- లంచాలిస్తే గుడ్డిగా పర్మిషన్లు
- నగరాలు, పట్టణాల్లో ముంపునకు అసలు కారణమిదే
- తీరా ఇప్పుడేం చేయలేమని చేతులెత్తేస్తున్న ఆఫీసర్లు
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: చిన్నపాటి వానకే హైదరాబాద్, వరంగల్‌లాంటి సిటీల్లో కాలనీలు నీటమునగడం చూశాం.. కానీ నాలుగైదేండ్లుగా చిన్న చిన్న మున్సిపాలిటీలు సైతం కొద్దిపాటి వానకే ముంపు బారిన పడ్తున్నాయి. చెరువులు, వాటి శిఖాల్లో లీడర్లు, రియల్టర్లు వేసిన వెంచర్లలో వెలుస్తున్న కాలనీలు సహజంగానే మునిగిపోతుంటే, ప్లానింగ్ లేకుండా నిర్మిస్తున్న రోడ్లు, నాలాలు, వాటి ఆక్రమణల వల్ల వర్షపు నీరు వెళ్లే మార్గాలు మూసుకపోయి ఇండ్లలోకి నీళ్లు చేరుతున్నాయి. టౌన్ ప్లానింగ్ విభాగాల్లో అడిగినంత చేతిలో పెడ్తే చాలు, వెంచర్లకు, ఇండ్లకు గుడ్డిగా పర్మిషన్ ఇస్తున్న కొందరు లంచగొండి ఆఫసీర్ల తీరువల్లే పట్టణాలకు ఈ పరిస్థితి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లదే కీలకపాత్ర
రాష్ట్రంలో 129 మున్సిపాలిటీలు 13 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 3.5 కోట్ల జనాభా ఉంటే దాదాపు 40 శాతం ప్రజలు నగరాలు, పట్టణాల్లోనే నివసిస్తున్నారు. హైదరాబాద్ విశ్వనగరంతో పాటు వరంగల్, ఖమ్మం, కరీంనగర్ వంటి కార్పొరేషన్లు, మున్సిపాలిటీల వైశాల్యం ఏటేటా పెరుగుతూ పోతోంది. జన సాంద్రత కూడా ఎక్కువవుతున్నది. దీంతో నగరాలు, పట్టణాలలో రియల్ ఎస్టేట్ బూమ్ విపరీతంగా పెరిగింది. ఇండ్ల నిర్మాణాలు పెద్ద సంఖ్యలో జరుగుతున్నాయి. అయితే ఇండ్ల నిర్మాణాల పర్మిషన్ల ఇచ్చే విషయంలో ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఉండే టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్దే ముఖ్యమైన పాత్ర. రియల్ ఎస్టేట్ వాళ్లు వేసే వెంచర్లు పరిశీలించడం వాటికి అనుమతులివ్వడం.. వెంచర్లు వేసిన ల్యాండ్ వ్యవసాయ పట్టా భూమా..? సర్కారు ల్యాండా? లేక ప్రైవేట్ జాగానా అనేది వీళ్లే పరిశీలిస్తారు. రోడ్లు, నాలాల కోసం ఎంత ల్యాండ్ విడిచి పెట్టారో ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడి సాయిల్‌ను పట్టి ఎన్ని అంతస్తుల వరకు ఇండ్లు కట్టుకోవాలో అనుమతి ఇచ్చేది వీళ్లే. ఆ తర్వాత ఎక్కడ ఏ ఇల్లు నిర్మించాలన్నా ఈ విభాగానికి చెందిన ఇంజినీర్ల పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. టౌన్ ప్లానింగ్ పర్మిషన్ లేకుండా ఇల్లు కడితే ఆఫీసర్లు వాటిని కూల్చేస్తారు. నగర, పట్టణ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని టౌన్ ప్లానింగ్ ఇంజినీర్లు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విభాగంలోని ఇంజినీర్లు తప్పు చేస్తే టౌన్‌లో నివసించే ప్రజలంతా ఇబ్బందులు పడ్తారు.
చెరువుల్లోనూ వెంచర్లు..
నగరాలు, పట్టణాలలో పనిచేసే కొందరు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు రియల్ ఎస్టేట్ సంస్థలకు తలొగ్గుతున్నారు. చెరువుల్లో వెంచర్లు వేసినా లంచాలిస్తే ఎడాపెడా పర్మిషన్లు ఇస్తున్నారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం గ్రేటర్ వరంగల్ పరిధిలో 290 చెరువులు, 120 కుంటలు ఉండేవి. వీటిలో ఇప్పుడు 50 శాతానికి పైగా భూములు కబ్జా చేశారు. రంగశాయిపేటలోని బెస్తం చెరువు 105 ఎకరాలుంటే ఇప్పుడు కేవలం 50 ఎకరాలకే పరిమితమైంది. దీంతో వానలు పడ్తే చాలు ఈ ఏరియాలోని పలు కాలనీలు నీట మునుగుతున్నాయి. గ్రేటర్ వరంగల్ మాత్రమే కాదు రాష్ట్రంలోని ఇతర కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో పరిస్థితి ఇలాగే ఉంది. చెరువుల్లో కడుతున్న ఇండ్ల నిర్మాణాలకు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు పర్మిషన్లు ఇవ్వడంతోనే వరదల సమస్య జనాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఎక్సపర్ట్స్ చెబుతున్నారు.
సుప్రీం కోర్టు గైడ్‌లైన్స్‌ను పట్టించుకుంటలేరు
చెరువుల ఫ్లడ్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్) పరిధిలో ఉన్న భూముల్లో ఇండ్లు కానీ ఆఫీసులు కానీ ఎలాంటి బిల్డింగ్ నిర్మాణాలకు పర్మిషన్ ఇవ్వకూడదని సాక్షాత్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినా రాష్ట్రంలోని కొందరు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు పాటించట్లేదు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని తూములకుంట చెరువు కింద 1,200 ఎకరాల ఆయకట్టు ఉండేది. జవహర్ నగర్‌లోని నేషనల్ హైవే రోడ్డు వరకు ఈ చెరువు శిఖం ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఈ చెరువును ఆనుకొని 100 బెడ్ల హాస్పిటల్ నిర్మించింది. కొత్తగా భూపాలపల్లి కలెక్టరేట్ బిల్డింగ్ కడుతోంది. దీంతో రియల్ఎస్టేట్ సంస్థల యజమానులు ఈ చెరువుకు వచ్చే నాలాను ఆక్రమించి వెంచర్లు వేశారు. వరద కాల్వను పక్కకు జరిపారు. దీంతో మొన్నటి వానలకు భూపాలపల్లి పట్టణంలోని పలు కాలనీలు నీటమునిగాయి. వరద కాల్వ పొంగి రోడ్డుపై నుంచి ప్రవహించడంతో వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. దీంతో పాటు రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాల్లో ఇదే మాదిరిగా చెరువు శిఖాల్లో సర్కారు బిల్డింగ్‌లు కట్టడం వల్ల వరదలు వచ్చి కాలనీలు నీట మునిగి జనాలు ఇబ్బందులు పడ్డారు.
ప్లానింగ్ లేకనే..
భూపాలపల్లి టౌన్ డెవలప్మెంట్ ఆఫీసర్ల పనితీరు, ప్లానింగ్ సరిగా లేవు. మొన్న కురిసిన వానలకు పట్టణంలోని పలు కాలనీలు నీట మునిగినయ్. ముఖ్యంగా కొందరు ఆఫీసర్ల అసమర్థ ప్లానింగ్ వల్ల నిర్మించిన కొత్త కలెక్టరేట్ బిల్డింగ్, 100బెడ్ల హాస్పిటల్ చుట్టూ పూర్తిగా వరద నీరు చేరుకొని కనీసం అటు వెళ్లే పరిస్థితి కూడా లేదు.
‒ నాగపురి సమ్మయ్య, భూపాలపల్లి
ఇంజినీర్ల తప్పిదాల వల్లే..
భూపాలపల్లిలోని కేటీకే ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు కరకట్టకు ఇవతల పక్క సింగరేణి మేనేజ్మెంట్ అజాగ్రత్తతో సైడ్ డ్రైన్ తక్కువ ఎత్తులో నిర్మించింది. దీంతో వానలకు రామ్ నగర్, ఎండీ క్వార్టర్స్ కాలనీలు పూర్తిగా వరద నీటితో మునిగిపోయాయి. కొందరు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ల తప్పిదమే ఇది. ఇప్పటికైనా ప్రభుత్వం, సింగరేణి మేనేజ్మెంట్ డ్రైనేజీ హైట్ పెంచి మళ్లీ కట్టాలి.
‒ దాట్ల శ్రీనివాస్,
16వ వార్డ్ కౌన్సిలర్, భూపాలపల్లి