- ఆటపాటలతో ఆనందంగా గడిపిన గ్రామస్తులు
ఆదిలాబాద్, వెలుగు: స్కూల్‌మేట్స్, కాలేజ్‌మేట్స్ పదేండ్ల తర్వాతో.. 20 ఏండ్ల తర్వాతో కలుసుకోవడం చూశాం. కానీ, ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండంలో ఒక అపూర్వ కలయిక జరిగింది. ప్రాజెక్టు వల్ల నిర్వాసితులై.. చెట్టుకొకరు, పుట్టకొకరుగా తరలివెళ్లిన జనమంతా.. 40 ఏండ్ల తర్వాత స్వగ్రామంలో కలుసుకున్నారు. 1984లో జైనథ్ మండలంలోని సాత్నాల ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా బేల మండలంలోని తోయిగూడ గ్రామం ముంపునకు గురైంది.
దీంతో గ్రామస్తులంతా ఊరు ఖాళీ చేసి బతుకుదెరువు వెతుక్కుంటూ వివిధ ప్రాంతాలకు వెళ్లిపోయారు. వాట్సప్అందుబాటులోకి వచ్చాక రెండేండ్ల క్రితం గ్రామానికి చెందిన యువకులు, పెద్దలతో ఓ గ్రూపు ఏర్పాటుచేసుకున్నారు. ఈ క్రమంలో తోయిగూడ ఆత్మీయ సమ్మేళనానికి ప్లాన్‌వేశారు. అలా సోమవారం 40 ఏండ్ల తర్వాత అదే తోయిగూడ గ్రామంలో కలుసుకొని సంబురంగా గడిపారు. ఈ 40 ఏండ్లలో ఎన్నో మారిపోయాయి. అప్పట్లో పిల్లలు ఇప్పుడు నడీడుకు వచ్చారు.
అప్పటి పెద్దలు వృద్ధులయ్యారు. వారిలో కొందరు చనిపోయారు. అందుకే మొదట పరిచయ కార్యక్రమం నిర్వహించారు. పేరుపేరునా ఆప్యాయంగా పలకరించుకున్నారు. బంధుత్వాలు గుర్తుచేసుకున్నారు. చనిపోయినవాళ్లకు నివాళులర్పించారు. అనంతరం ఒకరి కష్టసుఖాలు మరొకరితో పంచుకున్నారు. మహిళలంతా కలిసి బతుకమ్మ ఆడుకున్నారు. ఉదయమే డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా మైసమ్మ, పోచమ్మ, హనుమాన్ మందిరాలను దర్శించుకొని పూజలు చేశారు.
విశ్రాంత ఉద్యోగులు, ఇటీవల ఉద్యోగాలు సాధించిన వారిని సన్మానించారు. తర్వాత సహపంక్తి భోజనాలు చేశారు. వివిధ పాటలపై చిన్నారులు డ్యాన్సులు చేసి అందరినీ అలరించారు. అనంతరం ఒకరికొకరు భారంగా వీడ్కోలు పలుకుతూ సెలవు తీసుకున్నారు. కార్యక్రమంలో తోయిగూడ కోర్ కమిటీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అడప తిరుపతి, ఉపాధ్యక్షుడు గద్దల శంకర్, మహేందర్, నీలకంఠ, భూమన్న తదితరులు పాల్గొన్నారు.