వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో బీఆర్ఎస్ ఉండదన్నారు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. హరీష్ రావు కూడా పక్క చూపులు చూస్తున్నారని అన్నారు. చివరకు బీఆర్ఎస్ లో తండ్రి, కొడుకు, కూతురు తప్ప ఎవరూ మిగలబోరని ఎద్దేవా చేశారు. సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన మహేశ్ కుమార్ గౌడ్.
బీఆర్ఎస్ పదేళ్లలో చేసిన అభివృద్ధి... తాము 11 నెలల్లో చేసిన అభివృద్ధిపై హరీష్ రావు చర్చకు సిద్దమా అని సవాల్ విసిరారు మహేశ్ కుమార్ గౌడ్. అధికారంలోకి వచ్చిన 11 నెలల్లోనే ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయన్నారు. బీజేపీ,బీఆర్ఎస్ కుమ్మకై కాంగ్రెస్ పార్టీపై కుట్ర పన్నుతున్నాయన్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని ఆగం చేస్తే కాంగ్రెస్ పార్టీ రిపేర్లు చేస్తుందన్నారు. బంగారు తెలంగాణ అంటే కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారుమయం అయ్యిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో బీటలు బారుతున్నాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టు 70 ఏళ్లయిన ఇంకా చెక్కు చెదరలేదన్నారు.
ALSO READ | జాతీయ పార్టీ డ్రామాకు తాళం పడింది
కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత స్వేచ్ఛ ఏ పార్టీలో లేదన్నారు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. కార్యకర్త కూడా సీఎంని కలిసే వెసులుబాటు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉందన్నారు. పార్టీ కార్యకర్తలు నారాజ్ అయితే తాము కుర్చీ దిగాల్సిందేనన్నారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామన్న ఆయన.. మరోసారి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలి ఢిల్లీలో రాహుల్ గాంధీ ప్రధాని కావాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్ని అభివృద్ధి పనులు చేస్తున్నామని.. అవన్నీ ప్రతి ఒక్క కార్యకర్త ప్రజలకు వివరించాలని సూచించారు. 2025 జనవరిలో కొంతమంది పార్టీ నాయకులకు పదవులు ఇస్తామన్నారు మహేశ్ కుమార్ . వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.