ఢిల్లీ: రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన కేబినెట్ విస్తరణపై టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. శనివారం (అక్టోబర్ 26) మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. మంత్రివర్గ విస్తరణ ఏఐసీసీ, ముఖ్యమంత్రి కనుసన్నలలో జరుగుతుందని.. నేను పార్టీ వ్యవహారాలు మాత్రమే చూస్తున్నానని అన్నారు. కేబినెట్ విస్తరణ పార్టీ హై కమాండ్ చూసుకుంటుందని స్పష్టం చేశారు.
త్వరలో పీసీసీ నూతన కార్యవర్గ నియామకం ఉంటుందని.. డీసీసీలుగా ఎమ్మెల్యేలతో పాటు సమర్థులకు కార్యవర్గంలో స్థానం ఉంటుందన్నారు. ఇతర పార్టీల నాయకుల చేరికలతో కొన్ని సమస్యలు తలెత్తాయని.. పాత కొత్త నేతలను సమన్వయం చేసుకోవాల్సి ఉందని అన్నారు. జీవన్ రెడ్డి సన్నిహితుడు మరణంతో మనస్తాపానికి లోనయ్యారని.. బాధతో ఆయన లేఖ రాశారన్నారు. జీవన్ రెడ్డి పార్టీలో సీనియర్ నాయకుడని.. ఆయనకు పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
కమీషన్ల కోసమే కాళేశ్వరం:
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కమీషన్ల కోసం కాళేశ్వరం డిజైన్ మార్చి వ్యయం పెంచారని ఆరోపించారు. కమీషన్ల కోసం కాళేశ్వరం కట్టారని.. ప్రజాధనం దుర్వినియోగం చేశారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవకతవకలపై కమిషన్ విచారణ జరపుతోందని.. కాళేశ్వరం వాస్తవాలు బయటకు రావాలని అన్నారు. అన్యాయంగా ప్రభుత్వం ఎవరిపైన కేసులు పెట్టదని.. అదే విధంగా తప్పు చేసిన ఎవరినీ వదలదని హెచ్చరించారు.
Also Read :- ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రత్యేక యాప్
రాష్ట్రంలో పొలిటికల్ బాంబు పేలుతాయంటూ మంత్రి పొంగులేటి చేసిన కామెంట్స్ స్పందిస్తూ.. గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన వారి గురించే పొంగులేటి మాట్లాడారని భావిస్తున్నానని అన్నారు. అక్కినేని ఫ్యామిలీ, సమంతపై కొండా సురేఖ మాటలను పార్టీ పరంగా సమర్ధించమన్నారు. వెంటనే కొండా సురేఖ తన మాటలు ఉపసంహరించుకున్నారని గుర్తు చేశారు.
డిసెంబర్లో శుభవార్తలు:
రానున్న డిసెంబర్ నెలలో కొన్ని శుభవార్తలు వింటారని మహేష్ గౌడ్ అన్నారు. మరోవైపు.. 2029 ఎన్నికలు మాకు ఫైనల్ అని.. రాష్ట్రం, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడమే లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి ఉంటుందని తెలిపారు. బీసీ విషయంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొంత డివియేట్ అవుతున్నారని.. ఆయనతో నేను, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ దీపదాస్ మున్సి మాట్లాడామని.. అన్ని సర్దుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. బీసీ కులగణనపై నవంబర్లో సమావేశాన్ని నిర్వహించాలని అనుకుంటున్నామని.. ఆ సమావేశానికి మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలను ఆహ్వానించామని తెలిపారు.