తప్పుడు కేసులు ఎన్నటికీ నిలబడవు సత్యమేవ జయతే

తప్పుడు కేసులు ఎన్నటికీ నిలబడవు సత్యమేవ జయతే

కాంగ్రెస్ పార్టీని చూసి భయపడుతున్న మోదీ ప్రభుత్వం గాంధీ కుటుంబంపై  కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది.  బీజేపీ పాలనలో దేశం తిరోగమన దిశలో పయనిస్తుండడంతో ప్రభుత్వ వ్యవహార శైలిని నిలదీస్తున్న సోనియా గాంధీ,  రాహుల్ గాంధీలపై  కేంద్ర ప్రభుత్వం కుట్రలకు తెరలేపింది.  ప్రభుత్వ సంస్థలను బీజేపీ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటూ భ్రష్టు పట్టిస్తోంది. 2014లో  కేంద్రంలో పగ్గాలు చేపట్టిన నుంచి ప్రతిపక్షాల ప్రభుత్వాలను, నేతలను లక్ష్యంగా చేసుకుంటూ మోదీ సర్కార్​  సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలపై ఒత్తిడి తెచ్చి తప్పుడు  కేసులు బనాయిస్తోంది. 

ఇటీవల అహ్మదాబాద్​లో  జరిగిన 86వ ఏఐసీసీ సమావేశాల్లో ప్రభుత్వ సంస్థలను బీజేపీ సర్కార్  దుర్వినియోగపరుస్తున్న తీరును కాంగ్రెస్ ఎండగట్టిన వారం రోజుల వ్యవధిలోనే..  ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్ (ఈడీ) సంస్థ  కాంగ్రెస్ అగ్రనేతలైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను నేషనల్ హెరాల్డ్ కేసు చార్జ్​షీట్​లో  చేర్చింది. 

ప్రజా వ్యతిరేక పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజాపక్షాన పోరాడుతున్న సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను కేసుల పేరిట బీజేపీ బెదిరిస్తోంది. కులం, మతం, ప్రాంతం, భాషా విభేదాలతో  దేశ ప్రజలను బీజేపీ విభజిస్తోంది. దేశంలో  నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది.  నిత్యావసర  సరుకుల ధరలు  ప్రజలకు అందుబాటులో లేకుండా పోయాయి.  అంతర్జాతీయంగా చమురు ధరలు ఎన్నడూలేని విధంగా తగ్గుతున్నా ఆ ఫలాలు అందకుండా పన్నులు, సుంకాల పేరుతో  కేంద్ర ప్రభుత్వం  ప్రజల నడ్డి విరుస్తోంది.  

గ్యాస్ ధరలు మంటలు రేపుతున్నాయి.  జీఎస్టీ పేరుతో  కేంద్రం ప్రజలను  దోచుకుంటోంది. బడా కార్పొరేట్లకు దేశ సంపదను బీజేపీ దోచి పెడుతోంది.  దేశంలో అధిక శాతమైన బడుగు, బలహీన వర్గాలకు సామాజిక న్యాయం అందించాలనే ఏకైక లక్ష్యంతో దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని కాంగ్రెస్  పార్టీ  కోరుతోంది. సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ ఉద్యమిస్తుంటే, బీజేపీ ప్రభుత్వం మాత్రం రాజ్యాంగాన్ని మార్చేందుకు, రిజర్వేషన్లు తొలగించేందుకు కుట్రలకు తెరలేపింది. ఈ నేపథ్యంలో మోదీ ప్రజా వ్యతిరేక పాలనను కాంగ్రెస్  నిలదీస్తుండడంతో బీజేపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తి, సమస్యలను పక్కదారి పట్టిస్తూ కాంగ్రెస్ నేతలను లక్ష్యంగా చేసుకొని కేసులు  బనాయిస్తోంది. 

ప్రజాపక్షాన కాంగ్రెస్ పోరాటం

ప్రజాపక్షాన కాంగ్రెస్  పోరాటం చేస్తుండటంతో.. భంగపాటు తప్పదని గుర్తించిన బీజేపీ అవాస్తవాలతో  నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసు సృష్టించి రాజకీయంగా అవసరమైనప్పుడు తెరమీదకు తెస్తోంది.  2014లో  బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే  ఆ పార్టీ ఎంపీ  సుబ్రహ్మణ్యస్వామి నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి ఒక ప్రయివేట్ ఫిర్యాదు చేశారు.  

ఏడేళ్ల అనంతరం 2021లో  బీజేపీ ప్రభుత్వం దీనిపై ఈడీ సంస్థను ఉసిగొల్పింది. నాలుగేళ్ల తర్వాత 2025లో  చార్జిషీట్లో గాంధీ కుటుంబ సభ్యుల పేర్లను ఈడీ చేర్చింది.  ఇక్కడ విచిత్రమేమిటంటే 2008లో ఆర్థిక సంక్షోభంతో మూతపడిన కాంగ్రెస్​కు చెందిన నేషనల్ హెరాల్డ్​ పత్రికకు ఆ పార్టీ ఆర్థిక సహాయం చేస్తే మనీ లాండరింగ్ కేసు పేరుతో ఈడీ  రంగప్రవేశం చేసింది.

లోక్​సభ ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు

‘అబ్ కీ బార్ చార్ సౌ పార్’ నినాదంతో లోక్​సభ ఎన్నికల్లో భంగపడిన బీజేపీ అహ్మదాబాద్​లో  జరిగిన ఏఐసీసీ సమావేశాలతో ఉక్కిరిబిక్కిరవుతోంది.  బీజేపీ తమ ప్రయోగశాలగా చెప్పుకునే గుజరాత్ నుంచే ఆ పార్టీ పతనాన్ని శాసించాలని రాహుల్ గాంధీ ఆ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. దీంతో గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వం ఈడీని రంగంలోకి దింపింది. రాబోయే బిహార్ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమికి గెలుపు అవకాశాలున్న నేపథ్యంలో  బీజేపీ ఈడీని పావుగా వాడుకుంటూ కాంగ్రెస్​ను అడ్డుకోవాలని భావిస్తోంది.  

ప్రజాబలం ఉన్న కాంగ్రెస్​ను అడ్డుకోవడం ఎవరివల్లా సాధ్యం కాదనే సత్యం త్వరలోనే తెలుస్తుంది. స్వాతంత్ర్య ఉద్యమంలో నేషనల్ హెరాల్డ్ పత్రిక ప్రజల గొంతుకగా నిలిచింది. స్వాతంత్ర ఉద్యమంలో భారతీయుల తరఫున ఒక పత్రిక ఉండాలనే లక్ష్యంతో  నెహ్రూ 1938లో నేషనల్ హెరాల్డ్​ను ప్రారంభించారు. 1937లో స్థాపితమైన అసోసియేషన్ ఆఫ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) ఆధ్వర్యంలో నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురించారు. ఏజేఎల్​లో 5వేల మందికిపైగా  స్వాతంత్ర్య సమరయోధులు షేర్ హోల్డర్స్ గా ఉండేవారు.  గాంధీ, నెహ్రూ, పటేల్ వంటి కీలక నేతల మార్గదర్శకంలో ఈ పత్రిక పనిచేస్తూ  దేశ ప్రజలకు ఒక కరదీపికగా కీలకపాత్ర పోషిం చింది. 

ఈ పత్రికను నడపడంలో అన్నీ తానై నడిపించిన నెహ్రూ రాసే వ్యాసాలతో బ్రిటిష్ పాలకులు బెంబేలెత్తేవారు.  దీనిపై కక్ష పెంచుకున్న బ్రిటిష్  ప్రభుత్వం 1942లో ఈ పత్రికను కొంతకాలం నిషేధించారు. 1947లో  దేశ తొలి ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన  నెహ్రూ నేషనల్ హెరాల్డ్ పత్రిక బోర్డు చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. స్వాతంత్ర్య ఉద్యమంలో  కాంగ్రెస్​తో పాటు  నేషనల్​ హెరాల్డ్ పత్రిక కూడా ప్రధాన పాత్ర పోషించినా.. బీజేపీ బ్రిటిష్ పాలకులవలె నేషనల్ హెరాల్డ్ పత్రికపై, కాంగ్రెస్ పార్టీపై కక్షపూరితంగా వ్యవహరిస్తోంది.

దేశవ్యాప్తంగా కులగణనకు కాంగ్రెస్ డిమాండ్​

కేంద్రంలోని  బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా కాంగ్రెస్ ఎప్పటికప్పుడు ఎండగడుతుంటే  మోదీ సర్కార్  సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై  వ్యక్తిగత కక్ష సాధింపులకు దిగింది. భారత్ జోడో యాత్రను విజయవంతంగా పూర్తి చేసి దేశ ప్రజలకు చేరువైన రాహుల్ గాంధీ.. దేశంలో కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తుండడంతో బీజేపీ తప్పించుకునేందుకు సాకులు వెతుకుతోంది. 

అయితే ఇందుకు భిన్నంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో శాస్త్రీయ పద్ధతుల్లో  కులగణనను విజయవంతంగా చేపట్టడమే కాకుండా రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గానికి 42 శాతం రిజర్వేషన్లు కల్పించి దేశానికి ఆదర్శంగా నిలవడంతో బీజేపీకి దిక్కుతోచడం లేదు. అందుకే సహనం కోల్పోయిన ప్రధాని మోదీ హర్యానాలో ఒక సభలో ప్రసంగిస్తూ  తెలంగాణ కాంగ్రెస్  ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేశారు.  బడుగు, బలహీన వర్గాలకు సామాజిక న్యాయం అందించాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్​ను ఆ వర్గాలు అక్కున చేర్చుకుంటుంటే పాలుపోని బీజేపీ ఈడీ పేరుతో కుట్రలు ప్రారంభించింది.

 దేశంలో కొందరు బీజేపీ, ఎన్డీఏ నేతలు ఎన్నో అక్రమాలకు, అవినీతికి పాల్పడుతున్నా వారిపై దృష్టి సారించని ఈడీ కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితో కాంగ్రెస్ నేతలతోపాటు పలు రాష్ట్రాల్లో ‘ఇండియా’ కూటమి నేతలపై కూడా తప్పుడు కేసులు బనాయిస్తోంది.  కక్షసాధింపుతో  పెట్టిన పలు ఈడీ కేసులలో  న్యాయస్థానాలు ముందు నిలబడవని  తెలిసినా ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా బీజేపీ వ్యవహరిస్తోంది. 

నిరాధారమైన తప్పుడు కేసులతో  సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను బీజేపీ బెదిరించాలని చూస్తే  ప్రజాబలం ఉన్న కాంగ్రెస్  ఏమాత్రం జంకకుండా న్యాయస్థానంలో,  ప్రజాక్షేత్రంలోనే  తేల్చుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం బనాయించే తప్పుడు కేసులు అంతిమంగా నిలబడవు.  చివరికి సత్యమే గెలుస్తుంది.  సత్యమేవ జయతే. 

రాజకీయ కక్ష

ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమ సొంత పత్రికైన  నేషనల్ హెరాల్డ్​కు కాంగ్రెస్ సాయపడడంలో తప్పేముంది? అందులో వ్యక్తిగతంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఆర్థిక ప్రయోజనలేముంటాయి?  ఇక్కడ డబ్బు మార్పిడే  లేనప్పుడు మనీ లాండరింగ్ కేసు ఎలా నమోదు చేస్తారు? రూ.90 కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన నేషనల్ హెరాల్డ్​ను ఎలాంటి లాభాపేక్ష లేని  ‘యంగ్ ఇండియా’ సంస్థ ద్వారా గట్టెక్కించేందుకు ప్రయత్నిస్తే తప్పు పడతారా? మొత్తమంతా పారదర్శకంగా ఉన్నా రాజకీయ కక్షతో  కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకున్న బీజేపీ తమకు అవసరమైనప్పుడల్లా ప్రభుత్వ సంస్థలను దుర్వినియోగపరుస్తోంది.  

గతంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో  సహా కీలకమైన కాంగ్రెస్ నేతలను ఈడీ విచారించింది. పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా లోగడ ఈడీ విచారణకు హాజరైనారు. ఉద్దేశపూర్వకంగా  కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేసి విచారణకు పిలిచిన ఈడీ గతంలో ఎలాంటి ఆధారాలు సంపాదించలేకపోయింది. దేశంలో  రోజురోజుకూ బీజేపీ ప్రభుత్వం మసకబారడం, కాంగ్రెస్  ప్రజలకు చేరువవుతుండడంతో  దిక్కుతోచని నరేంద్ర మోదీ సర్కార్ మరోసారి  ఈడీ అస్త్రాన్ని ప్రయోగించింది.

- బి.మహేశ్ కుమార్ గౌడ్,
ఎమ్మెల్సీ, 
టీపీసీసీ అధ్యక్షుడు