వరంగల్లో ప్రత్యేక ఆకర్షణగా బొమ్మల కొలువు

సంక్రాంతి సంబురాల్లో భాగంగా వరంగల్ లో బొమ్మల కొలువు ప్రధాన ఆకర్శణగా నిలుస్తోంది.  ఆచార సాంప్రదాయలను పాటిస్తూ బొమ్మల కొలువు నిర్వహించడం ఆచారంగా భావిస్తారు. పురాణ ఘట్టాలను గుర్తుకు తెచ్చేలా బొమ్మల్ని పేర్చారు. పురాణ విశేషాలు వచ్చేతరం వారికి తెలియాలనే సంకల్పంతోనే బొమ్మల కొలువు నిర్వహిస్తున్నారు. హనుమకొండలోని ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లో .. అన్ని ఘట్టాలతో ఏర్పాటు చేసిన పార్వతీ కల్యాణం బొమ్మల కొలువు ఆకట్టుకుంటోంది. మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. 

తెలుగు రాష్ట్రాల్లో ఈ బొమ్మల కొలువు దసరా తొమ్మిది రోజులు, సంక్రాంతికి మూడు రోజులు ఆడపిల్లలు ఉన్న కుటుంబాల వాళ్ళు తప్పకుండా పెడతారు. ఇంటి ఆచారాన్ని బట్టి, ఆనవాయితీని బట్టి కొందరు దసరాకు పెడతారు. మరికొందరు సంక్రాంతికి ఈ కొలువు పెడతారు. బొమ్మలు పెట్టడం, బొమ్మలు నిలపడం, బొమ్మలు ఎత్తడం, అనే వ్యవహారం ప్రాంతీయభేదాన్ని బట్టి ప్రయోగిస్తూ ఉంటారు. ఆడపిల్లలు ప్రధానంగా ఈ బొమ్మల కొలువు పెట్టడానికి అధికారం కలవాళ్ళు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కుటుంబాలలో ఈ ఆచారం ఎక్కువగా కనిపిస్తుంది.

ఆడపిల్ల గల కుటుంబంలో అమ్మాయిల చేత ఈ బొమ్మలు పెట్టిస్తారు. ఇంట్లో పెద్దలందరూ కలిసి బొమ్మలనుఒక క్రమంలో మెట్లు మెట్లుగా అమర్చిపెడతారు. కొందరు చెక్కతో మెట్ల బల్ల చేయించి పెట్టుకుంటారు . బొమ్మల బల్ల అనీ మెట్ల బల్ల అనీ దాన్ని వ్యవహరిస్తారు. ఈ బల్ల మెట్లు ఎప్పుడూ బేసి సంఖ్యలోనే ఉంటాయి. మూడు, ఐదు, ఏడు – ఇలా వారి వారి బొమ్మల సంఖ్యను బట్టి అన్ని మెట్లుగా బల్ల ఉంటుంది. బొమ్మలు పెట్టేముందు బల్లను కేవలం తెల్లటి గుడ్డతోనే కప్పుతారు. ఆ బల్ల మీద మామూలు రోజుల్లో పుస్తకాలు తప్ప ఏమీ పెట్టనివ్వరు కొందరు. మరికొందరు ఆ బల్లను గుడ్డ కప్పి పదిలంగా దాచిపెడతారు. బొమ్మల ఆకారాన్ని బట్టి ఏ మెట్టు మీద ఏ బొమ్మ పెట్టాలి అనేది నిర్ణయించుకుని క్రింద నుండి పైకి పెట్టుకుంటూ వెళతారు. ప్రతి మెట్టు మీద కనీసం ఒక్క బొమ్మ క్రింద నుండి పై మెట్టు దాకా పెట్టాక తక్కిన బొమ్మలు పేర్చుకుంటూ వస్తారు.

ఇవి కూడా చదవండి:

తిరుమలలో వైభవంగా భోగి సంబరాలు

సంక్రాంతి తర్వాత కరోనా కేసులు పెరిగే అవకాశం