- బీజేపీ, బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే రాజ్యాంగాన్నే మార్చేస్తరు
- రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
ఉప్పునుంతల, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని పలు గ్రామాల్లో గురువారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీజేపీ, బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే రాజ్యాంగానే మారుస్తారన్నారు. ఆ పార్టీలు పదేళ్లు అధికారంలో ఉండి ప్రజలకు చేసిందేమీ లేదన్నారు.
రాహుల్‌గాంధీని ప్రధాని చేయడానికి కాంగ్రెస్ క్యాండిడేట్లను గెలిపించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు, ఏఐసీసీ ప్రకటిం చిన ఐదు హామీలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. నాగర్‌కర్నూల్‌లో మల్లు రవి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని చెప్పారు. కార్య క్రమంలో డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, కాంగ్రెస్ నాయకులు మోపతయ్య, మండల అధ్యక్షుడు కట్ట అనంతరెడ్డి, నాయకులు నరసింహారావు, నరసింహారెడ్డి పాల్గొన్నారు.
గిరిజన సమ్మేళనానికి హాజరైన మంత్రి
వనపర్తి : వనపర్తిలో గురువారం నిర్వహించిన గిరిజన ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ హయాం నుంచే గిరిజనులకు ఎన్నో పథకాలు అందాయన్నారు. రైతులకు రుణమాఫీ కావాలన్నా, పేదలకు ఇందిరమ్మ ఇల్లు అందాలన్నా, పథకాలు కొనసాగాలన్నా కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు.
కార్యక్రమంలో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, మాజీ ఎంపీపీ శంకర్‌నాయక్, మున్సిపల్ చైర్మన్ పుట్టపాకల మహేశ్, వైస్ చైర్మన్ పి.కృష్ణ, పెద్దమందడి ఎంపీపీ రఘు ప్రసాద్, నాయకులు శంకరప్రసాద్, కౌన్సిలర్లు భాషా నాయక్, బ్రహ్మం పాల్గొన్నారు.