కొయ్యతో ఎకోఫ్రెండ్లీ టాయ్స్​

 కొయ్యతో ఎకోఫ్రెండ్లీ టాయ్స్​

పిల్లల కోసం ఆటబొమ్మలు కొనాలని మార్కెట్​కి వెళ్లింది. అయితే, అక్కడన్నీ  ప్లాస్టిక్ బొమ్మలే కనిపించాయి. వాటి క్వాలిటీ కూడా బాగా లేదు. అప్పుడే ఆమెకు పిల్లల టాయ్స్ తయారుచేయాలనే ఆలోచన వచ్చింది. పర్యావరణానికి హాని చేయని చెక్క బొమ్మలు చేయాలని  ‘షుమీ’ అనే స్టార్టప్  పెట్టింది బెంగళూరుకు చెందిన మీతా శర్మ గుప్త. పిల్లల కోసం ఎకోఫ్రెండ్లీ, సేఫ్​ టాయ్స్​ తయారుచేస్తున్న ఆమెని ప్రధాని నరేంద్ర మోడి మెచ్చుకోవడమే కాకుండా ‘మన్​ కి బాత్​’లో ఆమె స్టార్టప్​ గురించి ప్రస్తావించారు కూడా. 
  
బొమ్మలతో ఆడుకుంటూ... వాటి పేర్లు, రంగులతో పాటు అవి ఏ ఆకారంలో ఉన్నాయి?  వంటి విషయాలు నేర్చుకుంటారు పిల్లలు. అందుకని డబ్బులు ఎక్కువైనా సరే తన రెండేండ్ల కొడుక్కి మంచి క్వాలిటీ బొమ్మలు  కొనాలనుకుంది మీతా. కానీ, ఎక్కడ చూసినా ప్లాస్టిక్ టాయ్స్​ ఉండేవి. వాటి తయారీలో లెడ్​, పాలీవినైల్​ క్లోరైడ్, బిస్​ఫెనాల్​–ఎ వంటి కెమికల్స్​ వాడతారు. వీటిని పిల్లలు నోట్లో పెట్టుకుంటే వాళ్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. అంతేకాదు కొన్నేండ్ల పాటు ఇవి మట్టిలో అలాగే ఉంటాయి. ఈ సమస్యలేవి ఉండకుండా కొయ్యతో ఎకోఫ్రెండ్లీ టాయ్స్​ తయారుచేయాలని డిసైడ్​ అయిందామె. 2016లో  ‘షుమీ’ అనే స్టార్టప్​ పెట్టింది. పసిపిల్లల నుంచి ఆరేండ్ల వయసు పిల్లలు ఆడుకునే బొమ్మలు దొరుకుతాయి ‘షుమీ’లో. క్రియేటివిటీ, కమ్యూనికేషన్​, ప్రాబ్లమ్ సాల్వింగ్, సెల్ఫ్​ ఎక్స్​ప్రెషన్ వంటి స్కిల్స్ పిల్లలు ఈజీగా నేర్చుకునేలా ఈ బొమ్మల్ని డిజైన్​ చేస్తారు.  వీళ్ల బొమ్మలకు అమెరికన్ సొసైటీ ఫర్ టెస్టింగ్ అండ్ మెటీరియల్స్ సర్టిఫికెట్  ఉంది. 

తేనెపట్టు మైనంతో పాలిష్​
బొమ్మల తయారీ కోసం వేప, మామిడి చెట్ల కలపని వాడతారు. కలపని తేమ పోయేంత వరకు ఎండబెడతారు. నేషనల్​ ఇనిస్టిట్యూట్ ఆఫ్​ డిజైన్​, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్​ ఫ్యాషన్ టెక్నాలజీలో చదివినవాళ్లు ఈ బొమ్మల్ని డిజైన్ చేస్తారు. తర్వాత చేతివృత్తుల వాళ్లు  కొయ్య మీద డిజైన్లు వేసి, వాటర్​ కలర్స్ వేస్తారు. బొమ్మలు మెరుస్తూ కనిపించేందుకు తేనెపట్టు మైనం లేదా బాదం నూనె రాస్తారు. బొమ్మలతో ఆడుకునేటప్పుడు పిల్లలకు చిన్న గాయం కూడా కాకుండా వాటి అంచుల్ని సాఫ్ట్​గా  చేస్తారు. 

సిస్టమ్​ డిజైనర్​..
ఐఐటీ ఢిల్లీలో ఇంజనీరింగ్ చదివింది మీతా. హార్వర్డ్ యూనివర్సిటీలో పీహెచ్​డీ చేసింది. ఆ తర్వాత న్యూయార్క్​కు చెందిన ఐబిఎం రీసెర్చ్​ ల్యాబ్​లో కంప్యూటర్ ఆర్కిటెక్చర్, సిస్టమ్​ డిజైనర్​గా పనిచేసింది. 2014లో ఇండియాకు తిరిగొచ్చింది. మనదేశంలోనే కాకుండా ఇంగ్లండ్, అమెరికాల్లో బొమ్మలు సేల్​ చేస్తోంది మీతా. ‘షుమీ’కి 2017లో ‘బెస్ట్ ఇండియన్ టాయ్ బ్రాండ్​’ అవార్డ్ వచ్చింది. 

త్రీడీ కిట్స్​ కూడా...
‘‘ఆటబొమ్మల్లో చాలావరకు చైనా నుంచి దిగుమతి అయినవే. వాటి క్వాలిటీ తక్కువ. అలాగని మంచి క్వాలిటీ బొమ్మలు కొందామంటే వాటి ధర ఎక్కువ. ప్లాస్టిక్​ బొమ్మల్లో చాలావరకు బ్యాటరీతో నడిచేవే. దాంతో ప్లాస్టిక్​​తో పాటు బ్యాటరీ వేస్ట్​ కూడా పేరుకుపోతోంది. ఈ సమస్యకు పరిష్కారం చూపాలని ఎకోఫ్రెండ్లీ టాయ్స్​ ​తయారుచేయడం మొదలుపెట్టా. ప్లాస్టిక్ బొమ్మలతో పోల్చితే చెక్కతో చేసిన  బొమ్మల ధర ఎక్కువ. కానీ, ఎక్కువ రోజులు వస్తాయి. వీటి వల్ల పర్యావరణం దెబ్బతినదు. నాలుగేండ్ల వయసున్న పిల్లల కోసం ఈమధ్యే  ‘త్రీడీ డూ–ఇట్– యువర్ సెల్ఫ్’​ కిట్స్​ తెచ్చాం. ఇవి పంట పొలాలు, అడవి, సర్కస్​ థీమ్​లో ఉంటాయి”