IND vs BAN: 5 వికెట్లతో చెలరేగిన షమీ.. హృదయ్ సెంచరీతో బంగ్లాదేశ్ డీసెంట్ టోటల్

IND vs BAN: 5 వికెట్లతో చెలరేగిన షమీ.. హృదయ్ సెంచరీతో బంగ్లాదేశ్ డీసెంట్ టోటల్

దుబాయ్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను టీమిండియా బౌలర్లు కట్టడి చేశారు. ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ 5 వికెట్లతో చెలరేగడంతో బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌట్ అయింది. తోహిద్ హృదయ్ సెంచరీతో(100: 118 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. జేకర్ అలీ (68) హాఫ్ సెంచరీ చేసి రాణించాడు. భారత బౌలర్లలో మహమ్మద్ షమీకి 5 వికెట్లు దక్కాయి. హర్షిత్ రాణా మూడు వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్ కు రెండు వికెట్లు తీశాడు.   

35 పరుగులకే 5 వికెట్లు:
 
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ పవర్ ప్లే ముగిసేలోపే ఐదు కీలక వికెట్లు కోల్పోయింది. షమీ వేసిన తొలి ఓవ‌ర్‌లో సౌమ్యా స‌ర్కార్(0) అవుట్ కాగా, రాణా వేసిన రెండో ఓవ‌ర్‌లో న‌జ్మల్ శాంటో(0) ఔట్ అయ్యాడు. దాంతో, బంగ్లా కేవ‌లం రెండు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఏడో ఓవర్ రెండో బంతికి గిల్‌కు క్యాచ్‌ ఇచ్చి మెహిదీ హసన్‌ (5) ఔటయ్యాడు. 26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన బంగ్లాను అక్షర్ పటేల్ మరింత కష్టాల్లోకి నెట్టాడు. 9వ ఓవర్‌లో వరుస బంతుల్లో తంజిద్‌ హసన్(25), ముష్ఫికర్‌(0)ను ఔట్ చేశాడు.

Also Read :- షకీబ్ ఎక్కడ..? బంగ్లా జట్టులో వెటరన్ ప్లేయర్ ఎందుకు లేరు..?

జేకర్ అలీ, హృదయ్ 154 పరుగుల భాగస్వామ్యం:
  
ఈ దశలో జట్టును ఆదుకునే బాధ్యతను జేకర్ అలీ, హృదయ్ తీసుకున్నారు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ బంగ్లా స్కోర్ కార్డును ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఇద్దరూ ఆరో వికెట్ కు 154 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో పాటు తమ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. పరుగుల వేగాన్ని పెంచే క్రమంలో 68 పరుగులు చేసి క్రీజ్ లో కుదురుకున్న జేకర్ అలీ భారీ షాట్ కు ప్రయత్నించి ఔటయ్యాడు. చివర్లో బంగ్లా వరుసబెట్టి వికెట్లు కోల్పోయినా ఒక ఎండ్ లో హృదయ్ చివరి వరకు క్రీజ్ లో ఉండి బంగ్లాదేశ్ కు డీసెంట్ టోటల్ అందించాడు. వన్డే కెరీర్ లో హృదయ్ కి ఇదే తొలి సెంచరీ.