- సూర్యాపేటలో ఇండ్ల నిర్మాణాల పేరిట లక్షల్లో వసూలు
- చక్రం తిప్పుతున్న టౌన్ ప్లానింగ్ సిబ్బంది
- ఇరిగేషన్ భూముల్లోనూ ఇండ్ల నిర్మాణానికి అనుమతి
- విచారణ చేపట్టిన మున్సిపల్ కమిషనర్
- తవ్వేకొద్దీ వెలుగులోకి వస్తున్న అక్రమాలు
సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఇంటి నిర్మాణాల పేరిట అక్రమాలకు పాల్పడుతున్నారు. వెంచర్లు, ఇండ్ల నిర్మాణాలను రూల్స్‌కు విరుద్ధంగా అనుమతులు ఇస్తున్నారు. కెనాల్స్, ఇరిగేషన్ భూ ముల్లో ఇండ్ల నిర్మాణాలతో పాటు ఐదారేండ్ల కింద నిర్మించిన ఇండ్లకు కూడా ఒకే చెప్పేస్తున్నారు. ఇం దుకో సం లక్షల్లో వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అక్రమాలను అడ్డుకోవాల్సిన టైన్ ప్లానింగ్ అధికారులు సైతం కాసులకు కక్కుర్తి పడుతున్నట్లు తెలుస్తోంది. ఇండ్ల కోసం పర్మిషన్స్ తీసుకొని షాపింగ్ కాంప్లెక్స్ కట్టినా, సెల్లార్ల్స్ లేకపోయి నా పట్టించుకోకపోవడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.
కమిషనర్ పేరుతో వసూళ్లు
టౌన్ ప్లానింగ్ సిబ్బంది కమిషనర్ పేరుతో వసూళ్లకు పాల్పడడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఒక భవనానికి సంబంధించిన యజమాని అనుమతుల కోసం అప్లై చేసుకుంటే కమిషనర్ పేరు చెప్పి భారీగా డిమాండ్ చేశారు. దీంతో విస్తుపోయిన యజమాని సిబ్బంది డబ్బులు అడుగుతున్నారంటూ వీడియో తీసి కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కంగు తిన్న కమిషనర్ రామంజుల రెడ్డి ఉద్యోగులపై విచారణ చేపట్టారు. దీంతో తవ్వేకొద్దీ అక్రమలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే దాదాపు 50కి పైగా బిల్డింగ్‌ల నుంచి లక్షల్లో వసూలు చేసినట్లు తేలింది.
పర్మిషన్ ఒకదానికి.. కట్టేది మరోటి..
మున్సిపాలిటీలో కొందరు వ్యక్తులు సింగిల్ ఫ్లోర్ కోసం పర్మిషన్ తీసుకొని రెండు మూడు అంతస్తులు వేస్తున్నారు. జమ్మిగడ్డ జడ్పీ ఆఫీస్ ఎదురుగా రెండు ఫ్లోర్లకు పర్మిషన్ తీసుకొని ఏకంగా ఐదు అంతస్తులలో నిర్మాణం చేపట్టారు. సెట్ బ్యాక్ లేకుండా నిర్మించడమే కాకుండా రోడ్డును ఆక్రమించి లిఫ్ట్ కూడా పెట్టారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన రహదారికి ఇరువైపుల నిర్మిస్తున్న బిల్డింగులు రూల్స్ మేరకు లేకపోయినా అధికారులు పట్టించుకోవడం లేదు. సెట్ బ్యాక్ , సెల్లార్స్ లేకుండా నిర్మాణాలు చేస్తున్నారని ఎవరైనా కంప్లైంట్ ఇస్తే నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు.
కోర్టును ఆశ్రయిస్తున్న అక్రమార్కులు
అక్రమ నిర్మాణాలు వెలుగులోకి వస్తుండడంతో కమిషనర్ చర్యలు చేపట్టారు. రూల్స్‌కు విరుద్ధంగా ఉన్న బిల్డింగులను కూల్చి వేయాలని సిబ్బందిని ఆదేశిస్తున్నారు. దీంతో కొందరు కోర్టుకు వెళ్తున్నారు. తమకు టౌన్ ప్లానింగ్ అధికారులు పర్మిషన్ ఇచ్చారంటూ ఆ పత్రాలను కోర్టుకు సమర్పించి స్టే తెచ్చుకుంటున్నారు. ఈ ఏడాదిలో 54 మంది హైకోర్టు నుంచి స్టే తెచ్చుకోవడం గమనార్హం. వీళ్లు స్టే తెచ్చుకోవడంలోనూ మామూళ్లు తీసుకున్న సిబ్బంది సహకరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
విద్యానగర్‌లోని రామలింగేశ్వర స్వామి ఎదురుగా ఉన్న ఈ బిల్డింగ్‌ను 2015లో అనుమతులు లేకుండా నిర్మించారు. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు సదరు వ్యక్తి నుంచి ఇటీవల రూ.75వేలు తీసుకొని పర్మిషన్ ఇచ్చారు. రీ కన్‌స్ట్రక్షన్ బిల్డింగ్‌లకు మాత్రమే కొత్తగా పర్మిషన్ ఇవ్వాలన్న రూల్ ఉన్నా.. వాటిని పట్టించుకోలేదు.
ఖమ్మం రోడ్డులో కొత్తగా ఏర్పాటు చేసిన వెంచర్ పర్మిషన్ కోసం టౌన్ ప్లానింగ్ సిబ్బంది రూ.3లక్షలు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. మూసీ మేజర్ కాలువ నుంచి పొలాలకు నీళ్లు పోయే కాలువను వెంచర్ యజమానులు కబ్జా చేయడంతో ఈ మొత్తం వసూలు చేసినట్లు తెలిసింది.
చర్యలు తీసుకుంటాం
టౌన్ ప్లానింగ్ అక్రమాలపై విచారణ చేస్తున్నారు. ఇప్పటికే సూపర్ వైజర్‌కు మెమో జారీ చేశాం. ఒక ఉద్యోగిని టౌన్ ప్లానింగ్ నుంచి శానిటేషన్ డిపార్ట్‌మెంట్‌కు బదిలీ చేశాం. సిబ్బందిపైనా చర్యలు తీసుకుంటాం.
- రామంజుల రెడ్డి, మున్సిపల్ కమిషనర్, సూర్యాపేట