పాండవలొంకకు పర్యాటకుల తాకిడి

పాండవలొంకకు పర్యాటకుల తాకిడి

పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్​ మండలం జాఫర్​ఖాన్​పేట, వెన్నంపల్లి గ్రామాల సరిహద్దులో రామగిరిగుట్టకు ఆనుకొని ఉన్న పాంవడలొంకకు పర్యాటకుల తాకిడి పెరిగింది. కనువిందు చేస్తున్న జలపాతాలను చూడటానికి ఉమ్మడి కరీంనగర్​ జిల్లా నుంచి టూరిస్టులు తరలిస్తున్నారు. వర్షాకాలంలో ఈ లొంకలో జలపాతాలు ఆకర్షణగా నిలుస్తున్నాయి. శ్రావణ మాసంలో సమీప గ్రామాల ప్రజలు ఇక్కడ లక్ష్మీదేవికి  పూజలు చేస్తారు. లక్ష్మీదేవి పాండవలొంకలో పుట్టిందని ఇక్కడ ప్రజలు నమ్ముతుంటారు. 

పాండవులు వనవాసం టైంలో ఇక్కడ కొంతకాలం గడిపారని, భీముడు తన గదను కింద పెట్టడంతో ఆ రూపంలో కయ్య ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు. ఆ కయ్యలోనే పర్యాటకులు స్నానాలు చేస్తుంటారు. సమీప అడవుల్లోంచి ప్రవహించి లొంకలోకి పైనుంచి కిందికి పడుతున్న నీటిలో ఔషధ గుణాలు ఉంటాయని భావిస్తారు. టూరిస్టులు ఆ నీటిని తాగడంతోపాటు ఇండ్లకు కూడా తీసుకెళ్తుంటారు. 

ఇక్కడకు చేరుకోవాలంటే పెద్దపల్లి నుంచి కాల్వశ్రీరాంపూర్​ వెళ్లే మార్గంలో వెన్నంపల్లి నుంచి, లేదా జాఫర్​ఖాన్​పేట నుంచి రెండు మార్గాలు ఉన్నాయి. లొంక వరకు చేరుకోవడానికి దాదాపు రెండు కిలోమీటర్లు మట్టి, రాళ్లతో ఉన్న దారిలో కాలినడకన గుట్టను ఎక్కి లొంకలోకి దిగాల్సి ఉంటుంది. రోడ్డు మార్గం లేకపోవడంతో టూరిస్టులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  -పెద్దపల్లి, వెలుగు