ఎన్నికల్లో ఓడించినా మీరు మారరా?

ఎన్నికల్లో ఓడించినా మీరు మారరా?
  • ప్రతిపక్ష నేత కేసీఆర్​కు పీసీసీ చీఫ్ మహేశ్​ కుమార్​ బహిరంగ లేఖ
  • మీ అరాచకాన్ని జనాలు ఎప్పటికీ మరువరు
  • పదేండ్లు గడీల పాలన చేసి ప్రజలకు కన్నీరు మిగిల్చిన్రు
  • అందెశ్రీపై కక్షగట్టి పదేండ్లు రాష్ట్ర గీతం లేకుండా  చేశారని ఫైర్​

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సెంటిమెంట్ పేరుతో పదేండ్లు అధికారం చేపట్టిన బీఆర్ఎస్..​ గడీల పాలన చేసి ప్రజలకు కన్నీరు మిగిల్చిందని పీసీసీ చీఫ్ మహేశ్​ కుమార్ గౌడ్ మండిపడ్డారు. పెత్తందారు పాలనతో విసిగిపోయిన ప్రజలు కేసీఆర్​ పాలనకు చరమగీతం పాడినా ఇంకా వారిలో, వారి కుటుంబ సభ్యులు, పార్టీ నేతల్లో మార్పు రాలేదని అన్నారు.  తెలంగాణ ఏర్పాటుకు పోరాడింది సబ్బండ వర్గాలని, ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ అని విశ్వసించిన ప్రజలు తమకు అధికారం కట్టబెడితే ఓర్వలేక కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఫైర్​ అయ్యారు. 

ఇంకా ఇదే పంథాలో కొనసాగితే ప్రజలు బీఆర్ఎస్​కు తగిన సమయంలో తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. ఆదివారం బీఆర్ఎస్ చీఫ్​, మాజీ సీఎం కేసీఆర్ కు మహేశ్​ కుమార్ గౌడ్ బహిరంగ లేఖ రాశారు.  బీఆర్ఎస్​ సర్కారులా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తమ ప్రభుత్వం మోసం చేయడం లేదని చెప్పారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​గాంధీ నేతృత్వంలో 2022 మే నెలలో వరంగల్​లో  ప్రకటించిన ‘రైతు డిక్లరేషన్’ హామీలను తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి చేసి,  రైతు ప్రభుత్వం అని నిరూపించుకున్నామని స్పష్టం చేశారు. 

మీ హయాంలో రుణమాఫీ ప్రక్రియ ఎంత ప్రహసనంగా మారిందో రైతులు ఇప్పటికీ చెప్పుకుంటారు. అరకొరగా మాఫీ చేసి, లక్షలాది మంది రైతుల రుణమాఫీ ఎగ్గొట్టిన మీకు, మీ పార్టీ వారికి కాంగ్రెస్​ను విమర్శించే నైతిక హక్కే లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం రూ. రెండు లక్షల లోపు రుణాలను మాఫీ చేసింది.  మా సంకల్ప బలంతో రూ.21 వేల కోట్లు మాఫీ చేశాం. రాష్ట్రంలో 25 లక్షల మంది రైతులు రుణమాఫీ సహాయం పొందడాన్ని మేం గర్వంగా భావిస్తున్నాం. 

 మీ హయాంలో పంట బీమా లేకపోవడంతో రైతాంగం నష్టపోగా.. కాంగ్రెస్ ప్రభుత్వం 42 లక్షలకుపైగా రైతులకు బీమా కవరేజీ కోసం రూ.1,433.33 కోట్ల ప్రీమియం చెల్లించింది. అకాల వర్షాలతో నష్టపోయిన 94 వేల మందికి పైగా రైతులకు రూ.95.38 కోట్ల పంట నష్టాన్ని చెల్లించి,  వారిని ఆదుకున్నది. సన్నాలు పండించిన వారికి రూ.500 బోనస్ చెల్లించింది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి సంక్రాంతికి రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది” అని లేఖలో పేర్కొన్నారు. 

పదేండ్ల తప్పులను సరిదిద్దుతున్నం

పదేండ్లలో తెలంగాణ అస్థిత్వానికి బీఆర్ఎస్​ అడుగడుగునా చేసిన అన్యాయాలను తాము సరిదిద్దుతుంటే ఓర్వలేక ఫాం హౌస్ నుంచి కేసీఆర్​ఇస్తున్న మార్గదర్శకాలతో  ఆ కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు తమపై అక్కసు వెళ్లగక్కుతున్నారని మహేశ్​కుమార్​ గౌడ్​ అన్నారు.   “అధికారంలో ఉన్న పదేండ్లు అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదు. ఆ పని కాంగ్రెస్  చేస్తే విమర్శించడం ఎంతవరకు సమంజసం?  అందెశ్రీపై కక్షగట్టి పదేండ్లు రాష్ట్ర గీతం లేకుండా చేసిన్రు. 

గద్దర్​కు మీరు కనీసం అపాయింట్​మెంట్​ కూడా ఇవ్వలేదు. మీరు చేసిన దౌర్భాగ్యపు పనులన్నింటినీ ఒక్కొక్కటీ చక్కదిద్దుతుంటే  మాపై మీ కుటుంబ సభ్యులు, మీ పార్టీ నేతలను ఉసిగొల్పడం సమంజసమా? ”  అని కేసీఆర్​ను మహేశ్​కుమార్​ గౌడ్​ ప్రశ్నించారు. ఇకనైనా కేటీఆర్, హరీశ్​రావు, కవితను అదుపులో పెట్టుకోవాలని, ప్రజాపాలన అందిస్తున్న తమ ప్రభుత్వంపై ఫేక్​ ప్రచారం మానుకొని సలహాలు, సూచనలు అందించాలని కేసీఆర్​కు హితవు పలికారు.

గాంధీ భవన్​లో ఘనంగా సంబురాలు

పీసీసీ చీఫ్‌గా మహేశ్ కుమార్ గౌడ్ 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా గాంధీ భవన్ లో ఘనంగా సంబురాలు నిర్వహించారు. నాంపల్లి ఇన్​చార్జ్ ఫిరోజ్ ఖాన్, ఫిషర్ మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి, గ్రంథాలయ పరిషత్ చైర్మన్ రియాజ్ లు భారీ కేక్ కట్ చేశారు. బాణసంచా పేల్చి సంబురాలు జరుపుకొన్నారు. మహేశ్ గౌడ్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు..