బఫర్ జోన్ లోనూ.. పర్మిషన్లు ఇచ్చేశారు!​

బఫర్ జోన్ లోనూ.. పర్మిషన్లు ఇచ్చేశారు!​
  • అక్రమ నిర్మాణాలపై రూల్స్ పాటించని టౌన్​ప్లానింగ్ అధికారులు  
  • ఇరిగేషన్​శాఖ ఎలాంటి ఎన్​ఓసీ ఇవ్వకున్నా జారీ 
  • అక్రమ నిర్మాణదారులకు అండగా స్థానిక లీడర్లు
  • వివాదాలకు కేరాఫ్​గా బదిలీపై వెళ్లిన చందానగర్ సర్కిల్​ఏసీపీ, డీసీ

చందానగర్, వెలుగు: శేరిలింగంపల్లి జోన్ చందానగర్ ​సర్కిల్ టౌన్​ప్లానింగ్ అధికారుల అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. చెరువు స్థలాలు, బఫర్​జోన్, ఎఫ్​టీఎల్, వివాదాస్పద స్థలాల్లో ఎలాంటి రూల్స్​పాటించకుండా బిల్డింగ్​ల నిర్మాణాలకు ఇచ్చే పర్మిషన్లు ఇచ్చేశారు.  ఇరిగేషన్ శాఖ నో అబ్జెక్షన్​సర్టిఫికెట్​లేకుండానే జారీ చేసేశారు.  బిల్డర్లు, ఓనర్ల వద్ద రూ. లక్షల్లో అవినీతికి పాల్పడ్డారు. అక్రమ నిర్మాణాలపై స్థానికులెవరైనా ఫిర్యాదులు చేస్తే నోటీసులు ఇచ్చాం, చర్యలు తీసుకుంటాం.. అంటూ కాలయాపన చేశారే.. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.  

మదీనగూడ  సర్వే నంబర్ 26లో ఈర్ల చెరువు 32 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా.. ఇప్పటికే  కొంత కబ్జాకు గురైంది. దీని బఫర్​జోన్, ఎఫ్​టీఎల్​స్థలాల్లో నిర్మాణాలకు ఇష్టమొచ్చినట్టు పర్మిషన్లు ఇచ్చేశారు. వైశాలినగర్​లోని రోడ్​ నంబర్ 7లోని ప్లాట్​నెంబర్లు148,149,150లు బఫర్​జోన్​లో ఉండగా..  అందులోని నిర్మాణాలకు ఇరిగేషన్​శాఖ నో అబ్జెక్షన్​సర్టిఫికెట్​ఇవ్వలేదు. కానీ చందానగర్​టౌన్​ప్లానింగ్​అధికారులు మాత్రం అనుమతులు ఇచ్చేశారు.  

మొదటి నుంచి వివాదాస్పదమే..

చందానగర్​టౌన్​ప్లానింగ్​ఏసీపీగా పనిచేసి ట్రాన్స్​ఫర్​అయినా రాజ్​కుమార్  బిల్డింగ్ నిర్మాణ పర్మిషన్లలో ఎక్స్​పర్ట్​అని మున్సిపల్​ఆఫీస్​లో జోరుగా చర్చించుకుంటున్నారు. అతనికి చందానగర్​డీసీ కూడా వత్తాసు పలుకుతూ ఒకే చెప్పడం గమనార్హమని పలువురు పేర్కొంటున్నారు.  ఇటీవల  ట్రాన్స్​ఫర్​అయినా ఏసీపీ తీరు ఇక్కడ మొదటి నుంచి వివాదాలకు కేరాఫ్​గా నిలిచింది.

  ఆయనకు చందానగర్​డీసీ కూడా వత్తాసు పలికారు. ఇందుకు అక్రమ నిర్మాణదారుల నుంచి రూ. లక్షల్లో మామూళ్లు దండుకున్నారు. వీరికి హఫీజ్​పేట్​డివిజన్​​చైన్​మెన్ అండగా ఉన్నాడని​స్థానికులు ఆరోపిస్తున్నారు.  బఫర్​ జోన్​, ఎఫ్​టీఎల్​ స్థలాల్లోని నిర్మాణాల దారులకు  స్థానిక లీడర్లు కూడా అండగా నిలిచారు.  తామంతా చూసుకుంటామని భరోసా ఇచ్చారు.  ఇటీవల ఎమ్మెల్యేతో కలిసి కాంగ్రెస్​లో చేరిన ఓ కార్పొరేటర్​అక్రమ నిర్మాణదారులకు అండగా ఉన్నారని, అక్రమనిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా అడ్డుకుంటున్నారని అధికారులు బాహాటంగానే చెబుతున్నారు. 

హైడ్రా చర్యలు చేపట్టేనా.. 

 రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైదరాబాద్​డిజాస్టర్​ రెస్పాన్స్​ అండ్​అసెట్​ ప్రొటెక్షన్​ ఏజెన్సీ( హైడ్రా)  శేరిలింగంపల్లిలోని పలు చెరువులు, కుంటలు, వివాదాస్పద భూముల్లోని అక్రమ కట్టడాలపైనా చర్యలు చేపడుతుందా.. లేదంటే రాజకీయ నేతల ఒత్తిడికి తలొగ్గి వెనక్కి తగ్గుతుందా..! అని వేచి చూడాలి. చందానగర్​ సర్కిల్​ టౌన్​ప్లానింగ్​పర్మిషన్ల జారీపై శేరిలింగంపల్లి జోనల్​కమిషనర్​ఉపేందర్​రెడ్డిని వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. చందానగర్​డీసీ కొద్ది రోజులుగా లీవ్ లో ఉన్నాడు.  బదిలీపై వెళ్లిన ఏసీపీ, లీవ్ పై వెళ్లిన డీసీ స్థానాల్లో శేరిలింగంపల్లి డీసీ, ఏసీపీ ఇన్ చార్జ్ లుగా ఉన్నారు.  

లెటర్​ రాసినా స్పందన లేదు

మదీనాగూడ ఈర్ల చెరువును అనుకొని వైశాలినగర్​ప్లాట్​నంబర్ 148,149,150 లు బఫర్​జోన్​లోని నిర్మాణాలతో పాటు గంగారం చెరువు బఫర్​జోన్​లోని పలు నిర్మాణాలకు ఎలాంటి ఎన్​ఓసీలు జారీ చేయలేదు. బల్దియా అధికారులు మాత్రం ఇంటి నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు.  ఎన్​ఓసీ లేకుండా చేపట్టిన నిర్మాణాలను కూల్చివేయాలని ఇప్పటికే చందానగర్​సర్కిల్​డీసీకి లెటర్​రాశాం. జీహెచ్​ఎంసీ అధికారులను కూడా కోరాం. అయినా వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. 

పావని,  ఏఈఈ ఇరిగేషన్,​ శేరిలింగంపల్లి