హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి జిల్లాల వారీగా టూర్లకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సిద్ధమయ్యారు. త్వరలో జరుగనున్న లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం పార్టీ క్యాడర్ ను సమాయత్తం చేసేందుకు జిల్లాల్లో పర్యటించాలని ఆయన నిర్ణయించుకున్నారు. పీసీసీ చీఫ్ గా మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత నిజామాబాద్ లో పర్యటించారు. ఆ తర్వాత మరికొన్ని ఉమ్మడి జిల్లాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. కారణాలు ఏమైనప్పటికి చివరికి గాంధీభవన్ లోనే ఆయన ఉమ్మడి జిల్లాల నేతలతో సమీక్షలు నిర్వహించారు.
రోజుకు మూడు ఉమ్మడి జిల్లాల చొప్పున పార్టీ ఆఫీసులో మీటింగ్ లు పెట్టి జిల్లాల వారీగా ముఖ్య నేతలను పిలిపించుకుని పార్టీ పరిస్థితిని తెలుసుకున్నారు. కాంగ్రెస్ పరిస్థితిపై అన్ని జిల్లాల్లో ఓ అంచనాకు వచ్చిన పీసీసీ చీఫ్ ఇక ఇప్పుడు నేరుగా జిల్లాల పర్యటనలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కుల గణనను జనంలోకి బలంగా తీసుకెళ్లే విషయంలో పార్టీ నేతలు, క్యాడర్ కు ఇప్పటికే ఆయన దిశానిర్దేశం చేశారు.