హైదరాబాద్: నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మంద జగన్నాథం మృతి పట్ల టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సంతాపం తెలిపారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజక వర్గం నుంచి నాలుగు సార్లు ఎంపీగా విజయం సాధించిన మంద జగన్నాథం తెలంగాణ పోరాటంలో క్రియాశీలకంగా పని చేశారని ఈ సందర్భంగా మహేష్ గౌడ్ గుర్తు చేశారు.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. మంద జగన్నాథం కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని అన్నారు. మంద జగన్నాథం మృతి పట్ల మాజీ ఎంపీ, ప్రస్తుత పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ కూడా సంతాపం వ్యక్తం చేశారు. మంద జగన్నాథంతో సహచర పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన అంజన్ కుమార్ యాదవ్.. అనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
ALSO READ | మాజీ ఎంపీ మంద జగన్నాథం కన్నుమూత
గత కొంత కాలంగా అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతోన్న మంద జగన్నాథం.. ఆరోగ్యం విషమించడంతో 2025, జనవరి 12న తుదిశ్వాస విడిచారు. మంద జగన్నాథం మృతి పట్ల ఆయన సహచరులు, పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రేపు (జనవరి 13) ఆయన స్వస్థలంలో జగన్నాథం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. నిమ్స్‌లో చికిత్స పొందుతోన్న మంద జగన్నాథంకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, దామోదర రాజ నర్సింహా ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న జగన్నాథంను పరామర్శించి మెరుగైన వైద్య సహయం అందించాలని ఆదేశించిన విషయం తెలిసిందే.