జనవరిలో కొంతమంది కాంగ్రెస్ నేతలకు పార్టీ పదవులు లభిస్తాయని టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ప్రకటించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలంటే కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. వచ్చే లోకల్ బాడీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే 37 కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటించామని, మరో 30 కార్పొరేషన్లకు త్వరలో చైర్మన్లను ప్రకటించనున్నామని వెల్లడించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని అంటున్న బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలే తమ పార్టీలోకి వస్తున్నారని చెప్పారు. కార్యకర్తలే తమ బలమని, వారు ఉన్నంత కాలం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని తెలిపారు. పార్టీలో జగ్గారెడ్డికి ప్రత్యేక మార్క్ క్రియేట్ చేశారని, ప్రతి నాయకులు ఆయనలా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, టీఎస్ఐసీసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, ఎమ్మెల్యే సంజీవ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, మార్కెట్ కమిటీ చైర్మన్ కుమార్, రామ్ చందర్ నాయక్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.