Cricket World Cup 2023: బ్యాటింగ్‌లో అదరగొట్టిన బంగ్లా జట్టు..ఆస్ట్రేలియా ముందు బిగ్ టార్గెట్

Cricket World Cup 2023: బ్యాటింగ్‌లో అదరగొట్టిన బంగ్లా జట్టు..ఆస్ట్రేలియా ముందు బిగ్ టార్గెట్

వరల్డ్ కప్ లో దారుణ ప్రదర్శన చేస్తున్న బంగ్లాదేశ్ ఎట్టలకే చివర్లో గాడిలో పడినట్లుగానే కనిపిస్తుంది. ఈ మెగా టోర్నీని విజయంతో ప్రారంభించిన బంగ్లా.. ఆ తర్వాత వరుసగా ఆరు పరాజయాలను చవి చూసింది. దీంతో వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించిన షకీబ్ సేన శ్రీలంకపై  విజయంతో తమ పరాజయాలకు బ్రేక్ వేసింది. తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తమ చివరి మ్యాచ్ లో సత్తా చాటి భారీ స్కోర్ చేసింది. 

మహారాష్ట్రలోని పూణే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఆసీస్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ కు దిగిన బంగ్లా ఆసీస్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ హృదయ్ 79 బంతుల్లో 74 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఓపెనర్లు టాంజిద్ హసన్ 36, లిటన్ దాస్ 36 పరుగులు చేసి జట్టుకు మంచి ఆరంభాన్ని ఇస్తే.. కెప్టెన్ శాంటో 45 పరుగులు చేసి రాణించాడు. సీనియర్ బ్యాటర్లు మహమ్మదుల్లా 32, ముషఫికర్ రహీం 23 పరుగులు చేసి పర్వాలేదనిపించారు.

చివర్లో మెహదీ హసన్ మిరాజ్ 20 బంతుల్లోనే 29 పరుగులు చేసి బంగ్లా స్కోర్ ను 300 దాటించాడు. ఆసీస్ బౌలర్లలో జంపా, అబాట్ రెండు వికెట్లు తీసుకోగా.. స్టోయినీస్ కు ఒక వికెట్ దక్కింది. రనౌట్ రూపంలో బంగ్లా మూడు వికెట్లను కోల్పోయింది. ఈ మ్యాచ్ లో బంగ్లా గెలిస్తే  ఛాంపియన్స్ ట్రోఫీకి దాదాపుగా తమ బెర్త్ ను కన్ఫర్మ్ చేసుకుంటుంది.