కిషన్ రెడ్డి కాదని.. కిస్మత్ రెడ్డి.. OYC జపం తప్ప ఆయనకేమీ చేతకాదు: మహేష్ గౌడ్

కిషన్ రెడ్డి కాదని.. కిస్మత్ రెడ్డి.. OYC జపం తప్ప ఆయనకేమీ చేతకాదు: మహేష్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: ఎంఐఎంకు కాంగ్రెస్​పార్టీ ఏజెంట్‎గా మారిందంటూ కేంద్రమంత్రి కిషన్​రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్​మహేశ్​కుమార్​ గౌడ్​ ఫైర్​ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం గెలిస్తే  రజాకార్ల రాజ్యం ఎట్లా వస్తదో కిషన్​రెడ్డి చెప్పాలని డిమాండ్​ చేశారు. శుక్రవారం గాంధీ భవన్​లో మహేశ్​గౌడ్​ మీడియా సమావేశంలో మాట్లాడారు. 

తమకు సంఖ్యా బలం లేకే హైదరాబాద్​ లోకల్​బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. ‘‘గత జన్మలో కిషన్​రెడ్డి, అక్బరుద్దీన్​ ఒవైసీ అన్నదమ్ములనుకుంటా.. పొద్దున లేస్తే ఒవైసీ జపం  చేయడం కిషన్​రెడ్డికి అలవాటుగా మారింది. బీజేపీ నేతలకు మతం తప్ప అభివృద్ధి పై ధ్యాస లేదు’’ అని మహేశ్​ కుమార్ ​గౌడ్ మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన ఇన్నేండ్ల రాజకీయ జీవితంలో రాష్ట్రానికి ఏం చేశారో చెప్పే దమ్ముందా అని సవాల్​ చేశారు. అసలు ఆయన కిషన్ రెడ్డి కాదని.. కిస్మత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు.

ప్రతి ఎన్నికల్లో ఏదో ఒక పార్టీ మద్దతుతో గెలవడం కిషన్ రెడ్డికి అలవాటేనని అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందనుకోవడం పగటి కలే అని చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి తీసుకువచ్చే నిధుల సంగతి దేవుడెరుగు.. కిషన్​రెడ్డి కనీసం ఒక్కసారైనా ప్రధానిని కలిసి రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడకపోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. రాష్ట్రం నుంచి అన్ని పార్టీల ప్రతినిధులను ఢిల్లీకి తీసుకెళ్లి.. మోదీని కలిపించి నిధులు అడిగే సాహసం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. 

కేంద్ర మంత్రిగా 15 నెల్లలో కేంద్రం నుంచి రాష్ట్రానికి తెచ్చిన నిధులు ఎన్నో చెప్పాలని కోరారు.  సన్నబియ్యం లాంటి చరిత్రాత్మక నిర్ణయాలు అమలు చేస్తుంటే.. ప్రభుత్వానికి కిషన్ రెడ్డి అడుగడుగునా అడ్డుపడుతున్నారని,  సన్నబియ్యం పంపిణీపై రాద్ధాంతం చేసే బదులు.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆ పథకాన్ని అమలు చేసి రేషన్ షాపుల్లో మోదీ ఫొటో పెట్టుకోవాలని సూచించారు. కులం, మ‌‌‌‌తం పేరు చెప్పి ఇంకెన్నాళ్లు ప‌‌‌‌బ్బం గడుపుకోవాల‌‌‌‌ని చూస్తారని ప్రశ్నించారు.

బలం లేకున్నా ఎందుకు పోటీ చేస్తున్నరు..?

హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నిక‌‌‌‌ల్లో ఏ పార్టీ మద్దతు ఉంటుందనే ఆశతో, ఎవరి ఓట్లు వస్తాయనే నమ్మకంతో బరిలో నిలిచారని బీజేపీని మహేశ్​ గౌడ్​ ప్రశ్నించారు. ‘‘బీఆర్ఎస్​తో ర‌‌‌‌హ‌‌‌‌స్య ఒప్పందం నిజం కాదా? సంఖ్యాబ‌‌‌‌లం లేని మీరు ఎవ‌‌‌‌రి ప్రేమతో, ఇంకెవరి అండ‌‌‌‌దండ‌‌‌‌లు చూసుకుని పోటీ చేస్తున్నారు” అని బీజేపీని నిలదీశారు.  రాజకీయ అవసరాలను బట్టి లోకల్ బాడీ ఎన్నికల్లో మజ్లిస్ కు మద్దతు గురించి ఆలోచిస్తామని, అలా అని తాము మజ్లిస్ కు లొంగిపోయామని అనుకోవడం పొరపాటని అన్నారు.

సబర్మతి నది గురించి మాట్లాడే బీజేపీ నేతలు.. మూసీ సుందరీకరణకు ఎందుకు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు. మెట్రో రైలు విస్తరణ, విభజన హామీలు బీజేపీకి పట్టవని ఆరోపించారు. కంచ గచ్చిబౌలి భూముల్లో పారిశ్రామిక అభివృద్ధి జరిగితే యువతకు వేల ఉద్యోగావకాశాలు వస్తాయని చెప్పారు. రాజకీయాలు పక్కన పెట్టి  రాష్ట్రాభివృద్ధికి సహకరించాల్సింది పోయి స్వార్థం కోసం విమర్శలు చేయడం సరైంది కాదని అన్నారు.

బీసీలపై చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో ధర్నాకు బీజేపీలోని బీసీ నేతలు ఎందుకు హాజరు కాలేదని అడిగారు.  కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగానైనా ఉద్దేశపూర్వక వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని, ఎవరైనా సరే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫలానా వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వాలని  జానారెడ్డి అనలేదని, ఆయన రాజకీయ సమతుల్యం ఉండాలని కోరుకునే వ్యక్తి  అని పేర్కొన్నారు.