ర పేరిట టూరిస్ట్ ప్యాకేజీలను ప్రకటించి, సోషల్ మీడియాలో ఫుల్ పబ్లిసిటీ చేసుకుని గత ఐదేళ్ల నుంచి దాదాపు రూ.15 కోట్లు వసూళ్లు చేశాడు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడుకు చెందిన యాత్రికుల వద్ద భారీగా వసూళ్లు చేశాడు.
ఎప్పుడు తీసుకెళ్తారని అడిగితే.. ఇప్పుడు, అప్పుడు అంటూ గత మూడేళ్ళ నుంచి కరోనా పేరు చెప్పి శ్రీ గాయత్రీ ట్రావెల్స్ నిర్వాహకుడు భరత్ కుమార్ తప్పించుకుని తిరుగుతున్నాడు. తీసుకున్న డబ్బులు ఇవ్వకపోవడం, మాయమాటలు చెబుతూ రేపుమాపు టూర్ అంటూ బాధితులని మోసం చేయడంతో నిర్వాహకుడిపై డబ్బులు కట్టిన బాధితులు తిరగబడ్డారు. బాధితులు ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో భరత్ కుమార్ శర్మ ని ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
ఒక్కొక్కరి దగ్గర రెండు నుంచి మూడు లక్షల రూపాయల వసూళ్లు చేసినట్టుగా బాధితులు తెలిపారు. 500 మంది పైగా బాధితులు ఇతని మాటలు నమ్మి డబ్బులు కట్టారంటే ఏ స్థాయిలో మాయ చేశాడో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ టోటల్ ఎపిసోడ్లో మరో ట్విస్ట్ ఉంది. భరత్ కుమార్ బెయిల్పై బయటికి వచ్చి మళ్లీ యాత్రల పేరిట డబ్బులు వసూలు చేస్తున్నాడని బాధితుల ఆరోపించారు. నిందితుడు భరత్ కుమార్ను అరెస్ట్ చేయాలని, తమకు న్యాయం చేయాలని ఉప్పల్ పోలీస్ స్టేషన్ ముందు బాధితులు ఆందోళనకు దిగారు.