
- పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ఎండీ ప్రకాశ్ రెడ్డి
ఖమ్మం, వెలుగు : ఖమ్మం ఖిల్లా పైకి వెళ్లేందుకు ఏర్పాటు చేయనున్న రోప్ వే, జాఫర్ బావి అభివృద్ధితో ఖమ్మం ఖిల్లా పర్యాటక ప్రాంతంగా డెవలప్ చెందుతుందని టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎండీ ప్రకాశ్‌రెడ్డి అన్నారు. శనివారం రోప్ వే ప్రతిపాదన స్థలాన్ని, జాఫర్ బావిని ఆయన కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్, ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి పరిశీలించారు.
ఖిల్లాపైకి వెళ్లి సందర్శించే విధంగా రోప్ వే ఏర్పాటుకు అనువుగా ఉండే ప్రాంతంపై చర్చించారు. ఎక్విప్మెంట్ ఖమ్మం ఖిల్లాకు రావడానికి రోడ్డు అనుకూలత, పార్కింగ్, టాయిలెట్స్ ఏర్పాటుపై స్థలం లభ్యత గురించి అధికారులతో మాట్లాడారు. ఇళ్లపై నుంచి వెళ్లే విధంగా కాకుండా ఓపెన్ ప్లేస్ నుండి రోప్ వే ఏర్పాటుకు పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు తుమ్మల యుగంధర్, అధికారులు పాల్గొన్నారు.
ప్రసాద్ స్కీం పనులు పూర్తి కావాలి
భద్రాచలం : డిసెంబరు నెలాఖరు నాటికి భద్రాచలం, పర్ణశాల సీతారామచంద్రస్వామి దేవస్థానంలో చేపడుతున్న ప్రసాద్ స్కీం పనులను పూర్తి చేయాలని టూరిజం ఎండీ ప్రకాశ్‌రెడ్డి ఆదేశించారు. శనివారం భద్రాచలంలో ఆయన పర్యటించి ప్రసాద్ స్కీం ద్వారా భద్రాచలం, పర్ణశాలల్లో జరుగుతున్న రూ.40కోట్ల పనులపై రివ్యూ చేశారు. పనులు త్వరగా పూర్తి చేస్తే, రెండో విడత నిధులు కూడా వస్తాయని తెలిపారు. అనంతరం కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఐటీడీఏ పీవో రాహుల్‌లతో కలిసి రామయ్యను దర్శించుకున్నారు. ఈవో రమాదేవి, ఆర్డీవో దామోదర్ వారికి ఘన స్వాగతం పలికారు.