- వచ్చే మూడు నెలల్లో
- హాలీడే ట్రిప్స్ కు టికెట్స్ బుకింగ్
- సెకండ్ వేవ్ ముందు కంటే పెరిగిన టూర్ ప్లానింగ్స్
- ‘లోకల్ సర్కిల్స్ సర్వే’లో వెల్లడి
హైదరాబాద్, వెలుగు: కరోనా కారణంగా రెండు మూడేండ్లు ఇండ్లకే పరిమితమైన జనం ఇగ ఆగేది లేదంటున్నరు. వచ్చే మూడు నాలుగు నెలల్లో ఒక్క టూరైనా వేయాలని డిసైడైపోయారు. దేశ వ్యాప్తంగా ‘లోకల్ సర్కిల్స్’ సంస్థ చేపట్టిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. బంధువులు, స్నేహితుల ఇండ్లకు వెళ్లక చాలా రోజులైందని, మూడు నెలల్లోగా వెళ్తామని, టూర్లు, తీర్థ యాత్రలకు కూడా ప్లాన్ చేశామని 58 శాతం మంది చెప్పినట్టు వీరి సర్వేలో తేలింది. అయితే వీరిలో 18 శాతం మంది టికెట్స్ కూడా బుక్ చేసుకున్నారని సంస్థ పేర్కొంది. ఎక్కడికి వెళ్లాలో కచ్చితమైన ప్లానింగ్, డేట్‌ఫిక్స్ చేసుకోకపోయినా మార్చి వరకు ఏదైనా ఒక ప్రయాణమైతే చేయాలనుకుంటున్నట్టు 32 శాతం మంది చెప్పినట్లు వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నా జనం పెద్దగా పట్టించుకోవడం లేదని ఈ సర్వే రిపోర్ట్‌తో తెలుస్తోంది.
లోకల్ సర్కిల్స్ సంస్థ దేశంలోని 320 జిల్లాల్లో 19,500 మందిని సర్వే చేసింది. వీరిలో 66 శాతం మంది మగవాళ్లు, 34 శాతం మంది ఆడవాళ్లు ఉన్నారు. వీరిలో 45 శాతం మంది మెట్రోపాలిటెన్ సిటీలు, 28 శాతం మంది ద్వితీయ శ్రేణి నగరాలు, 27 శాతం మంది గ్రామీణ ప్రాంతాల వారు ఉన్నారు. డెల్టా వేరియంట్ కారణంగా చాలా మంది ఏప్రిల్ నుంచి జూన్ మధ్య టూర్లు, ప్రయాణాలు క్యాన్సిల్ చేసుకున్నారని, వారిలో 28 శాతం మంది టూర్లను ఆగస్టు, సెప్టెంబర్‌లో కంప్లీట్ చేశారని లోకల్ సర్కిల్స్ వెల్లడించింది. ఇక అక్టోబర్, నవంబర్‌లో విమాన ప్రయాణాలు అధికంగా చేశారని తెలిపింది.
జనవరి నెల మొత్తం బుకింగ్స్
జనవరిలో గోవా, కేరళ, కొడైకెనాల్, పాపికొండలు, అరకు వంటి టూరిస్టు స్పాట్స్ కు వెళ్లేందుకు చాలా మంది టికెట్స్ బుక్ చేసుకున్నారు. గోవాలో ఇప్పటికే హోటళ్లన్నీ హౌస్ ఫుల్ అయ్యాయి. డిసెంబర్ 31 రోజు కోసం రూ.10 వేలు పెట్టినా రూమ్ దొరికే పరిస్థితి లేదు. సంక్రాంతి హాలీడేస్ లో నాలుగైదు రోజులు ఫ్యామిలీతో టూర్ వెళ్లేందుకు చాలా మంది టికెట్స్ బుక్ చేసుకున్నారు. కరోనా భయం పెద్దగా లేదు.
- సుధీర్ గౌడ్, స్టార్ వరల్డ్ ట్రిప్ నిర్వాహకుడు.