
పహల్గాం: టెర్రరిస్టుల క్రూర దాడితో ఈ నెల 22న ఉలిక్కిపడిన పహల్గాం మెల్లిగా ఊపిరి పీల్చుకుంటోంది. నాలుగు రోజుల పాటు పర్యాటకులు పెద్దగా కనిపించలేదు. ఆదివారం మాత్రం దేశం నలుమూలల నుంచి టూరిస్టులు పహల్గాంను సందర్శించారు. ఇందులో విదేశీ పర్యాటకులూ ఉన్నారు. సాధారణ రోజుల్లో రోజుకు 5 వేల నుంచి 7 వేల మంది సందర్శకులు వచ్చేటోళ్లు.. ప్రస్తుతం రెండు మూడు వందల మంది మాత్రమే సందర్శించారు.
ప్రభుత్వం ఎక్కడికక్కడ భద్రతను భారీగా పెంచడంతో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. దాడి జరిగిన బైసరన్ ప్రాంతాన్ని మాత్రం ఇంకా తెరవలేదు. ఈ సందర్భంగా పలువురు పర్యాటకులు మాట్లాడుతూ టెర్రర్ దాడులకు భయపడబోమని తెలిపారు. ట్రావెల్ ఏజెంట్లతో పాటు స్థానికులు కూడా తమకు అండగా ఉన్నారని, దీంతో ధైర్యంగా పర్యటిస్తున్నామని చెప్పారు.