- టూరిస్ట్ ప్రదేశాల్లో వసతులు కరువు
- నిర్మల్‌లో నిర్మాణ పనులకు బ్రేక్
- నిధుల కొరతతో ముందుకు సాగని పర్యాటకం
నిర్మల్, వెలుగు: అపారమైన ప్రకృతి వనరులు, చారిత్రక కట్టడాలు, పురాతన దేవాలయాలకు నెలవైన నిర్మల్ జిల్లా టూరిజంలో వెనుకబడిపోతోంది. టూరిజం కారిడార్ ఏర్పాటుకావడంలేదు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇందుకు కార్యాచరణ రూపొందించినా ముందడుగు పడలేదు. హరిత రిసార్టులు నిర్మించలేదు. సరైన వసతులు లేకపోవడంతో ఈ ప్రాంతాలను సందర్శించేందుకు పర్యాటకులు వెనుకడుగు వేస్తున్నారు.
చారిత్రక ఆలయాలను కలుపుతూ..
అప్పటి పర్యాటక శాఖ కమిషనర్ సైతం నిర్మల్ జిల్లాలోని టూరిస్టు ప్రాంతాలను సందర్శించి కారిడార్‌కు సంబంధించిన ప్రతిపాదనలను రూపొందించారు. దాదాపు రూ.50 కోట్లతో ఈ టూరిజం కారిడార్‌ను ఏర్పాటు చేయాలని తలపెట్టారు. జిల్లాలోని అన్ని పర్యాటక ప్రదేశాలను కలుపుతూ రూట్ మ్యాప్ సైతం సిద్ధం చేశారు. రైల్వే సౌకర్యం ఉన్న బాసర నుంచి కవ్వాల్ అభయారణ్యం, కుంటాల వాటర్ ఫాల్స్ వరకు రూట్ మ్యాప్‌ను రూపొందించారు. నిర్మల్ టౌన్ ను కేంద్రంగా చేసుకొని మూడు వైపులా ఈ టూరిజం కారిడార్‌ను అనుసంధానం చేయాలని తలపెట్టారు.
ఇందులో భాగంగానే బాసర సరస్వతి దేవి ఆలయ అభివృద్ధికి రూ.50 కోట్లతో మాస్టర్ ప్లాన్ తయారు చేశారు. బాసర ఆలయం నుంచి కదిలి పాపహరేశ్వరాలయం, కాల్వ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం, మామిడ మండలంలోని చారిత్రక బూరుగుపల్లి రాజరాజేశ్వరాలయాన్ని లింక్ చేశారు. అలాగే నిర్మల్ టౌన్‌లోని గండి రామన్న సాయిబాబా మందిరం, మల్లన్నగుట్ట హరిహర క్షేత్రాన్ని ఈ కారిడార్ పరిధిలోకి చేర్చారు.
పక్కా ప్లాన్.. కానీ నిధులు నిల్
చారిత్రక దేవాలయాలన్నింటిని సందర్శించే విధంగా టెంపుల్ కారిడార్‌ను రూపొందించిన అధికారులు ఇక సహజ సిద్ధమైన ప్రకృతి వనరులు, కోటలు, బురుజులను కలుపుతూ ఈ కారిడార్‌ను విస్తరించారు. నిర్మల్ టౌన్‌లోని శ్యామ్ ఘడ్, బత్తీస్ఘడ్ను అభివృద్ధి చేయాలని ఈ రెండు కోటల వద్ద కొంతమేర పనులు కూడా చేపట్టారు. శ్యామ్‌ఘడ్ వద్ద ఆకర్షణీయమైన లైటింగ్, కోట లోపల పలు అభివృద్ధి పనులు చేపట్టారు. కానీ పూర్తిస్థాయిలో చేపట్టకపోవడంతో ఈ కోటను సందర్శించేందుకు పర్యాటకులు వెనుకాడుతున్నారు.
ఎస్సారెస్పీ ప్రాజెక్టు, సోన్ గోదావరి పాత బ్రిడ్జి, కడెం ప్రాజెక్టులను కూడా ఈ కోటలకు లింకేజీ చేశారు. కడెం ప్రాజెక్టు సందర్శన తర్వాత కవ్వాల్ అభయారణ్యాన్ని సందర్శించేలా ప్లాన్ ప్రతిపాదించారు. నిర్మల్ సమీపంలోని కుంటాల వాటర్ ఫాల్స్, పొచ్చెర వాటర్ ఫాల్స్‌ను కూడా ఈ టూరిజం కారిడార్ పరిధిలోకి తీసుకొచ్చారు. రూ.50 కోట్లతో అంచనాలు రూపొందించినప్పటికీ ఏ ఒక్క టూరిజం ప్రదేశం వద్ద ఎలాంటి అభి వృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో అధికారులు పనులు చేపట్టలేదు.
నిర్మల్‌లో నిలిచిపోయిన హరిత రిసార్ట్ నిర్మాణం
టూరిజం కారిడార్‌ను రూపొందించే క్రమంలో నిర్మల్‌ను సెంటర్ పాయింట్‌గా చేసుకోవాలని ప్రతిపాదించారు. ఇప్పటికే నిర్మల్‌లో అనుకూలమైన రవాణా సౌకర్యంతో పాటు లాడ్జీలు, ఇతర హోటళ్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. దీనికి తోడు టూరిజం శాఖ ఆధ్వర్యంలో హరిత రిసార్ట్‌ను కూడా నిర్మించేందుకు ప్లాన్ చేశారు. దాదాపు రూ.10 కోట్లతో ఇక్కడి ఐబీలో రిసార్ట్ నిర్మాణ పనులు ప్రారంభించారు. అయితే ఎప్పటికప్పుడు నిధులు విడుదల కాకపోవడంతో పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి.
కొత్త సర్కారుపైనే ఆశలు
కాంగ్రెస్ ప్రభుత్వం టూరిజం రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న నేపథ్యంలో జిల్లాలో ప్రతిపాదిత కారిడార్‌పై తిరిగి ఆశలు చిగురిస్తున్నాయి. గత బీఆర్ఎస్ సర్కార్ టూరిజం రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో ఇటువైపు యాత్రికుల సంఖ్య తగ్గిపోవడమే కాకుండా ఆదాయం సన్నగిల్లింది. జిల్లాలోని టూరిజం రంగాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు గతంలో రూపొందించిన కారిడార్ ప్రతిపాదనలకు కాంగ్రెస్ ప్రభుత్వం మోక్షం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.