క్రికెట్‎ను రాజకీయాలతో ముడిపెట్టడం సిగ్గుచేటు: మహేశ్​గౌడ్

క్రికెట్‎ను రాజకీయాలతో ముడిపెట్టడం సిగ్గుచేటు: మహేశ్​గౌడ్

కరీంనగర్, వెలుగు: క్రికెట్‎తో రాజకీయాలకు ముడిపెట్టి కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడడం సిగ్గుచేటని టీపీసీసీ చీఫ్ మహేశ్​కుమార్ గౌడ్ విమర్శించారు. బీసీ బిడ్డగా సంజయ్‎కి కేంద్రంలో మంత్రి పదవి రావడం తమందరికి సంతోషమని, కానీ దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. కరీంనగర్ డీసీసీ భవన్‎లో మంత్రి పొన్నం ప్రభాకర్, డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, సుడా చైర్మన్  కోమటిరెడ్డి రెడ్డి నరేందర్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. ప్రతి ఎన్నిక సమయంలో భారతదేశాన్ని పాకిస్తాన్‏ను.. హిందువు ముస్లింలను ముడిపెట్టడం, మత విద్వేషాలు రెచ్చగొట్టడం బండి సంజయ్‎కి అలవాటైందని మండిపడ్డారు.

బీజేపీ, బీఆర్ఎస్  పదేండ్ల బంధం మరోసారి బయటపడిందని, ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని పెట్టకుండా బీజేపీకి మద్దతిస్తోందని ఆరోపించారు. ‘కేటీఆర్  ఫార్ములా ఈ రేసు అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు ఇవ్వలేదని బండి సంజయ్ అంటున్నారు. ఫోన్  ట్యాపింగ్ ఎంత తీవ్రమైన నేరం.. కేంద్ర ప్రభుత్వంలో మీరు మంత్రిగా ఉన్నారు. ఎందుకు సీబీఐ విచారణ వేయలేదు. పోలీస్ అధికారులను తప్పించడానికి ఎవరు చూస్తున్నారు. విదేశాల్లో ఉన్న పోలీసులను ఎందుకు వెనక్కి తెప్పించడం లేదు. 

రాష్ట్ర  ప్రభుత్వ పరిమితి తెలియదా.' అని ప్రశ్నించారు. నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్‎లో సోమవారం జరిగిన సీఎం సభలు సక్సెస్  కావడంతో బీజేపీ నేతలకు దిమ్మతిరిగి ఇష్టమున్నట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. వీడియోలను మార్ఫింగ్  చేసి సోషల్ మీడియాను బీజేపీ అనైతికంగా అబద్ధపు ప్రచారానికి వాడుతోందని విమర్శించారు. దేవుడి పేరుతో ఓట్లడిగి బీజేపీ మూడు సార్లు గెలిచిందని పేర్కొన్నారు.

మేము 56 శాతం చూపాం..

రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం కుల గణన సర్వే చేశామని మహేశ్​ కుమార్ గౌడ్ తెలిపారు. కేసీఆర్ బీసీలను 51 శాతం మాత్రమే చూపిస్తే.. మా సర్వేలో 56 శాతం బీసీల లెక్క తేలిందని, 21 శాతం ఓసీలను చూపితే, మా సర్వేలో 16 శాతం చూపామని తెలిపారు. బండి సంజయ్  వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తున్న కాంగ్రెస్ కు ఓటేస్తరా.. బీసీలను అణగదొక్కుతున్న బీజేపీకి వేస్తారో గ్రాడ్యుయేట్లు తేల్చుకోవాలని సూచించారు.