- కంప్యూటర్ ఆపరేటర్ కేంద్రంగా అక్రమ దందా
- కోర్టు కేసులున్న భూముల్లోనూ నిర్మాణాలకు పర్మిషన్లు
- ఉన్నతాధికారులు మారినప్పుడు కూల్చివేతలతో హడావుడి
- నాలుగు రోజుల తర్వాత అంతా షరా ‘మామూళ్లే’
మాదాపూర్, వెలుగు: జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి జోన్ చందానగర్సర్కిల్ పరిధిలోని టౌన్‌ప్లానింగ్ ఆఫీసర్లు విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారు. అడిగినంత మామూళ్లు అందుతుండడంతో రెచ్చిపోతున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్, జోనల్‌కమిషనర్, సర్కిల్డీసీ, ఏసీపీ మారినప్పుడు ఒకటి రెండు అక్రమ నిర్మాణాలను కూల్చి, ఆ తర్వాత తిరిగి అక్రమ దందాను షురూ చేస్తున్నారు.
మంగళవారం మాదాపూర్అయ్యప్ప సొసైటీలోని కొన్ని అక్రమ నిర్మాణాలను చందానగర్టౌన్ ప్లానింగ్ఆఫీసర్లు కూల్చారు. అయితే అవన్నీ సింగిల్ఫ్లోర్, పిల్లర్ల దశలో ఉన్న నిర్మాణాలే. అయ్యప్ప సొసైటీ, సర్వే ఆఫ్ ఇండియా, చంద్రనాయక్ తండా ఏరియాల్లో ఐదారు ఫ్లోర్లతో వందల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అధికారులు వాటి జోలికి వెళ్లడం లేదు. దీంతో కొందరు నిర్మాణదారులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఎలాంటి పర్మిషన్లు లేకుండా నిర్మిస్తున్న భారీ బిల్డింగులను ఎందుకు వదిలేస్తున్నారని నిలదీశారు.
చందానగర్సర్కిల్టౌన్ప్లానింగ్ఏసీపీపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. చెరువు ఎఫ్ టీఎల్, బఫర్జోన్లలో ఇండ్ల నిర్మాణాలకు పర్మిషన్లు ఇచ్చుకుంటూ పోతున్నాడని సమాచారం. శేరిలింగంపల్లి జోనల్టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు ఆయన దారిలోనే నడుస్తున్నట్లు తెలుస్తోంది. చెరువులు, పార్కు స్థలాల్లో, నాలాలపై నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేస్తున్నారు. బిల్డింగ్ పర్మిషన్ కు కొంత, ఫ్లోర్‌కు కొంత కలిపి రూ.లక్షలు దండుకుంటున్నట్లు బహిరంగంగా చెప్పుకుంటున్నారు. ఇంత ఓపెన్‌గా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నా చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశమైంది.
వివాదాస్పద భూముల్లోనూ..
చందానగర్సర్కిల్పరిధిలోని సర్వే నంబర్11/8 నుంచి 11/32 వరకు మాదాపూర్ అయ్యప్ప సొసైటీ, సర్వే ఆఫ్ ఇండియా, చంద్రానాయక్తండాలలో గురుకుల్ ట్రస్ట్ భూములు ఉన్నాయి. హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో వీటికి సంబంధించిన కేసులు నడుస్తున్నాయి. ఇక్కడ ఇండ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడానికి వీలు లేదు. అయితే కొందరు చందానగర్సర్కిల్, శేరిలింగంపల్లి జోనల్ టౌన్ ప్లానింగ్ అధికారులను మ్యానేజ్ చేసి భవన నిర్మాణాలు చేపడుతున్నారు.చందానగర్ టౌన్ ప్లానింగ్ అధికారులు, శేరిలింగపల్లి జోనల్ టౌన్ప్లానింగ్ఆఫీసర్లకు భారీ మొత్తంలో డబ్బు ముట్టజెప్పి, నిర్మాణాలు చేపడుతున్నారు. ఆఫీసర్లు అనుకూలంగా ఉండడంతో నిర్మాణదారులు రెచ్చిపోతున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదారు అంతస్థుల్లో బిల్డింగ్స్నిర్మిస్తున్నారు. వాటిని ప్రైవేట్కాలేజీలకు, హాస్టళ్లకు రెంటుకు ఇస్తున్నారు.
అక్రమ దందాలో కీ రోల్ ఆయనదే..
మాదాపూర్ అయ్యప్ప సొసైటీ, సర్వే ఆఫ్ ఇండియా, చంద్రానాయక్తండా, అగర్వాల్లేఅవుట్లలోని అక్రమ నిర్మాణాల వెనుక చందానగర్ సర్కిల్టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్న కంప్యూటర్ఆపరేటర్(ఔట్సోర్సింగ్) కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇతను 1999, మే నెలలో శేరిలింగపల్లి మున్సిపాలిటీలోని టౌన్ప్లానింగ్విభాగంలో కంప్యూటర్ఆపరేటర్గా చేరాడు.
జీహెచ్ఎంసీ శేరిలింగపల్లి, చందానగర్సర్కిళ్లు ఏర్పడిన తర్వాత చందానగర్సర్కిల్కు వచ్చాడు. ఈ సర్కిల్వచ్చే డిప్యూటీ కమిషనర్, టౌన్‌ప్లానింగ్ ఏసీపీలకు అనుకూలంగా ఉంటూ అక్రమ నిర్మాణాలకు సపోర్ట్ చేసేలా మేనేజ్చేస్తున్నాడు. ఒక్కో బిల్డింగ్‌కు ఒక్కో రేటు ఫిక్స్చేసి వసూలు చేస్తున్నాడు. అలాగే ఒక్కో ఫ్లోర్ కు రూ.3లక్షల నుంచి రూ.4 లక్షల వరకు దండుకుంటున్నాడు. వాటిని టీపీఎస్, ఏసీపీ, డీసీ స్థాయి నుంచి జోనల్సిటీ ప్లానర్ వరకు అందజేస్తున్నాడు. అతని ద్వారా ఉన్నతాధికారుల అండదండలు ఉండడంతో బిల్డర్లకు అడ్డూ అదుపు లేకుండా పోయింది.
అతనికి ట్రాన్స్ఫర్ ఉండదు...
చందానగర్సర్కిల్కంప్యూటర్ఆపరేటర్కు పొలిటికల్ లీడర్ల సపోర్టు బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఏనాడూ కంప్యూటర్ముందు కూర్చున్న దాఖలాలు లేవని బల్దియా సిబ్బందే చెబుతున్నారు. సర్కిల్‌పరిధిలో ఎక్కడెక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయో గుర్తించి, అక్రమ వసూళ్లకు పాల్పడడమే ఆయన పని అంటున్నారు. ఇటీవల ఓ జోనల్ కమిషనర్ఈ కంప్యూటర్ఆపరేటర్ను వేరే సర్కిల్‌కు ట్రాన్స్ ఫర్చేసినప్పటికీ, తన పలుకుబడి ఉపయోగించుకొని గంటల వ్యవధిలో తిరిగి చందానగర్సర్కిల్ కు వచ్చేశాడు. ఇతని తండ్రి రిటైర్డ్ఏఎస్ఐ కావడంతో అటు పోలీసుల, ఇటు మున్సిపల్ ఆఫీసర్ల సపోర్టు పుష్కలంగా ఉందని తెలుస్తోంది.
స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేస్తున్నాం
ప్రస్తుతం పిల్లర్లు, స్లాబ్ దశలోని అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తున్నాం. త్వరలో భారీ అక్రమ భవనాలను ఓకేసారి కూలుస్తాం. అందుకోసం ఉన్నతాధికారుల పర్యవేక్షణలో స్పెషల్టీమ్స్రెడీ చేస్తున్నాం.
ఉపేందర్‌రెడ్డి, జోనల్ కమిషనర్, శేరిలింగంపల్లి