- గోదావరి తీరంలో సేదతీరే గుడారాలు
- బెండాలపాడులో ట్రెక్కింగ్ సిద్ధం
- పంచ తంత్ర, రెయిన్ వాటర్ టీమ్
- కొత్త ఏడాదిలో పర్యాటకుల సందర్శనకు రెడీ
భద్రాచలం,వెలుగు :ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ బిజీ లైఫ్ ను మైమరిచి పోయేలా విహరించేందుకు పర్యాటకులను ఆకర్షించేలా ‘ఏరు’ సిద్ధమవుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టూరిజం డెవలప్ మెంట్ కు కలెక్టర్జితేశ్వి. పాటిల్వినూత్నంగా ముందుకెళ్తున్నారు. ఇటీవల పంచతంత్ర, రెయిన్వాటర్ ప్రాజెక్టులపై స్టడీ చేసిన అనంతరం 'ఏరు' పేరిట టీజర్‌ను కూడా రిలీజ్చేశారు. 'ఏరు' అంటే కోయ భాషలో నీరు అని అర్థం. ఏరు లోగోను కూడా ఆవిష్కరించారు. నీరు ప్రవహించే తీర ప్రాంతంలో కల్చర్సాయంతో టూరిజం డెవలప్ మెంట్, స్థానిక ఆదివాసీలకు ఉపాధి కల్పించడం దీని ముఖ్యోద్ధేశం. ఇందుకు టూరిజం అభివృద్ధికి రూపొందించిన యాక్షన్ ప్లాన్ లో భాగంగా పనులు స్పీడ్ గా కొనసాగుతున్నాయి. కొత్త ఏడాదిలో జనవరి 8 తేదీ నుంచి పర్యాటకుల సందర్శనకు అవకాశం కల్పిస్తున్నారు. ఇప్పటికే పంచతంత్ర, రెయిన్వాటర్టీమ్ లు విడతల వారీగా టీజర్లను రూపొందించి కలెక్టర్‌కు అందజేస్తున్నాయి.
బోటింగ్ చేస్తూ.. జింకలు చూడొచ్చు
ముందుగా భద్రాచలం వచ్చిన పర్యాటకులు గోదావరి కరకట్ట కింది భాగంలో ఏర్పాటు చేసిన గుడారాల్లో స్టే చేయొచ్చు. అక్కడ రాత్రి పూట ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిట్టింగ్‌లో గోదావరి అందాలను తిలకిస్తూ, ఫైర్ క్యాంపు వద్ద ఎంజాయ్ చేస్తారు. అవసరమైతే బోటింగ్ కూడా చేయొచ్చు. ఇప్పటికే ఇరిగేషన్ఇంజనీర్లు బోట్లను రెడీ చేస్తుండగా.. వీటిలో పూర్తి రక్షణ ఉంటుంది. అక్కడ నుంచి పాల్వంచ మండలం కిన్నెరసాని ప్రాజెక్టు రిజర్వాయర్‌కు వెళ్లి బోటింగ్, జింకల పార్కును చూడొచ్చు. తిరిగి భద్రాచలం వచ్చి సాయంత్రం వేళ దుమ్ముగూడెం మండలం బొజ్జిగుప్ప గ్రామానికి తీసుకెళ్లి.. గిరిజన సంప్రదాయ రేలా నృత్యాలతో పర్యాటకులను స్వాగతిస్తారు. సాయంసంధ్య వేళ ఆదివాసీలతో కలిసి వాగు, చెరువు, మేకపిల్లలు, ఆవుదూడలతో పాటు ఆర్చరీ ఆటను ఆస్వాదించొచ్చు. మంచెలపై చిన్నారులు చిందులు వేయొచ్చు. ఆదివాసీలు అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేసుకుని, ఫొటోలు దిగి ఆనందంతో తిరిగి భద్రాచలం చేరుకుంటారు. ఐటీడీఏలోని ట్రైబల్మ్యూజియంను సందర్శించాక ఇదంతా ఒక రోజులో పూర్తవుతుంది.
ప్రకృతి అందాలను ఆస్వాదించే చాన్స్
మరుసటి రోజు భద్రాచలం నుంచి చండ్రుగొండ మండలం బెండాలపాడుకు వెళ్లి ట్రెక్కింగ్చేసి.. కొండలెక్కి, వ్యూ పాయింట్ద్వారా ప్రకృతి అందాలను తిలకించే చాన్స్ ఉంది. అక్కడ ఆదివాసీ వంటలను ఆరగించిన అనంతరం తిరిగి తమ గమ్యస్థానాలకు వెళ్లిపోవచ్చు. రెండు రోజుల పాటు జిల్లాలో పర్యాటక ప్రాంతాలను చుట్టేస్తారు. ఇవే కాకుండా అశ్వాపురం మండలం తుమ్మలచెరువు, ఇల్లెందు మండలం పూబెల్లి, జూలూరుపాడు మండలం చింతల తండాల్లో కూడా టూరిజం స్పాట్లను డెవలప్ చేస్తున్నారు. మణుగూరు మండలంలోని రథం గుట్టలు, పగిడేరులను తర్వాత దశలో టూరిస్టులకు పరిచయం చేయనున్నారు. 'ఏరు' పేరిట జిల్లాలో పరిచయం చేసే టూరిజం ఆదివాసీల జీవనచిత్రాన్ని
మార్చేయనుంది.
ఆదివాసీలకు మంచి రోజులు వచ్చినట్లే
ఏరు పేరుతో చేపట్టిన టూరిజం డెవలప్ మెంట్ మంచి పరిణామం. ఇక ఆదివాసీలకు మంచి రోజులు వచ్చినట్లే. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. మా గిరి పల్లెలకు టూరిస్టులు వస్తే చక్కగా ఆహ్వానిస్తాం. రేలా నృత్యాలతో స్వాగతిస్తాం. మా సంప్రదాయాలను వారికి పరిచయం చేస్తాం.
– గుండు శరత్, ఆదివాసీ యువకుడు–
అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యం
జిల్లాలోని అడవి గూడేలు, ప్రకృతి, సంస్కృతి, సంప్రదాయలను అంతర్జాతీయంగా పరిచయం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇది పట్టాలెక్కితే మంచి రెస్పాన్స్ వస్తుంది. రాబోయే రోజుల్లో ఇంకా డెవలప్ అవుతుంది. అందుకు యాక్షన్‌ప్లాన్ రూపొందిస్తున్నాం. జిల్లాలో అనేక రకాల సహజ వనరులు ఉన్నాయి.
– జితేశ్ వి పాటిల్, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్-–