బషీర్ బాగ్, వెలుగు: రాష్ట్రంలో అంతరించిపోతున్న జానపద కళారూపాలకు పునర్వైభవం తీసుకువస్తామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. కళా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని.. కవులు, కళాకారులు, రచయితలకు సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు. భాషా సంస్కృతిక శాఖ, రాష్ట్ర జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో శనివారం రవీంద్ర భారతిలో నిర్వహించిన ప్రపంచ జానపద దినోత్సవాలకు మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీవీలు, కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు రాక ముందు జానపద కళాకారులకు ప్రత్యేక గుర్తింపు ఉండేదని, కష్టానికి తగ్గ ఫలితం పొందేవారన్నారు. అరచేతిలో ప్రపంచాన్ని చూసే రోజులొచ్చాక కళాకారుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కళాకారుల వద్ద ఉన్నా.. ప్రతిభను మాటల్లో చెప్పుకోవడానికి తప్ప ప్రదర్శిస్తే చూసేవారు కరువయ్యారన్నారు. ప్రాచీన వారసత్వాన్ని భావితరాలకు అందించే కళలు, కళాకారులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని మంత్రి చెప్పారు.
కార్యక్రమంలో సంగీత నాటక అకాడమీ చైర్ పర్సన్ డాక్టర్ అలేఖ్య పుంజల, పద్మశ్రీ పురస్కార గ్రహీతలు కెతావత్ సోమలాల్, గడ్డం సమమయ్య, జానపద కళాకారుల సంఘం గౌరవాధ్యక్షుడు కేవీ రమణాచారి, పారిశ్రామికవేత్త సారిపల్లి కొండలరావు, యువ కళావాహని అధ్యక్షుడు లంకా లక్ష్మీనారాయణ, భాషా, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, జానపద కళాకారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.