
- హెచ్‌సీయూలో మోదీ ప్రారంభించిన బిల్డింగ్‌లకు మున్సిపల్, ఫారెస్ట్ పర్మిషన్లే లేవు
- గుజరాత్లో 17 వేల చెట్లను నరికామని బీజేపీ నేతలే ఒప్పుకున్నరు
- మోదీ సర్కారు ఐదేండ్లలో 1.09 లక్షల చెట్లను కొట్టినట్టు పార్లమెంట్‌లోనే అధికారికంగా తెలిపారు
- హెచ్‌సీయూ భూములపై వాస్తవాలు తెలుసుకోవాలని మోదీకి సూచన
హైదరాబాద్, వెలుగు: ప్రధాని మోదీ ఎన్నికల ర్యాలీ కోసం వేలాది చెట్లను నరకలేదా? అని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ ప్రశ్నించారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్, గాంధీ నగర్‌లో 17 వేల చెట్లను నరికి వేశామని ఆ పార్టీ నేతలే ఒప్పుకున్నారని చెప్పారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో మోదీ వర్చువల్‌గా ప్రారంభించిన 5 అదనపు గదులకు మున్సిపల్, అటవీ, ఎన్విరాన్మెంట్ పర్మిషన్లు లేవని తెలిపారు.
సోమవారం హర్యానాలోని హిసార్‌లో.. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు మహేశ్ కుమార్‌గౌడ్ కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్ఆర్డీఏలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఐదేండ్లలో 1.09 లక్షల చెట్లను తొలగించామని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వమే చెప్పిందని గుర్తు చేశారు. అంబానీ, అదానీల కోసం లక్షల ఎకరాల ఫారెస్ట్ భూములను మోదీ నాశనం చేశారని మండిపడ్డారు.
గతం మర్చిపోయి కాంగ్రెస్ సర్కారుపై ప్రధాని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. హెచ్‌సీయూ భూములు అటవీ భూములని, అక్కడి ప్రభుత్వం వాటిని నాశనం చేస్తున్నదని మోదీ మాట్లాడడం సరైంది కాదన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న విధ్వంసంపై ఆయన సమీక్ష చేసుకోవాలని సూచించారు. చెట్లను నరకడం బీజేపీ సంస్కృతి అని, చెట్లను నాటడం కాంగ్రెస్ ప్రభుత్వ విధానమని పేర్కొన్నారు.