13 గంటల టెన్షన్​కు తెర.. తిరిగొచ్చిన పర్యాటకులు

  • 13 గంటల టెన్షన్​కు తెర.. తిరిగొచ్చిన పర్యాటకులు
  • ముత్యంధార జలపాతం దగ్గరకు  వెళ్లిన 150 మంది టూరిస్టులు సేఫ్​
  • గెగ్గెన వాగు ఉధృతితో అడవిలోనే చిక్కుకుపోయిన్రు
  • పోలీసులు వెళ్లేసరికి మరో మార్గంలో వీరభద్రవరానికి..  
  • దట్టమైన అడవిలో10 గంటల ప్రయాణం 

వెంకటాపురం, వెలుగు:   ములుగు జిల్లా వెంకటాపురం మండలం వీరభద్రవరం అడవిలోని ముత్యంధార వాటర్​ఫాల్స్​కు వెళ్లి వస్తూ.. గెగ్గేల వాగు ఉధృతితో అడవిలో చిక్కుకు పోయిన పర్యాటకులు గురువారం క్షేమంగా తిరిగివచ్చారు. బుధవారం సెలవు కావడంతో హైదరాబాద్, వరంగల్, హుజూరాబాద్ ప్రాంతాలకు చెందిన 150 మంది 8 ప్రైవేట్​వెహికల్స్​, టూ వీలర్స్ పై వెంకటాపురం, వాజేడు మండలాల్లోని వాటర్​ఫాల్స్​ చూడడానికి వచ్చారు. ఇందులో ఆడవాళ్లు, వృద్ధులు, పిల్లలు లేరు. బొగత జలపాతం ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఆఫీసర్లు అనుమతించలేదు. దీంతో వెంకటాపురం మండలంలోని ముత్యంధార వాటర్​ఫాల్స్​ చూద్దామని బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఇద్దరు గ్రామస్తులను తీసుకొని అడవి నుంచి జలపాతం దగ్గరకు చేరుకున్నారు. 

కొంత సమయం అక్కడ గడిపి వీరభద్రవరం బయలుదేరారు. భారీ వర్షం కురుస్తున్నా నడుచుకుంటూనే బయలుదేరారు. మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఊరు ఉందనగా, గెగ్గెల వాగు ఉధృతంగా ప్రవహించడంతో దాటలేక అడవిలోనే ఉండిపోయారు. రాత్రి 7 గంటలు కావడంతో సిగ్నల్స్ ​లేక  పోలీసులకు, బంధువులకు ఫోన్​ చేయలేకపోయారు. అలాగే ప్రయత్నిస్తూ ఉండగా చివరకు ఒకరి ఫోన్​ డయల్​100కు కలిసింది. దీంతో తమ పరిస్థితి చెప్పగా ఎస్పీ గాస్ ఆలం స్పందించి తాము వస్తున్నామని, ఎన్డీఆర్ఎఫ్, డిస్ట్రిక్ట్ ​డిజార్డ్ రెస్పాన్స్ ఫోర్స్ టీమ్స్​ను పంపిస్తామని, భయపడవద్దని భరోసా ఇచ్చారు. ఫోన్​ చేసిన వారి లొకేషన్​ట్రేస్​చేసి మైదాన ప్రాంతంలోనే ఉండాలని సూచించారు.  

ALSO READ :ఇయ్యాల ఓయూ పరిధిలో ఎగ్జామ్స్ వాయిదా

రెండు బస్సుల్లో బయలుదేరిన సిబ్బంది 

ఎస్పీ ఆదేశాలతో తహసీల్దార్​ నాగరాజు, సీఐ బండారి కుమార్, ఎంపీడీవో బాబు, ఎస్సై తిరుపతి, 50 మంది ఎన్డీఆర్​ఎఫ్​, డిస్ట్రిక్ట్​ డిజార్డ్​ రెస్పాన్స్​ఫోర్స్​ రాత్రి పది గంటలకు వీరభద్రవరం గ్రామానికి చేరుకున్నారు. కొద్దిసేపటికే ఎస్పీ గాస్ ఆలం, ఏటూరునాగారం ఏఎస్పీ సిరిశెట్టి సంకీర్త కూడా చేరుకున్నారు. ఎస్పీ, ఏఎస్పీ గ్రామంలోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షించగా ఇతర అధికారులు, ఎన్డీఆర్​ఎఫ్​, డిస్ట్రిక్ట్​డిజార్డ్​ రెస్పాన్స్​ ఫోర్స్  వాగు దగ్గరకు వెళ్లారు. ఉధృతంగా ప్రవహిస్తుండడంతో నలుగురు ఎన్డీఆర్​ఎఫ్ ​సిబ్బంది తాడు కట్టి వాగు అవతలి వైపునకు వెళ్లారు. ముందుగా చెప్పిన లొకేషన్​లో వారు లేకపోవడంతో కొద్దిసేపటి వరకు చుట్టు పక్కల వెతికి తిరిగి వాగు ఇవతలి వైపుకు వచ్చేశారు. 

అర్ధరాత్రి అడవిలో..  5 కిలోమీటర్లు 10 గంటలు నడక

తమను రక్షించుమని పోలీసులకు ఫోన్​ చేసిన కాసేపటికే పర్యాటకులు ఏం చేద్దామా అని ఆలోచించారు. రాత్రంతా వాగు దగ్గరే ఉంటే ఏదైనా జరగవచ్చని మరో దారి కోసం ప్రయత్నించారు.  గ్రామానికి చెందిన రాము, సోలం సతీశ్ ​కూడా వీరి వెంటే ఉండడంతో వారిని సలహా అడిగారు. ఇప్పగూడెం, తోగు మీదుగా గ్రామానికి రూట్​ ఉందని చెప్పారు. అయితే, దట్టమైన అడవి కావడం, జంతువులు దాడి చేసే అవకాశం ఉండడం, పాములు, ఇతర విష పురుగులతో ప్రమాదం పొంచి ఉండడంతో భయపడ్డారు. చీకట్లో వాగులు ఉంటే గల్లంతవుతామని ముందు ఒప్పుకోలేదు. 

చివరకు అందరూ కలిసి వెళ్లడానికే నిర్ణయించుకున్నారు. రాత్రి 8 గంటలకు సుమారు 5 కిలోమీటర్ల దూరంలోని వీరభద్రవరానికి బయలుదేరారు. ఫోన్ ​లైట్లు ఆన్ ​చేసుకుని మెల్లి మెల్లిగా 10 గంటల పాటు నడుస్తూ గురువారం తెల్లవారుజామున 4 గంటలకు గ్రామానికి చేరుకున్నారు. అర్ధరాత్రి వేళ సిగ్నల్​ రావడంతో తాము వస్తున్నామని పోలీసులకు సమాచారమిచ్చారు. దాంతో అధికారులు, పోలీసులు గ్రామంలో సిద్ధంగా ఉన్నారు. పర్యాటకులు వచ్చాక నీళ్లు, ఫుడ్ ​పెట్టారు. అందరూ క్షేమంగా తిరిగి రావడంతో ఊపిరి పీల్చుకున్నారు.