- దొంగే దొంగ అన్నట్టుగా కేసీఆర్ కుటుంబం తీరు
- బీఆర్ఎస్, బీజేపీ విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలి
- చేసిన పనులు చెప్పకపోతే ప్రతిపక్షాల ప్రచారాన్నే ప్రజలు నమ్ముతరని వెల్లడి
- గాంధీ భవన్ లో కాంగ్రెస్ ఆదివాసీ సెల్ రాష్ట్ర సమావేశం
హైదరాబాద్, వెలుగు : కేసీఆర్ కుటుంబం తీరు చూస్తుంటే దొంగే.. దొంగ అన్నట్టుగా ఉందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. పదేండ్లు అధికారంలో ఉండి.. రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకొని.. అప్పులపాలు చేయడమే కాకుండా.. ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. శనివారం గాంధీ భవన్ లో కాంగ్రెస్ ఆదివాసీ సెల్ రాష్ట్ర సమావేశం జరిగింది. రాష్ట్ర ఎస్టీ సంక్షేమ సంస్థ చైర్మన్ బెల్లయ్య నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మహేశ్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మిగులు బడ్జెట్ తో అప్పగించిన రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్ల అప్పుల్లో ముంచి ఆర్థికంగా దివాళా తీయించిన కేసీఆర్ కుటుంబం.. ప్రజా ప్రభుత్వంపై అడుగడుగునా కుట్రలు చేస్తూ జనంలో అప్రతిష్టపాలు చేసే ప్రయత్నం చేస్తున్నదని ధ్వజమెత్తారు.
ఏడాదిలో ఎన్నో మంచి పనులు చేసినా బీఆర్ఎస్ నేతలు మాత్రం తమ ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ.. ప్రజా ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని పార్టీ క్యాడర్ కు పిలుపునిచ్చారు. పదేండ్లలో బీఆర్ఎస్ చేయలేని సంక్షేమ కార్యక్రమాలు కేవలం పది నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వ చేసిందన్నారు. ప్రభుత్వం చేసిన పనులను గ్రామాల్లో ఇంటింటికి వివరించాలని, చేసిన పనులు చెప్పలేకపోతే ప్రతిపక్షాల ప్రచారాన్నే ప్రజలు నమ్మే ప్రమాదం ఉందని పీసీసీ చీఫ్ అన్నారు. బీజేపీ మతతత్త్వ ప్రచారాన్ని, మోదీ అబద్ధాలను జనంలో బలంగా తిప్పికొట్టాలన్నారు.
రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని కావాల్సిన అవసరం ఉందన్నారు. దేశానికి కుల గణన ఎంత అవసరమో రాహుల్ వివరించారని, ఆయన చెప్పింది తెలంగాణలో అమలు చేసి చూపిస్తామన్నారు. కాంగ్రెస్ కోసం కష్టపడ్డ నాయకులకు పార్టీలో తప్పక గుర్తింపు ఉంటుందన్నారు. ఆదివాసీల సమస్యలపై లోతుగా చర్చించి వాటి పరిష్కారానికి మార్గం కనుగొనేందుకు నాగార్జున సాగర్ లో వారం రోజుల పాటు క్యాంపు నిర్వహిస్తామన్నారు. ప్రతి రోజు 7 నుంచి 8 ముఖ్యమైన అంశాలపై అందులో చర్చిస్తామన్నారు.